close
ఇర్వింగ్‌ నగరంలో పంద్రాగస్టు వేడుకలు

ఎంజీఎంఎన్‌టీ ఆధ్వర్యంలో నిర్వహణ

డల్లాస్‌: అమెరికా టెక్సాస్‌లోని ఇర్వింగ్‌ నగరంలో 73వ భారత స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ ప్లాజాలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎంజీఎంఎన్‌టీ) ఆధ్వర్యంలో ఈ జెండా వందనం నిర్వహించారు. పిల్లలు, పెద్దల కరతాళ ధ్వనుల మధ్య ఎంజీఎంఎన్‌టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఇర్వింగ్‌ నగర మేయర్‌ ప్రో టెమ్‌ ఆస్కార్‌ వార్డ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్రిస్కో ఐఎస్‌డీ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ గోపాల్‌ పోణంగి, కాపెల్‌ ఐఎస్‌డీ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ మనీశ్‌ సేఠి, ఆలెన్‌ ఐఎస్‌డీ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ వాత్స రామనాథన్‌, కొల్లిన్‌ కమ్యూనిటీ కాలేజ్‌ డిస్ట్రిక్ట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ రాజ్‌ మేనన్‌, ఏవీపీ-ఎక్స్‌టెర్నల్‌&లెజిస్లేటివ్‌ అఫైర్స్‌ ఏటీ అండ్‌ టీ టై బ్లెడ్‌సోయ్‌ తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సంగీత ఉపాధ్యాయిని స్వాతి తన విద్యార్థులతో కలిసి దేశ భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం ఎంజీఎంఎన్‌టీ బోర్డు.. కార్యక్రమానికి హాజరైన అధికారులు, అతిథులను సత్కరించింది. బోర్డు సెక్రటరీ రావ్‌ కాల్వల అతిథులను ప్రేక్షకులకు పరిచయం చేశారు. 

అనంతరం ఎంజీఎంఎన్‌టీ ఛైర్మన్‌ డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల కష్టం, త్యాగఫలం వల్లే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. ముఖ్యంగా గాంధీ అనుసరించిన అహింసా మార్గం, దండి మార్చి, ఉప్పు సత్యాగ్రహం తదితర అంశాలు ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం పొందడంలో కీలక భూమిక పోషించాయని కొనియాడారు. ప్రస్తుతం భారత దేశం నవ పథంలో పయనిస్తోందని, డెభ్బై ఏళ్లుగా సాధ్యం కాని రీతిలో ఆర్టికల్‌ 370 వంటి సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారని వివరించారు. గడిచిన 70 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు. 6.8 శాతం వృద్ధి రేటుతో ప్రస్తుత దేశ జీడీపీ 3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ఎంజీఎంఎన్‌టీ కో ఛైర్మన్‌ జాన్‌ హామండ్‌ ఈ సందర్భంగా దన్యవాదాలు తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని