close
థాయ్‌లాండ్‌ చూపు..భారతీయుల వైపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందమైన బీచ్‌లు, ప్రశాంతమైన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, చూపరులను ఆకట్టుకునే పర్యాటకం థాయ్‌లాండ్ సొంతం. ప్రశాంతత కోసం ఈ మధ్య కాలంలో చాలామంది ప్రకృతి ప్రేమికులు వెళ్లిన పర్యాటక ప్రదేశం కూడా థాయ్‌లాండే. అలాంటి దేశం ఇప్పుడు కష్టాల్లో పడింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ప్రభావం థాయ్‌ పర్యాటకంపై పడింది. సాధారణంగా చైనా నుంచి ఇక్కడికి భారీ స్థాయిలో పర్యాటకులు వస్తుంటారు. ట్రేడ్‌ వార్‌ కారణంగా ఆంక్షలు, ఇతర కారణాల వల్ల చైనీయుల రాక తగ్గిపోయింది. ఫలితంగా థాయ్‌లోని అందమైన ఐలాండ్లు వెలవెలబోతున్నాయి. అక్కడి హోటళ్లు కూడా గదుల ధరలను భారీగా తగ్గించాయి. పర్యాటకులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి హోటళ్లోని గదులు చాలా వరకు ఖాళీగా కనిపిస్తున్నాయి. గతేడాది కనిపించిన కళ ఇప్పుడు అక్కడ లేదు. థాయ్‌లో పర్యాటకానికి ప్రాధాన్యం ఎక్కువ. ఆ దేశ జీడీపీలో 18 శాతం పర్యాటక రంగానిదే కావడం విశేషం. 

భారత పర్యాటకుల వైపే మొగ్గు
స్వతహాగా పర్యాటక ప్రియులైన భారతీయులపై థాయ్‌ చూపు పడింది. భారత్‌ నుంచి వీలైనంత ఎక్కువ మంది పర్యాటకులను రప్పించుకునేందుకు ఆదేశ టూరిజం శాఖ భారీ కసరత్తులే చేస్తోంది. పర్యాటకరంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేందుకు భారత పర్యాటకులకు భారీ ఆఫర్లను ప్రకటించే యోచనలో ఉంది. హోటల్‌ ప్యాకేజీలు, భారత్‌లోని మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని డిస్కౌంట్లు, థాయ్‌లాండ్‌కు నేరుగా వెళ్లే విమానాల సంఖ్య పెంచడం, వీసా రహిత యాత్రలను అందించాలని చూస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 2 మిలియన్ల మంది భారతీయులు థాయ్‌కు వెళ్లినట్లు ఆ దేశ టూరిజం శాఖ తెలిపింది. ఈ సంఖ్యను మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. 

వార్తలు / కథనాలు

మరిన్ని