close
వూరికి చేయాల్సింది చాలావుంది.. 

వూరికి చేయాల్సింది చాలావుంది.. 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా.. వట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌.. అన్నారు మహాకవి గురజాడ. అంటే మాటల్తో సరిపెట్టకుండా మనకు చేతనయిన మేలును పదిమందికి పంచిపెట్టడమే. దేశానికి, పుట్టిన వూరికి విధేయులుగా అభివృద్ధిని విస్తరించేలా చేయడం మనకు మరింత శోభనిస్తుంది. ఈ కోవలోనే విదేశాల్లో స్థిరపడినా సొంతవూరి బాగు కోసం తనవంతు సేవ చేయాలనే తపనతో శ్రమిస్తున్నారు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రమేష్‌.

రమేష్‌ పుట్టింది మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్‌ గ్రామం. అదే గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. 1984లో ఏడో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. 1986లో తండ్రి మరణాంతరం సోదరుల సహకారంతో తన చదువును కొనసాగించాడు. ఆర్థిక పరిస్థితి బాగోకపోయినప్పటికీ ఎంటెక్‌ వరకు చదివాడు. 1999లో ఐటీ కొలువు సంపాదించి అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు.

పదకొండు సంవత్సరాల తర్వాత 2010లో తన సొంతూరికి తిరిగి వచ్చాడు.ఎంతో కాలం తర్వాత తిరిగొస్తున్న అతని మనసులో వూరి గురించి ఎన్నో ఆలోచనలు. చిన్నప్పటి పరిస్థితులు నేడు అభివృద్ధి మాటున అడుగంటి వుంటాయని భావించాడు. వూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెంది వుంటుందని ఆశపడ్డాడు. కానీ వూరిలో అడుగుపెట్టగానే అతని ఆలోచనలన్నీ పటాపంచలయ్యాయి. చిన్నతనంలో ఎటువంటి పరిస్థితులైతే అతను ఎదుర్కొన్నాడో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా ఉండటాన్ని గమనించి నివ్వెరపోయాడు.

తను చదివిన పాఠశాల పరిస్థితి మరీ దారుణంగా ఉండటం గమనించాడు. అక్కడి గోడలు శిథిలమై వాటిలో నుంచి పురుగులు రావడం... వాటి మధ్యలో విద్యార్థులు కూర్చొని చదువుకోవడం చూసి చలించిపోయాడు. గ్రామ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన అతను తన గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో మొదటగా ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసి తను చదువుకున్న పాఠశాలకు ఫర్నిచర్‌ సమకూర్చాడు.

చట్టుపక్కల గ్రామాల్లోని రైతులతో మాట్లాడి నష్టపోయిన పత్తి రైతుల గురించి తెలుసుకొన్నాడు. వారికి బాసటగా నిలవటానికి నిర్ణయించుకున్నాడు. పత్తి పంటను వేయొద్దు అని చెప్పడమే కాకుండా టీడీఎఫ్ వారి స‌హ‌కారంతో కంది విత్తనాలు ఉచితంగా గ్రామస్థులకు అందించాడు. చుట్టుపక్కల గ్రామాల సర్పంచులతో మాట్లాడి గ్రామాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని కోరాడు. సాంకేతిక ఒరవడి ఉపయోగించి వ్యవసాయానికి కావాల్సిన సలహాలు, సూచనల కోసం ‘డయల్‌ యువర్‌ విలేజ్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. ఇందులో వ్యవసాయ నిపుణులతో రైతులకు సలహాలను అందించే సౌకర్యాన్ని కల్పించాడు. ప్రభుత్వ సహకారంతో వూరిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నాడు.

‘‘నా వూరికి నేను చేసింది కొంతే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని రమేష్‌ అతని మనసులోని తపన వ్యక్తపరుస్తున్నాడు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.