close
జన్మభూమి..సేవాస్మరామి

స్ఫూర్తినందిస్తూ..  ఆదర్శంగా తీర్చిదిద్దుతూ..
ప్రగతిపథాన నడిపిస్తున్న ప్రవాస తెలుగువారు
విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి

* వంద మందికి నీవు సహాయ పడకపోవచ్చు.. కనీసం ఒక్కరికైనా సాయం అందించు..
- మదర్‌థెరెసా
* స్వార్థం చిట్ట చివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా నిలుస్తుంది.
* సాయం చేయడానికి ఉండాల్సింది డబ్బుకాదు.. మంచి మనసు
* ‘ఓదార్చే మనసు కన్నా.. సాయం చేసే గుణం మిన్న’
* నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.
- డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌
* అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగానైనా మారాలి

ఏ దేశమేగినా ఎందుకాలిడినా..
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని..
నిలపరా నీ జాతి నిండు గౌరవము..

అంటూ జన్మభూమిపై రాయప్రోలు సుబ్బారావు రాసిన గేయస్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు మన తెలుగు ప్రవాసీయులు. వారు ఉంటున్న చోట మన జాతి గౌరవాన్ని నిలబెడుతూనే కన్న భూమి రుణం తీర్చగ కదిలొచ్చారు.. కని, పెంచిన పల్లె తల్లిని అభివృద్ధి పథాన నడిపించేందుకు కంకణం కట్టుకున్నారు.. కొందరు జ్ఞానాన్ని పంచేందుకు ‘బడి’లో అక్షరజ్యోతి వెలిగిస్తున్నారు.. మరికొందరు పల్లెవాసుల ఆరోగ్య కాంతి విరబూయించేందుకు వైద్యానికి ఊపిరిపోశారు.. మేము ఎక్కడున్నా జన్మభూమిని మరువం అంటూ సగర్వంగా చెబుతూ... చేయూత అందిస్తున్న తీరుపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

- ఈనాడు, మెదక్‌

ఆధునికీకరణం.. అగ్రస్థానం

చిత్తూరు జిల్లా పలమనేరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను చూస్తే ఔరా అనాల్సిందే..! అన్ని సౌకర్యాలతో అలరాలుతోంది ఈ విద్యాలయం. కారణం.. కళాశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం జర్మనీలో ఉంటున్న రామమూర్తి అందించిన సహకారమే. ఈయన అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డారు. తన తండ్రి తీర్థం కృష్ణయ్యశెట్టి పేరిట కళాశాలకు రూ.కోటి విరాళం అందించారు. ఆ మొత్తంతో ఎనిమిది గదులు, ఒక హాలు నిర్మించారు. కంప్యూటర్‌ ల్యాబ్‌నూ అందుబాటులోకి తెచ్చారు. దీంతో కళాశాల రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం ఈ కళాశాల పలు అంశాల్లో చిత్తూరు జిల్లాలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి వసతులు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో మరెక్కడా లేకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థుల సంఖ్య 1,250 దాటింది.
- న్యూస్‌టుడే, పలమనేరు

శ్రీమంతుడి శ్రీకారం..

తన ఉజ్వల భవితకు పునాది వేసిన బడి బాగుకు శ్రీకారం చుట్టారు.. పిల్లల మేలు కోరి అన్ని వసతులు సమకూర్చి మనసున్న శ్రీమంతుడు అనిపించుకున్నారు డాక్టర్‌ కె.వి.నాయుడు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం వేపగుంట గ్రామానికి చెందిన ఈయన అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డారు. ఒకప్పుడు రేకులషెడ్డులో ఉన్న కనకంపాళెం ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితిని మార్చేందుకు రూ.30 లక్షలకు పైగా సాయం అందించి భవనాలు నిర్మించారు. వేదికతో పాటు అదనపు భవనాల నిర్మాణానికి భూమి కొనుగోలు చేసి ఇచ్చారు. గ్రామంలో రూ.20 లక్షలతో సామాజిక భవనం, కల్యాణ మండపం నిర్మించారు. వేపగుంట గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు సైతం భవనం సమకూర్చడంతో పాటు పిల్లలు కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయించారు. ఏటా ప్రతిభావంతులకు అవార్డులు అందిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అమెరికా నుంచి వచ్చి పాఠశాలలను సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. 
- న్యూస్‌టుడే, పుత్తూరు

ఇంజినీరు భోళాతనం

తన ఊరు అభివృద్ధి పథాన నడవాలంటే విద్యతోనే సాధ్యమని నమ్మారు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ గ్రామానికి చెందిన శంకరరావు. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి మెకానికల్‌ ఇంజినీరుగా స్థిరపడ్డారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ, మహనీయుల ప్రతిమల ఏర్పాటుతో పాటు తాగునీటి వసతి కల్పించారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, రాత పుస్తకాలు, ఇతర సామగ్రి అందిస్తున్నారు. యువత సహకారంతో గ్రామంలోని పిల్లలు పాఠశాలలో ఉండేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఏటా క్విజ్‌, వ్యాస రచనతోపాటు కబడ్డీ, వాలీబాల్‌ తదితర పోటీలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నారు. స్థానికంగా శివాలయం నిర్మాణానికి రూ.13 లక్షలు వెచ్చించారు.
- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

‘అంకానా’ ఆరోగ్యమస్తు

విశాఖపట్టణంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో విద్య అభ్యసించి.. అమెరికాలో స్థిరపడిన ప్రముఖ ఉదరకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ నాగుల సీతారామయ్య తనవంతు సాయం అందిస్తున్నారు. ఈయన చొరవ చూపి ఉత్తర అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థులతో కలిసి ‘అంకానా’ పేరిట సంఘాన్ని నెలకొల్పారు. దీని ఆధ్వర్యంలో రూ.5 కోట్లు వెచ్చించి.. కళాశాల అనుబంధ కేజీ ఆసుపత్రికి వసతులు సమకూర్చారు. సీతారామయ్య ఒక్కరే రూ.3 కోట్లు ఇచ్చారంటే కళాశాలపై ఉన్న ప్రేమ అర్థమవుతుంది. ఈయన సహకారంతో రూ.కోటితో మాతృశ్రీ మెటర్నిటీ ఫెసిలిటీ పేరిట కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో నెలకొల్పిన ప్రత్యేక వార్డు ఇటీవల అందుబాటులోకి వచ్చింది. రొమ్ము క్యాన్సర్‌ నిర్ధరణకు అత్యాధునిక మెమోగ్రఫీ యంత్రాన్ని రేడియాలజీ విభాగానికి అందించారు. నవజాత శిశువులకు 20 పడకలతో ఎన్‌ఐసీయూ ఏర్పాటు చేయించారు. పెథాలజీ విభాగ భవనం నవీకరణకు రూ.కోటి ఖర్చు చేశారు. ఇలా సమకూరిన వసతులతో కేజీహెచ్‌లో మహిళలు, పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
- న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

అభివృద్ధి ‘ధరణి’

ఆ యువకులు ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టారు. జన్మనిచ్చిన పల్లె రుణం తీర్చుకునేందుకు సమష్టిగా అడుగేశారు. ప్రతి నెలా కొంత నగదు జమ చేస్తూ గ్రామాభివృద్ధికి వెచ్చిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం చల్లగర్గెకు చెందిన పలువురు యువకులు.. పల్లెను ప్రగతి బాట నడిపించాలన్న సంకల్పంతో ప్రణాళిక రూపొందించుకున్నారు. 15 మంది కలిసి ‘ధరణి’ పేరిట సంఘాన్ని నెలకొల్పారు. తమకు వచ్చే ఆదాయంలో కొంత జమ చేస్తూ.. ఊర్లో అభివృద్ధి పనులకు వ్యయం చేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు రూ.10 లక్షలతో  పనులు చేపట్టారు.
- న్యూస్‌టుడే, ధర్పల్లి

గ్రామం.. ఆధ్యాత్మిక క్షేత్రం

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌కు చెందిన పోలీసు విద్యాసాగర్‌, రాధాకిషన్‌, రమేశ్‌ అన్నదమ్ములు. వీరంతా గల్ఫ్‌లో పని చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు. పోలీసు రమేశ్‌ రూ.2 కోట్లతో షిరిడీ సాయిబాబా, ఇతర మందిరాలు నిర్మించారు. రాధాకిషన్‌ రూ.25 లక్షలతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కట్టించారు. విద్యాసాగర్‌ రూ.5 లక్షలతో జగదాంబదేవికి రథాన్ని చేయించి 12 ఏళ్లుగా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ఈ సోదరుల ఆర్థిక సహకారంతో గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.
 
- న్యూస్‌టుడే, కమ్మర్‌పల్లి

ఏటా రెండు నెలలు సొంతూరులోనే..

ప్రతి ఏడాది రెండు నెలలకు పైగా సొంతూరులోనే ఉండి పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అలవాటుగా చేసుకున్నారు గుంటూరు జిల్లా బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన యడ్లపల్లి వెంకటేశ్వర్లు. ఆయనది సామాన్య కుటుంబం. మస్కట్లో వైద్యుడిగా స్థిరపడ్డారు. జన్మభూమిపై ఉన్న మమకారంతో గ్రామాభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు అనుగుణంగా రూ.80 లక్షలకు పైగా వెచ్చించారు. అయిదు గ్రామాల్లో శుద్ధి జల కేంద్రాలను నెలకొల్పి ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందిస్తున్నారు. కల్యాణ మండపాలు, సామాజిక భవనాలు, మహాప్రస్థానంలో దహనవాటికల నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. 
- న్యూస్‌టుడే, బాపట్ల

సోదరుల సేవాతత్పరత

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్దకొట్టాలపల్లి గ్రామానికి చెందిన జయరామ్‌నాయుడు, రాజశేఖర్‌నాయుడు సోదరులు జయరామ్‌ అమెరికాలో గుండె వైద్య నిపుణులుగా స్థిరపడ్డారు. టెక్సాస్‌లో మెడికల్‌ బోర్డు సభ్యుడిగా సేవలందిస్తున్నారు. రాజశేఖర్‌ పారిశ్రామికవేత్త. స్వగ్రామంలో మెరుగైన వైద్యం అందించాలని భావించి రూ.15 లక్షలతో ఆసుపత్రిని నిర్మించారు. ఇక్కడ వైద్యులు, సిబ్బంది నియామకంలో చొరవ చూపారు. శుభకార్యాల నిర్వహణకు కల్యాణ మండపం నిర్మించారు. నీటిశుద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉన్నత పాఠశాలలో 2015లో కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయించారు. నాలుగేళ్లుగా పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తున్న ముగ్గురు విద్యార్థులకు ఏటా ఆగస్టులో రూ.30 వేలు నగదు పురస్కారాలు అందిస్తున్నారు. 
- న్యూస్‌టుడే, విడపనకల్లు

‘ఉద్దానం’.. ఉద్ధరణ.!

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో స్థితిగతులు మార్చడానికి నడుంబిగించారు ఆర్‌.భైరిపురానికి చెందిన పుల్లట రామ్‌కుమార్‌. ఉద్దానంలోనే కష్టాల మధ్య పెరిగారు. గల్ఫ్‌కు వెళ్లి ఉన్నత ఉద్యోగం సంపాదించారు. కిడ్నీ వ్యాధి విజృంభణతో గ్రామస్థులందరికీ ఉచితంగా రక్త పరీక్షలు చేయించారు. 35 శాతం మందికి కిడ్నీ వ్యాధి లక్షణాలు బయటపడటంతో రూ.3 లక్షలు వెచ్చించి శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేయించారు. క్రమంగా బెజ్జిపుట్టుగ, ముత్యాలపేట, మెళియాపుట్టుగ గ్రామాల్లో సైతం కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది నిరుద్యోగులు ఐటీఐ, డిప్లొమా కోర్సులు అభ్యసించడానికి సహకరించి.. దారి చూపించారు. ఏటా తాను, మిత్రుల ద్వారా రక్తదానం చేపట్టి చిరంజీవి రక్తనిధికి ఇవ్వడం అలవాటుగా చేసుకున్నారు. దీన్ని గుర్తించిన సినీ హీరో చిరంజీవి ఆయన్ను ప్రశంసించారు. ఈ ఏడాది గల్ఫ్‌ దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు అవార్డు సైతం అందుకున్నారు.
- న్యూస్‌టుడే, కవిటి

వయసు చిన్నది.. మనసు పెద్దది

సమాజానికి చేతనైనంత చేయాలన్నదే చిన్నారి సంకల్పం. ఖమ్మం నగరానికి చెందిన బెల్లం మధు, మాధవి అమెరికాలో స్థిరపడ్డారు. వీరి కుమార్తె నైషా  అమెరికాలోనే ఎనిమిదో తరగతి చదువుతున్నారు. బాల్యం నుంచే ఇతరులకు సాయం చేయాలన్న బిడ్డ సంకల్పానికి తల్లిదండ్రులు సహకరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 100 పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుతో పాటు వాటికి అవసరమైన పుస్తకాలు అందజేసి పెద్దమనసు చాటుకున్నారు. ప్రతి చిన్న పాఠశాలకు రూ.5 వేలు, పెద్ద పాఠశాలకు రూ.10 వేలు ఇచ్చారు. తన    మిత్రులతో కలిసి ఆమెరికాలో పలు కంపెనీలలో పని చేస్తున్న తెలుగువారి నుంచి విరాళాలు సేకరించి సేవాపథంలో పయనించడం విశేషం. 
- న్యూస్‌టుడే, ఖమ్మం నగరపాలకం

భరోసా అనుపమానం

పేద, అనాథ పిల్లలను ఆదరించడమే కాకుండా వృద్ధులు, కళాకారులకు తనవంతు సాయం అందిస్తున్నారు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన తాళ్లూరి జయశేఖర్‌. భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరుల్లో విస్తృతంగా సేవలు కొనసాగిస్తున్నారు. గత ఏడాది    రూ.16 లక్షలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బూర్గంపాడు మండలంలోని సర్కారు బడుల్లో డిజిటల్‌ పాఠాల బోధనకు ఎల్‌ఈడీ టీవీఈలు అందించారు. ఏటా ‘భద్రాద్రి బాలోత్సవం’ నిర్వహణకు సహకారం అందిస్తున్నారు. సారపాక ఎంఎస్‌ఆర్‌ పాఠశాలలోని పేద, తల్లిదండ్రులు లేని విద్యార్థుల చదువుల నిమిత్తం రూ.1.40 లక్షలు ఇచ్చారు. భద్రాచలంలోని ఓ వృద్ధాశ్రమానికి ప్రతి నెలా రూ.15 వేలు ఇస్తున్నారు.
- న్యూస్‌టుడే, బూర్గంపాడు

వార్తలు / కథనాలు

మరిన్ని