close
దీపావళి వేడుకలు మా మతస్వేచ్ఛకు నిదర్శనం:ట్రంప్‌

వాషింగ్టన్‌: శ్వేతసౌధంలో ఈసారి దీపావళి వేడుకుల ఘనంగా జరిగాయి. ఓవల్‌ ఆఫీస్‌లో శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్నారు. అలాగే కొంతమంది ప్రముఖ ప్రవాస భారతీయులు, శ్వేతసౌధం సిబ్బంది ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘నేడు అమెరికా అంతటా దీపావళి జరుపుకొంటున్నారు. దేశ ప్రధాన సిద్ధాంతాలలో ఒకటైన మతస్వేచ్ఛకు ఈ పండుగ నిదర్శనం’’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకొంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు ట్రంప్‌ సతీమణి మెలానియాతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగను చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొంటారని గుర్తుచేసుకున్నారు.  దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వారివారి విశ్వాసాలకనుగుణంగా పండుగలు, పూజలు జరుపుకునే హక్కు అమెరికా కల్పిస్తోందన్నారు. ఈ మేరకు అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడేందుకు తన ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

2009 నుంచి శ్వేతసౌధంలో దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ట్రంప్‌ ఈ వేడుకల్లో పాల్గొనడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మరోవైపు అమెరికాలో దీపావళి వేడుకలు వారం క్రితం నుంచే ప్రారంభమయ్యాయి. టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబోర్ట్‌ గత శనివారమే భారత్‌-అమెరికా ప్రతినిధులతో కలిసి పండుగ జరపుకొన్నారు. మరికొంత మంది ప్రజాప్రతినిధులు ట్విటర్‌ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని