close
తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా నిరంజన్‌

వాషింగ్టన్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు చెందిన ‘తానా ఫౌండేషన్‌’ ఛైర్మన్‌గా శృంగవరపు నిరంజన్‌ వరసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులకు తానా ఫౌండేషన్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపన్న హస్తం అందిస్తోంది. తానా ఛైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా నిరంజన్‌ మాట్లాడుతూ.. తానా ఫౌండేషన్‌ తరఫున రాబోయే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్య రంగంలో సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. అమెరికాలో తెలుగు భాషకు, సంస్కృతుల పరిరక్షణకు సర్వదా కృషి చేస్తామని వెల్లడించారు. అమెరికాలో తెలుగు వ్యాప్తికి, తెలుగువారందరి సమైక్యతకు కృషి చేస్తామని అన్నారు. ఇంతటి కీలక బాధ్యతలు తనకు అప్పగించినందుకు తానా ప్రముఖులందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు.  ముఖ్యంగా తానా అధ్యక్షులు జయశేఖర్‌, తానా మాజీ అధ్యక్షులు సతీష్‌ వేమన, గంగాధర్‌ నాదెళ్ల, జయరాం కోమటిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

గతంలోనూ నిరంజన్‌ తానాలో క్రియాశీలక పదవుల్లో పనిచేశారు. 2009-11 వరకు తానా ఫండ్‌ రైజింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా, 2013-15 వరకు తానా ఫౌండేషన్‌ ట్రస్టీగా, 2015లో డెట్రాయిట్‌ తానా మహాసభ కోశాధికారిగా, 2015-17 వరకు తానా ఫౌండేషన్‌ కోశాధికారిగా, 2017-19 తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 
 

వార్తలు / కథనాలు

మరిన్ని