close
వైభవంగా ‘త్రిగళ నవావధానం’

కాలిఫోర్నియా: అమెరికాలోని శాక్రమెంటో, కాలిఫోర్నియా నగరాల్లో సువిధ స్వచ్ఛంద సంస్థ వారి తెలుగు మిసిమి విభాగం ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ మందిరంలో జులై 13న త్రిగళ నవావధానం వైభవంగా జరిగింది. తెలుగు అవధాన చరిత్రలో మొట్టమొదటి సారిగా ముగ్గురు అవధానులతో మూడు భాషల్లో (వ్యవహారిక తెలుగు, అచ్చ తెలుగు, సంస్కృతం) ఒకే వేదికపై ఒకే సమయంలో తొమ్మిది అంశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అపూర్వ కార్యక్రమానికి శాక్రమెంటో, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికిపైగా విచ్చేసి ఆరు గంటల పాటు కార్యక్రమాన్ని వీక్షించారు. తమిళనాట తెలుగులో అనేక రచనలు చేసిన కీర్తిశేషులు జయలక్ష్మి  కుమారుడు శ్రీనివాసు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పాలడుగు శ్రీచరణ్, నేమాని సోమయాజులు అవధానులుగా వ్యవహరించారు. అతి క్లిష్టమైన సంచాలకత్వ బాధ్యతను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రజ్ఞా భాస్కర ఆచార్య శ్రీరాణి సదాశివ మూర్తి తీసుకున్నారు.

ఈ అవధానం మొత్తం తొమ్మిది అంశాలలో జరిపించారు. నిషిద్ధాక్షరిని తల్లాప్రగడ రామచంద్ర రావు, దత్తపదిని పుల్లెల శ్యామసుందర్, సమస్యను మాజేటి సుమలత, వర్ణనను బుడమగుంట మధు, న్యస్తాక్షరి పంచాంగాన్ని అప్పాజీ నిర్వహించారు. కొత్త అంశాలు ఆంగ్ల అనువాదం, అప్రస్తుతములను మైలవరపు సాయికృష్ణ నిర్వహించారు. ఆరేళ్ల చిన్నారి మద్ది అథర్వ చేసిన పురాణపఠనం ఈ కార్యక్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, ప్రముఖ భాషా శాస్త్రజ్ఞులు గంగిశెట్టి లక్ష్మీనారాయణ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవధానులను కార్యక్రమ నిర్వాహకులు వెంపటి భాస్కర్‌ బిరుదులతో సత్కరించారు. సువిధ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వెంపటి భాస్కర్ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దురిశెట్టి రావు, శ్రీధర్, శశాంక్ కార్యక్రమ నిర్వహణలో సహకారాన్ని అందించారు. మైలవరపు సాయికృష్ణ దంపతులు, మద్ది అవినాశ్‌ దంపతులు, బైని జితేంద్ర, యనమండ్ర శ్రీకాంత్ దంపతులు, చండ్ర నగేశ్‌ దంపతులు, బుడమగుంట మధు దంపతులు, హరీశ్ దంపతులు అవధాన కార్యక్రమ నిర్వహణలో కలక భూమిక పోషించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని