close
రావొద్దనలేక షరతులు పెట్టారు

పలు సందర్శక ప్రాంతాల్లో పర్యాటకులపై ఆంక్షలు

పర్యాటకుల సందర్శన పెరగాలి.. ఆదాయంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి రావాలని ప్రభుత్వాలు భావిస్తుంటాయి. దాని కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను అందిస్తుంటాయి. అక్కడి స్థానికులు కూడా సందర్శకులను అంతే చక్కగా ఆదరిస్తుంటారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో స్థానికులే సందర్శకుల రాకను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం ఆంక్షలు విధిస్తూ.. పర్యాటకుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఎందుకలా చేస్తున్నాయి... అలాంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం..!

ప్రవేశ రుసుం 11 డాలర్లు

వందకుపైగా ఐలాండ్స్‌ ఉన్న నగరం వెనిస్‌. నగరమంతా కాలువలు.. ఎక్కడికి వెళ్లాలన్నా పడవ ప్రయాణమే. ఈ సుందర నగరానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాలువ ఒడ్డున ఉండే హోటళ్లు, ఇళ్లలో పర్యాటకులు ఉండేందుకు ఇష్టపడటంతో స్థానికులకు అద్దె ఇళ్లే లభించట్లేదట. 2030 నాటికి వెనిస్‌లో స్థానికులు నివసించలేకపోవచ్చని గతంలో టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొంది. ఇది చాలు అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాదు అక్కడికి ఒక్క రోజు విహారయాత్రకు వచ్చే పర్యాటకులు స్థానిక వ్యాపారుల వద్ద ఏమీ కొనట్లేదట. దీంతో ఆర్థికంగానూ వారి నుంచి ఉపయోగం లేదని భావించిన ప్రభుత్వం పర్యాటకుల నుంచి ప్రవేశ రుసుముగా 11 డాలర్లు వసూలు చేస్తోంది.


చట్టం తీసుకొచ్చి... 

స్పెయిన్‌లోని బార్సిలోనా నగరానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రోమన్‌ సంస్కృతి, చారిత్రక మ్యూజియం వంటి సందర్శక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే పర్యాటకుల వల్ల ఎయిర్‌ బీఎన్‌బీ వంటి రెంటల్‌ సంస్థలు అద్దెను పెంచుతున్నాయట. దీంతో బడ్జెట్‌ పరిధిలో తమకు అద్దె ఇళ్లు దొరకడం కష్టమవుతోందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. అందుకే పర్యాటకుల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమస్యను గుర్తించిన అక్కడి ప్రభుత్వం బార్సిలోనాకు వచ్చే పర్యాటకుల సంఖ్యపై ఆంక్షలు విధిస్తూ 2017లో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. నగరంలో బస వసతికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యలో మాత్రమే పర్యాటకులను నగర సందర్శనకు అనుమతిస్తోంది. 


ఒకసారి నాలుగు వేల మందినే...

‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ వెబ్‌సిరీస్‌లో రాజులు భూమిపై దిగే సన్నివేశాలు క్రొయేషియాలోని డుబ్రోవ్‌నిక్‌లో చిత్రీకరించారు. దీంతో ఆ వెబ్‌ సిరీస్‌ ఎంత పాపులర్‌ అయిందో.. ఈ నగరం కూడా అంతే పాపులర్‌ అయింది. పర్యాటకుల తాకిడీ పెరిగింది. సందర్శకుల వల్ల అక్కడ రెస్టారెంట్లు, హోటళ్లు అనేకం పుట్టుకొచ్చాయి. చిన్న చిన్న కిరాణ, ఇతర దుకాణాలు కూడా తీసేసి హోటళ్లు కడుతుండటంతో స్థానికులకు వంటింట్లో సామగ్రి దొరకడం కూడా కష్టమైపోతుందట. అందుకే అక్కడి ప్రభుత్వం 2017 నుంచి సందర్శకులపై ఆంక్షలు విధించింది. క్రూయిజ్‌ నౌకలపై వచ్చే సందర్శకుల్లో ఒక్కసారి 4వేల మందిని మాత్రమే నగరంలోని అనుమతిస్తున్నారు.


భూటాన్‌ వెళ్లాలంటే... 

యూరప్‌ ఖండంలోనే కాదు.. ఆసియా ఖండంలోని పలు దేశాలు కూడా పర్యాటకం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందులో భూటన్‌ ఒకటి. హిమాలయ పర్వతాలు, ఎత్తైన కొండలు కలిగిన ఆధ్యాత్మిక సుమనోహర ప్రదేశమిది. ప్రకృతికి, పర్యావరణానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే అక్కడి స్థానికులు పర్యాటకుల రాకపై ఆందోళన చెందుతున్నారు. సందర్శకుల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సందర్శకుల సంఖ్యను నియంత్రించడంలో భాగంగా భూటాన్‌ పర్యాటక శాఖ వారి నుంచి ఛార్జీలు వసూలు చేస్తోంది. ఒక్కొక్కరికి 200 డాలర్ల నుంచి 250 డాలర్లు రుసుముగా విధించింది.


