
వాషింగ్టన్: ఇప్పటికే హెచ్ 1 బీ వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా.. దరఖాస్తు రుసుమును కూడా పెంచింది. హెచ్1 బీ వర్క్ వీసా దరఖాస్తు రుసుమును 10 డాలర్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. వీసా ఎంపిక విధానాన్ని ఆధునీకరించే ప్రయత్నాలలో ఈ పెంపుదల ఒక భాగమని అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం (యు.ఎస్.సి.ఐ.ఎస్) తెలియజేసింది.
హెచ్-1 బీ క్యాప్ సెలక్షన్ విధానాన్ని మరింత సమర్థవంతం చేయడానికి ఎలక్ర్టానిక్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అవలంభిస్తున్నారు. పెరిగిన ఈ రుసుము ఎలక్ర్టానిక్ రిజిస్ట్రేషన్ విధానానికి ఉపయోగకరంగా ఉంటుందని, తద్వారా దరఖాస్తుదారులకు, అమెరికా ప్రభుత్వానికి కూడా మేలు కలుగుతుందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఆధునీకరించడం ద్వారా మోసాలకు నివారించడంతో పాటు దరఖాస్తుల పరిశీలన విధానాన్ని మెరుగుపరచడం, ప్రోగ్రామ్ సమగ్రతను బలోపేతం చేయడం వీలవుతుందని పేర్కొంది. అమెరికా కంపెనీలు నిపుణులైన విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకునేందుకు హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు.