close
అభిజిత్‌ బెనర్జీకి ఆర్థిక నోబెల్‌

ప్రవాస భారతీయుడు.. పేదరిక నిర్మూలన సిద్ధాంత రూపకర్త
ఆయన అర్ధాంగి ఎస్తేర్‌ డుఫ్లోకు, మరో ఆర్థికవేత్త క్రెమర్‌కూ..

భారత ఆర్థిక పునాదులు కదులుతున్నాయ్‌ భారత ఆర్థిక వ్యవస్థ కంపిస్తోంది. ప్రస్తుత గణాంకాలను పరిశీలించిన తరువాత సమీప భవిష్యత్తులో కోలుకుంటుందన్న నమ్మకం కలగడం లేదు. గత అయిదారేళ్లుగా కొంతలో కొంత అభివృద్ధిని చూశాం. కానీ ఇప్పుడు ఆ భరోసా ఇవ్వలేం.
- అభిజిత్‌ బెనర్జీ
ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు వారు చూపిన ‘క్షేత్రస్థాయి ప్రయోగాల విధానాలు’ ఆర్థిక శాస్త్రంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయి. రెండు దశాబ్దాల కాలంలోనే ‘అభివృద్ధి ఆర్థిక శాస్త్రం’ స్వరూపాన్ని మార్చివేశాయి. వినూత్న ఆర్థిక పరిశోధనలకు ఇవే ఆధారమయ్యాయి. స్పష్టమైన ఫలితాలు సాధించేలా విధానాలు రూపొందించడం వీరి ప్రత్యేకత.
- స్వీడిష్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌
అభిజిత్‌కు అభినందనలు. పేదరిక నిర్మూలనకు ఆయన విశేష కృషిచేశారు
-ప్రధాని మోదీ

స్టాక్‌హోం: పేదరికపు విషకోరల నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేలా అద్భుత పరిష్కారాలను సూచించిన ప్రవాస భారత ఆర్థిక దిగ్గజం  అభిజిత్‌ వినాయక్‌ బెనర్జీని ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం వరించింది.  ఆయన భార్య ఎస్తేర్‌ డుఫ్లోతో పాటు, మరో ఆర్థికవేత్త మైఖెల్‌ క్రెమర్‌నూ 2019 సంవత్సరానికి ఈ అవార్డుకు సంయుక్తంగా ఎంపిక చేసినట్లు స్వీడిష్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది.క్షేత్రస్థాయిలో పేదల స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారికి కనీస జీవన ప్రమాణాలు ఎందుకు అందడం లేదు వంటి ప్రశ్నలు వేసుకుని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నదే  అమెరికాలో ఉంటున్న ఈ ముగ్గురి సిద్ధాంతం. భారత దేశంలో చదువుల్లో వెనుకబడిన 50 లక్షల మంది విద్యార్థులకు ట్యూషన్లు చెప్పించడం, వివిధ దేశాల్లో భారీ రాయితీతో ఆరోగ్య పథకాలు అమలు చేయడం వీరి ప్రయోగాల ఫలితమే.

పేదరికంపై ప్రయోగశాల
పేదరిక నిర్మూలనకు అభిజిత్‌ దంపతులు ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ‘‘కొందరికి ఎందుకు తినడానికి తిండి లేదు? మరికొందరు టెలివిజన్‌ ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు. పేద పిల్లలు బడులకు వెళ్తున్నా ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు. ఎక్కువ మంది సంతానం ఉండడమే పేదరికానికి కారణమా? ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అవసరం’’ అన్నది వీరు నమ్మిన సిద్ధాంతం. ఈ సమస్యలను     క్షేత్రస్థాయిలో పరిశీలించి, లోతుగా విశ్లేషించి ఆచరణాత్మక సూచనలు ఇవ్వడంపైనే వారు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా 2003 అభిజిత్‌, డుఫ్లో దంపతులిద్దరూ సెంధిల్‌ ములియనాథన్‌తో కలిసి ఎం.ఐ.టి.లో అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ (జె-పాల్‌)ను నెలకొల్పారు. వారు రచించిన ‘పూర్‌ ఎకనామిక్స్‌’ (పేదల ఆర్థిక శాస్త్రం) పుస్తకానికి విశేష ఆదరణతో పాటు, పురస్కారాలు లభించాయి. ఇది 17 భాషల్లో అనువాదమయింది. ఈ కృషిలో భాగంగా అభిజిత్‌ రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.

నోబెల్‌ పురస్కారం కింద అభిజత్‌(58), ఎస్తేర్‌(46), క్రెమర్‌(54)లకు తొమ్మిది మిలియన్‌ క్రోనార్లు (సుమారు రూ.6.43 కోట్లు) నగదు, బంగారు పతకం, డిప్లొమాను అకాడమీ బహూకరించనుంది. ఈ నగదును ముగ్గురు సమానంగా పంచుకుంటారు. ఆర్థికశాస్త్ర విభాగంలో నోబెల్‌కు ఎంపికైన రెండో మహిళగా డుఫ్లో గుర్తింపు పొందారు. ఇదే విభాగంలో పురస్కారాన్ని అందుకోనున్న పిన్న వయస్కురాలు ఆమె కావడం విశేషం. అమర్త్యసేన్‌ అనంతరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పొందిన రెండో ప్రవాస భారతీయుడు అభిజిత్‌.  అభిజిత్‌ అమెరికాలోని మసాచ్యుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థిక శాస్త్ర విభాగంలో ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఫ్రాన్స్‌ మూలాలు ఉన్న డుఫ్లో కూడా ఆ విశ్వవిద్యాలయం ఆర్థిక విభాగంలోనే ఆచార్యునిగా వ్యవహరిస్తున్నారు. క్రెమెర్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో గేట్స్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌గా పనిచేస్తున్నారు.

ఠాగూర్‌ నుంచి బెనర్జీ వరకు..
నోబెల్‌ పురస్కారం పొందిన భారతీయుల జాబితాలో అభిజిత్‌ బెనర్జీ చేరి, దేశవాసులు గర్వపడేలా చేశారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రారంభమైన నోబుల్‌ గ్రహీతల ప్రస్థానంలో మరో మైలు రాయిగా నిలిచారు. ఇంతవరకు నోబెల్‌ను పొందిన భారతీయుల వివరాలను పరిశీలిస్తే...

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ (1913)- సాహిత్యం
సి.వి.రామన్‌ (1930)- భౌతిక శాస్త్రం
హరగోబింద్‌ ఖొరానా (1968)- వైద్యం
మదర్‌ థెరిసా (1979)- శాంతి
సుబ్రమణ్యన్‌ చంద్రశేఖర్‌ (1983)- భౌతిక శాస్త్రం
అమర్త్య సేన్‌ (1998)- ఆర్థిక శాస్త్రం
వెంకటరామన్‌ రామకృష్ణన్‌ (2009)- రసాయన శాస్త్రం
కైలాస్‌ సత్యార్థి (2014)- శాంతి
అభిజిత్‌ బెనర్జీ (2019)- ఆర్థిక శాస్త్రం

పేదల కోసం పనిచేయడం సంతోషంగా ఉంది
న్యూయార్క్‌: పేదల కోసం పనిచేయడం సంతోషకరంగా ఉందని అభిజిత్‌ అన్నారు. నోబెల్‌ప్రైజ్‌.ఆర్గ్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ పేదల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసినవారందరికీ దక్కిన పురస్కారంగా భావిస్తున్నానని తెలిపారు. తమలాంటివారు కొన్నిసార్లు మాట సాయం చేస్తుంటారని, కానీ పేదరిక నిర్మూలనకు నిజంగా కృషి చేస్తున్నవారు ఎందరో ఉన్నారని చెప్పారు. ప్రజలతో మాట్లాడడం ద్వారానే తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. ‘‘మన తర్కంపైనో, ఎదుటివారి హేతువాదంపైనో మరీ అంతగా ఆధారపడాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవాలి’’ అని అన్నారు. ప్రథమ్‌, సేవా మందిర్‌ వంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా తాను నేర్చుకున్న అంశాలను ప్రస్తావించారు.

