అమెరికా: ఆ విత్తనాలపై అమెజాన్‌ నిషేధం..!
అమెరికా: ఆ విత్తనాలపై అమెజాన్‌ నిషేధం..!

వాషింగ్టన్‌: అమెరికాలో మిస్టరీ విత్తనాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఆన్‌లైన్‌లో ఆర్డరు చేయకున్నా..కొన్ని అనుమానాస్పద విత్తనాలు పార్శిళ్ల రూపంలో వస్తున్నాయంటూ అమెరికాలో భారీస్థాయిలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అక్కడకు దిగుమతి అయ్యే విత్తనాలను సరఫరా చేయకూడదని ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కేవలం అమెరికాకు చెందిన అమ్మకందారుల విత్తనాలనే సరఫరాచేస్తామని స్పష్టంచేసింది.

కరోనా వైరస్‌ వ్యవహారంలో చైనా తీరుపై అమెరికా విమర్శలు గుప్పిస్తోన్న సమయంలోనే ఈ మిస్టరీ విత్తనాలు అమెరికాను ఆందోళనకు గురిచేశాయి. అమెరికన్లు ఆర్డరు చేయకున్నా అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు ఇంటికి పార్శిల్‌ రూపంలో చేరడం మొదలైంది. అలా కేవలం ఒక్కచోటుకే కాకుండా అమెరికాలోని దాదాపు 12రాష్ట్రాల్లో ఇలాంటి విత్తన ప్యాకెట్లు వస్తున్నాయని అక్కడి వ్యవసాయశాఖ గుర్తించింది. వీటిలో పుదీనా, తులసి, మందార, గులాబీ వంటి 14రకాల విత్తనాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ముఖ్యంగా అవి చైనా నుంచి వస్తున్నట్లు అనుమానించిన అధికారులు, ఆ ప్యాకెట్లను తెరవడం కానీ, అలా వచ్చిన విత్తనాలు నాటవద్దని హెచ్చరించారు. వీటన్నింటి నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే విత్తనాల విక్రయాన్ని తమ చేపట్టదని అమెజాన్‌ ప్రకటించింది. కేవలం అమెరికా కేంద్రంగా అమ్మకాలు జరిపే విత్తనాలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది.

Advertisement

Advertisement


మరిన్ని