close
భారీగా హెచ్‌-1బీ వీసాల తిరస్కరణ!

2018 అక్టోబరు- డిసెంబరులో రికార్డు స్థాయికి 
ఐటీ కంపెనీలకు పెరుగుతున్న భారం

దిల్లీ/ పుణె: ఉద్యోగావకాశాల్లో అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంతో.. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత ఐటీ కంపెనీల హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఏడాదికాలంలో దిగ్గజ ఐటీ సంస్థలు- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రోల వీసా దరఖాస్తులను దాదాపు సగం వరకు అమెరికా తిరస్కరించినట్లు తెలుస్తోంది. నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) నివేదిక ప్రకారం.. టీసీఎస్‌ వీసాల తిరస్కరణ రేటు 2018 అక్టోబరు- డిసెంబరులో 37 శాతానికి పెరిగింది. 2015లో ఇది 6 శాతంగా ఉంది. వీసాలు తిరస్కరించిన దరఖాస్తుల సంఖ్య రికార్డు గరిష్ఠానికి తాకాయని నాస్కామ్‌లోని అంతర్జాతీయ వ్యాపార విభాగ వైస్‌ ప్రెసిడెంట్‌ శివేంద్ర సింగ్‌ అన్నారు. ఈ పరిణామం కీలకమైన అమెరికా మార్కెట్లలో క్లయింట్లకు సేవలందించే విషయంలో భారత ఐటీ కంపెనీల సామర్థ్యంపై ప్రభావాన్ని చూపుతోందని అన్నారు. అదే సమయంలో వ్యయాల భారాన్నీ పెంచుతోందని తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌కు నిరాకరించాయి.

వలసల రేటు పైకి.. 
వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేయాలంటూ అమెరికాతో పరిశ్రమ సంఘం ఎప్పటికప్పుడు నివేదిస్తూనే వస్తోందని సింగ్‌ అన్నారు. వీసాల ప్రక్రియ సులభతరం ద్వారా 75 శాతానికి పైగా ఫార్చ్యూన్‌ 500 కంపెనీలతో కలిసి పనిచేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థ పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత కంపెనీలూ తమ వంతు పాత్ర పోషించడాన్ని కొనసాగిస్తాయని తెలిపారు. ‘తిరస్కరణ దరఖాస్తుల సంఖ్య మునుపున్నెడూ లేని విధంగా ఉండటంతో పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోంది. తిరస్కరణ రేటు లేదా రిక్కెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌ (ఆర్‌ఈఎఫ్‌)లు మరింత పెరిగితే అదనపు పత్రాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అది పనిభారాన్ని పెంచడమే కాకుండా కంపెనీలకు వ్యయభరితమూ అవుతుందని సింగ్‌ పేర్కొన్నారు. మరోవైపు హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల అనుమతులు తగ్గడం కొంత మేర వలసల రేటు పెరిగేందుకు కారణమైందని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇన్ఫోసిస్‌ వెల్లడించడం గమనార్హం. అమెరికన్లకే అధిక వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగావకాశాల్లోనూ వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్‌ ప్రభుత్వం అధకారిక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా దరఖాస్తుల పరిశీలనలో కాస్త కఠిన వైఖరిని అమెరికా అవలంబిస్తోంది. ఈ కారణంతోనే వీసా దరఖాస్తులు గణనీయ స్థాయిలో తిరస్కరణకు గురవుతున్నాయి.

వార్తలు / కథనాలు

మరిన్ని