close
జులై 4 నుంచి తానా 22వ మహాసభలు

జులై 6 వరకూ నిర్వహణ 
వేదిక కానున్న వాషింగ్టన్‌ డీసీ 

అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ సభలు ఈ నెల ఆరోతేదీ వరకూ జరగనున్నాయి. వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఇందుకు వేదిక కానుంది. తొలిరోజున మహాసభల ప్రారంభానికి సూచనగా అతిథులను ఆహ్వానిస్తూ వందమంది చిన్నారులతో భారీ నృత్యరూపకాన్ని ప్రదర్శించనున్నారు. అదే రోజున తానా పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ మ్యుజికల్‌ నైట్‌, సినీనటుడు శివారెడ్డి వినోద కార్యక్రమం తదితరాలు ఉంటాయి. రాత్రికి తానా ఎక్స్‌లెన్స్‌ పురస్కారాలు అందిస్తారు. రెండో రోజు తానా పరేడ్‌ నిర్వహిస్తారు. ‘ఎ మ్యుజికల్‌ జర్నీ విత్‌ ఎం.ఎం.కీరవాణి’, ‘గాయని సునీతతో లైవ్‌’ తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుణ్ని మహాసభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ వేర్వేరు కార్యక్రమాల్లో కీలకోపన్యాసాలు చేయనున్నారు. ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ లీడర్‌షిప్‌’ అనే అంశంపై భారత్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ప్రసంగిస్తారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సినీ రచయిత కె.విజయేంద్రప్రసాద్‌, నిర్మాత అశ్వనీదత్‌ తదితరులు మహాసభల్లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు వేడుకలకు హాజరుకానున్నారు. స్వామి పరిపూర్ణానంద, యేర్పేడు స్వామీజీ తదితరుల ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు మేడసాని మోహన్‌ అష్టావధాన కార్యక్రమం ఉంటుంది. నాటి సాహిత్యం-నేటి సమాజం, సాహిత్యంలో మహిళా నాయకులు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చివరి రోజున శ్రీనివాస కల్యాణం జరపుతారు. తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన అధ్యక్షోపన్యాసంతో తొలి రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 22వ తానా మహాసభలకు డా.ముల్పూరి వెంకటరావు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.

నూతన అధ్యక్షుడిగా తాళ్లూరి జయశేఖర్‌

బూర్గంపాడు: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభల చివరి రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన తాళ్లూరి జయశేఖర్‌ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సతీష్‌ వేమన తానా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నుంచి జయశేఖర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. తానా అధ్యక్ష బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తానని జయశేఖర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ చెప్పారు.

వార్తలు / కథనాలు

మరిన్ని