విని పడుకున్నా
తన జీవితంలో ఇంత త్వరగా నోబెల్‌ పురస్కారం వస్తుందని అనుకోలేదని అభిజిత్‌ అన్నారు. మరో పదేళ్ల తరువాత వస్తుందేమోనని భావించానని చెప్పారు. ‘‘సాధారణంగా నేను పెందలాడే నిద్ర లేవను. పురస్కారం విషయం నాకు ఉదయం ఆరు గంటలకు తెలిసింది. విన్న తరువాత 40 నిమిషాల పాటు మళ్లీ పడుకున్నా.’’ అని చెప్పారు. జీవిత భాగస్వామితో కలిసి పనిచేయడం కొత్త అనుభూతి కలిగిస్తుందని అన్నారు. ‘‘జీవితంలో ఈ అదృష్టం ఎన్నో సార్లు రాదు’’ అని వ్యాఖ్యా నించారు.


అందరికీ గర్వకారణం

ఉపరాష్ట్రపతి సహాపలువురి ప్రశంసలు

అభిజిత్‌ ప్రతిపాదించిన ప్రయోగాత్మక విధానం పేదరిక నిర్మూలనకు దోహదపడుతుంది.

- ఉప రాష్ట్రపతి, వెంకయ్య నాయుడు

అభిజిత్‌ రూపొందించిన ర్యాండమైజ్డ్‌ కంట్రోల్‌ ట్రయల్స్‌ వంటి విధానాలు నిజంగా నూతన ఆవిష్కరణలు. అవి భారత దేశానికి సరిపోతాయి.

- మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

కుమారుడు, కోడలు జంటగా నోబెల్‌ పొందడం సంతోషదాయకం. అభిజిత్‌ ఎల్లప్పుడు ప్రతిభ, క్రమశిక్షణగల విద్యారే

- తల్లి ప్రొఫెసర్‌ నిర్మలా బెనర్జీ

చాలా చాలా ఆనందంగా ఉంది

- అమర్త్య సేన్‌, నోబెల్‌ విజేత

మరో బెంగాలీ దేశాన్ని గర్వపడేలా చేశారు

- ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు.

ప్రెసిడెన్సీ కళాశాల (ప్రస్తుతం విశ్వవిద్యాలయం)కు చెందిన ఇద్దరు విద్యార్థులు.. అప్పట్లో అమర్త్య సేన్‌, ఇప్పుడు అభిజిత్‌లు అత్యున్నత పురస్కారం పొందడం గర్వకారణం

- రిజిస్ట్రార్‌ దేబజ్యోతి కోనార్‌

దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి కావడం గర్వకారణం

- అప్పట్లో అభిజిత్‌కు బోధించిన ప్రొఫెసర్‌ అంజన్‌ ముఖర్జీ

మా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లకు నోబెల్‌ రావడం సంతోషకరం

- ఎం.ఐ.టి. ‘న్యాయ్‌’ రూపశిల్పి అభిజిత్‌

‘‘కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం (న్యూన్‌తమ్‌ ఆదాయ్‌ యోజన-న్యాయ్‌)కు రూపకల్పన చేసింది అభిజితే. పేదరికాన్ని నిర్మూలించి, ఆర్థిక వ్యసవ్థ పునరుజ్జీవనం కలిగించడానికి ఆ పథకాన్ని ప్రతిపాదించారు. నోబెల్‌ పొందినందుకు అభినందనలు’’

- రాహుల్‌ గాంధీ

అభిజిత్‌ బెనర్జీకి సీఎం అభినందనలు

అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం పొందిన అభిజిత్‌ బెనర్జీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. ప్రపంచ పేదరిక నిర్మూలనకు ఆయన చేసిన పరిశోధనలు ఆచరణాత్మకమని పేర్కొన్నారు.


 

వార్తలు / కథనాలు

మరిన్ని