మచుపిచు వెళ్లాలంటే గైడ్‌ తప్పనిసరి..

ప్రపంచ వింతల్లో ఒకటైన మచుపిచు కూడా ఇదే తరహా సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కోట గోడలపై పేర్లు రాస్తూ.. గీతలు గీస్తూ పాడు చేస్తున్నారట. దీంతో స్థానిక ప్రభుత్వం సందర్శకులపై ఆంక్షలు విధించింది. 2004 నుంచి ఈ ప్రాంతానికి రావాలంటే గుర్తింపు పొందిన గైడ్‌ ఒకరు వెంట ఉండాలని నిబంధన తీసుకొచ్చింది. 2017 నుంచి టైం స్లాట్స్‌ ద్వారా సందర్శనకు అనుమతిస్తోంది. 


క్రూయిజ్‌లు రాకుండా... 

అద్భుతమైన కట్టడాలతో కూడిన ఐలాండ్‌ శాంటోరిని. ఇక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాన్ని చూడటానికే పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. అలా ఏటా సుమారు 20లక్షల మంది దాకా వస్తుంటారట. అందులో ఏటా 8.5 లక్షల మంది పర్యాటకులు సముద్రం గుండా క్రూయిజ్‌ నౌకలో వస్తున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో వస్తున్న క్రూయిజ్‌ నౌకలు ఐలాండ్‌కు యాంకర్‌తో కట్టేసి నిలుపుతుండటంతో ఐలాండ్‌ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అందుకే శాంటోరిని ప్రభుత్వం క్రూయిజ్‌ నౌకల సంఖ్యను తగ్గించింది.


అయినా తాకిడి పెరుగుతోంది... 

భూమికి దక్షిణ ధ్రువంలో ఉండే అత్యంత శీతల ప్రాంతం అంటార్కిటికా. చలిని కూడా బేఖాతరు చేస్తూ పర్యాటకులు అక్కడి వెళ్తున్నారు. పర్యాటకుల వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అక్కడ భారీ క్రూయిజ్‌ నౌకలను నిషేధిస్తూ 2009లో అంటార్కిటిక్‌ ఒప్పందం జరిగింది. అయినా సందర్శకుల తాడికి రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. 


ఆరు రెట్లు ఎక్కువ పర్యాటకులు... 

‘హానీమూన్‌ హెవెన్‌’గా పిలిచే ఉత్తర అంటార్కిటికాలో సేచెల్లిస్‌ ఐలాండ్‌ ఎంతో ప్రత్యేకమైంది. ఇక్కడ మనుషులు జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇక్కడ కొందరు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అయితే ఉన్న జనాభా కన్నా ఆరు రెట్లు ఎక్కవగా పర్యాటకులు వస్తున్నారని.. అధిక జనాభాతో ఐలాండ్‌కు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. లోపల జీవరాశులు కనిపించేలా క్ట్రిస్టల్‌ క్లియర్‌గా ఉండే అక్కడి సముద్రం కలుషితమవుతుందని అంటున్నారు. మనుషుల్లో ఉండే వేడి సముద్రంలోకి చేరితే.. జలాచర జీవుల ప్రాణాలు పోతాయని చెబుతున్నారు. మరికొన్నాళ్లు కొనసాగితే ఇక్కడా ఆంక్షలు వస్తాయని స్థానికులు అనుకుంటున్నారు. 


అసలు రానివ్వడమే లేదు

థాయ్‌లాండ్‌లోని కోకాయ్‌ ఐలాండ్‌ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునేది. అయితే అక్కడి ప్రభుత్వం కోకాయ్‌కి పర్యాటకులు వెళ్లకుండా మొత్తానికే నిషేధం విధించింది. అక్కడి ఐలాండ్‌లో పగడపు దిబ్బలు పర్యాటకుల వల్ల దెబ్బతింటున్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


ఒకసారి 400 మందే... 

ఆస్ట్రేలియా తీరంలో 18 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉందీ లార్డ్‌ హోవె ఐలాండ్‌. ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన ప్రాంతంగానూ పేరుంది. అందుకే ఈ ఐలాండ్‌ను చేరేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. అయితే అక్కడి పగడపు దిబ్బలను సంరక్షించడం కోసం స్థానిక ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఏకకాలంలో కేవలం 400 మంది పర్యాటకులకు మాత్రమే ఐలాండ్‌ సందర్శనకు అవకాశముంటుంది. 


10లక్షలు మందిని తగ్గించి...

ఇటలీలోని చింకు టెర్రె జాతీయ పార్క్‌ సందర్శనకు ఏటా 25 లక్షల మంది వస్తుంటారట. కనుచూపు మేరలో అడవి, ఆ వెనుక సముద్రంతో ఈ పార్క్‌ వైవిధ్యంగా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకుల వల్ల వల్ల పార్క్‌లో పర్యావరణం దెబ్బతింటోందని స్థానిక ప్రభుత్వం భావించింది. అందుకే పర్యాటకుల సంఖ్యను 25 లక్షల నుంచి  15లక్షలకు కుదించింది.


- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.