close
ఉద్యోగ అనుమతులు తొలగించలేం

హెచ్‌-4 వీసాదారులకు ఊరట
ప్రస్తుతానికి రద్దు కుదరదన్న అమెరికా కోర్టు
భారతీయ మహిళలకు ప్రయోజనం

వాషింగ్టన్‌: అమెరికాలో నివసిస్తున్న వేలాదిమంది భారతీయులకు తాత్కాలిక ఊరట! హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల(హెచ్‌-4 వీసాదారులు) ఉద్యోగ అనుమతులను రద్దు చేసేందుకు అక్కడి న్యాయస్థానమొకటి నిరాకరించింది. ఈ వ్యవహారంలో మరింత లోతైన పరిశీలన అవసరమని అభిప్రాయపడింది. స్థానికులకు ఉద్యోగాలు కరవవుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో హెచ్‌-4 వీసాదారుల ఉద్యోగ అనుమతులను రద్దు చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం చాలాకాలంగా భావిస్తోంది. దీనిపై దాఖలైన కేసులో విచారణ నిర్వహించిన యూఎస్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ ఫర్‌ ది డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా సర్క్యూట్‌ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. హెచ్‌-4 వీసాదారుల ఉద్యోగ అనుమతులను ప్రస్తుతానికి రద్దు చేయలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో డిస్ట్రిక్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. లోతైన విశ్లేషణ జరిపాలంటూ దిగువ కోర్టుకు తిరిగి కేసును అప్పగించింది.

హెచ్‌-1బీ వీసా అంటే?

ఇది వలసేతర వీసా. అమెరికా సంస్థలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు వీలు కల్పిస్తుంది.

హెచ్‌-4 వీసా అంటే?

హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులు (జీవిత భాగస్వామి, పిల్లలు) అమెరికాలో నివసించేందుకు దీన్ని మంజూరు చేస్తారు.

అనుమతులు ఎప్పటి నుంచి?

2015లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్‌-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు కల్పిస్తూ ప్రత్యేక నిబంధన తీసుకొచ్చారు.

1,00,000+ 

హెచ్‌-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు లభించడంతో లబ్ధి పొందుతున్న మహిళలు. వీరిలో భారతీయులే అధికం.

నాలుగింట మూడొంతులు మనోళ్లే

3,09,986:హెచ్‌-1బీ వీసాపై పని చేస్తున్న భారతీయుల సంఖ్య
4,19,637:హెచ్‌-1బీ వీసాపై పని చేస్తున్న మొత్తం విదేశీయుల సంఖ్య
* 2018 అక్టోబరు నాటి లెక్కల ప్రకారం

వివాదమేంటి?

హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగాలు చేస్తుండటంతో తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ స్థానిక పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం వారికి మద్దతు పలుకుతోంది.

వార్తలు / కథనాలు

మరిన్ని