close
లండన్‌లో వైభవంగా వార్షిక బోనాలు‌

లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం (టీఈఎన్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి దాదాపు 600 మంది తెలుగువారు హాజరయ్యారు. ఈ వేడుకలకు లండన్‌కు చెందిన రాజకీయ ప్రముఖులు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎనిమిదేళ్లుగా లండన్‌లో నిర్వహిస్తున్న బోనాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని వీరేంద్ర శర్మ అన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాల పండగ నిర్వహణ, హిందూ సంప్రదాయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడం సంతోషకరమని మరో నేత సీమా మల్హోత్రా ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక ఛైర్మన్‌ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. భారత్‌ వెలుపల మొట్టమొదటి సారిగా 2011లో బోనాలు నిర్వహించారని.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు బోనాల పండగను అత్యంత వైభవంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను వ్యాప్తి చేస్తూ అందరితో కలిసి పని చేస్తున్నామని సంస్థ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ చెప్పారు. భారతీయ సంప్రదాయాలు, కట్టుబాట్లను మన భవిష్యత్‌ తరం మర్చిపోకుండా ఉండేలా మన వంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీఈఎన్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో పుట్టి పెరిగే భారత సంతతి పిల్లలను చిన్నతనం నుంచే భారతీయ పండుగల్లో భాగస్వాములను చేయాలని.. అప్పుడే వారు మన మూలాలు గుర్తుపెట్టుకుంటారని టీఈఎన్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు రంగు వెంకట్‌ వివరించారు.

బోనాల కార్యక్రమంలో భాగంగా స్థానిక లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయంలో మహిళలందరూ దుర్గా మాతకు బోనం సమర్పించి ఓడిబియ్యం సమర్పించిన తర్వాత లండన్ పుర విధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం క్రాన్‌ఫోర్డ్‌ కళాశాల ఆడిటోరియంలో పూజా కార్యక్రమాల తర్వాత మీనాక్షి అంతటి అధ్యక్షతన భరత నాట్యం, గీతాలాపన, నృత్యాలు, చిన్నారుల నాట్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. బోనాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన వారికి, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి టీఈఎన్‌ఎఫ్‌ సభ్యులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ జమ్ముల, స్వామి ఆశ, వెంకట్ ఆకుల, మహేశ్‌ చట్ల, బాలకృష్ణ రెడ్డి, శేషు అల్ల, నరేంద్ర వర్మ, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణి, సవిత, సీత, శౌరి , దివ్య, సాయి లక్ష్మి, శిరీష, అశోక్ మేడిశెట్టి, నర్సింహా రెడ్డి తిరుపరి, రాజు కొయ్యడ, రవి కూర, నరేందర్, మల్లేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని