close
‘కశ్మీర్‌’పై భారత్‌కు మద్దతివ్వండి

ట్రంప్‌కు భారతీయ అమెరికన్‌ల అభ్యర్థన

వాషింగ్టన్‌: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర పునర్విభజనకు మద్దతు పలకాల్సిందిగా భారతీయ అమెరికన్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కోరారు. ఇదే సమయంలో సీమాంతర ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న పాకిస్థాన్‌ను కట్టడి చేయాలని ట్రంప్‌ను అభ్యర్థించారు. దీనివల్ల కశ్మీర్‌ సమస్యకు కొంతైనా పరిష్కారం లభించే అవకాశముందని తాము ట్రంప్‌కు వివరించినట్లు హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ (హెచ్‌ఏఎఫ్‌) ఎండీ సమీర్‌ కాల్రా వెల్లడించారు. తాత్కాలిక నిబంధనలైన ఆర్టికల్‌ 370, 35ఏ ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో కీలకమైందని ఆయన అన్నారు. తద్వారా యావత్‌ భారతంలో అమలవుతున్న చట్టాలన్నీ కశ్మీర్‌కూ వర్తిస్తాయని అన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం.. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులకు ఇచ్చే బహుమతి అని ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ భాజపా (ఓఎఫ్‌బీజేపీ) అధ్యక్షుడు కృష్ణా రెడ్డి అన్నారు. ఆనాడు నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాన్ని ఇప్పుడు మోదీ సరిదిద్దారని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాబోయే రెండు రోజుల్లో ఓఎఫ్‌బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 
ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన చర్యల వల్ల కశ్మీర్‌లో శాంతి నెలకొనే అవకాశముందని పలు భారతీయ అమెరికన్‌ సంఘాలు అభిప్రాయపడ్డాయి. అంతేకాక లండన్‌కు చెందిన ఇండో-యురోపియన్‌ కశ్మీర్‌ ఫోరం (ఐఈకేఎఫ్‌), ఒట్టావాకు చెందిన ఇండో-కెనడియన్‌ కశ్మీర్‌ ఫోరం తదితర సంఘాలు కూడా మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి.

వార్తలు / కథనాలు

మరిన్ని