‘క్యాపిటల్‌’ కాల్పుల ఘటన: నలుగురి మృతి
‘క్యాపిటల్‌’ కాల్పుల ఘటన: నలుగురి మృతి

వాషింగ్టన్‌: అమెరికా క్యాపిటల్‌ భవనంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాషింగ్టన్‌ డీసీ పోలీసులు తెలిపారు. 

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ బుధవారం (అక్కడి కాలమానం ప్రకారం) సమావేశమైన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు ‘క్యాపిటల్‌ భవనం’లోకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. 

15 రోజుల అత్యవసర స్థితి..

క్యాపిటల్‌ భవనంలో కాల్పుల ఘటన నేపథ్యంలో వాషింగ్టన్‌ డీసీలో మేయర్‌ మురియెల్‌ బౌజర్‌ కర్ఫ్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొందరు ఆంక్షలను ఉల్లంఘించి ఆందోళనలకు దిగారు. దీంతో నగర వ్యాప్తంగా 15 రోజుల పాటు అత్యవసర స్థితిని విధిస్తూ మేయర్‌ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

మొదలైన కాంగ్రెస్‌ ప్రక్రియ

దాదాపు నాలుగు గంటల హింసాత్మక ఘటనల తర్వాత యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశం మళ్లీ ప్రారంభమైంది. జో బైడెన్‌ గెలుపును వ్యతిరేకిస్తూ కొందరు రిపబ్లికన్‌ నేతలు అభ్యంతరం లేవనెత్తారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ మద్దతుదారులు ఇంకా క్యాపిటల్‌ భవనం బయటే ఉన్నారు. భవనం బయట పార్టీ జెండాలు పట్టుకుని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

 

ఇవీ చదవండి..

ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా లాక్‌
అమెరికా ఘటనపై ప్రధాని మోదీ స్పందన 


Advertisement

Advertisement


మరిన్ని