close
స్వదేశంలోనే విదేశీ చదువు

పేరొందిన వర్సిటీల ప్రాంగణాల ఏర్పాటుకు పచ్చజెండా
హెచ్‌ఈసీఐ బిల్లు ముసాయిదాలో ప్రతిపాదన

ఈనాడు, దిల్లీ: విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే ఆ వర్సిటీల ప్రాంగణాలను ఏర్పాటు చేయించడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. విపక్షంగా ఉన్నప్పుడు భాజపా ఈ విధానాన్ని వ్యతిరేకించింది. దీనిని పక్కనపెట్టి... విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను (ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లను) మన వద్ద తెరవడానికి మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) మంత్రిత్వశాఖ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. ‘భారత ఉన్నత విద్య కమిషన్‌ (హెచ్‌ఈసీఐ) బిల్లు-2019’లో చేర్చిన ప్రతిపాదనల్లో ఇదొక కీలకాంశం. ప్రతిష్ఠాత్మక వర్సిటీలనే దేశంలోకి అనుమతిస్తారు. నియంత్రణ వ్యవస్థకు లోబడి అవి పనిచేయాల్సి ఉంటుంది. విదేశీ వర్సిటీలను రప్పించడానికి 2014లో నరేంద్రమోదీ సర్కారు కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే వాణిజ్య మంత్రిత్వ శాఖ మొగ్గు చూపింది. విద్యారంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆస్కారం ఉండడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ముప్పు రావచ్చనే ఉద్దేశంతో హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ ఇంతవరకు దీనికి సానుకూలత వ్యక్తపరచలేదు. మన దేశంలో అమల్లో ఉన్న నిబంధనలను అనుసరించకుండా విదేశీ సంస్థలు ఇక్కడెలా పనిచేస్తాయనే అభ్యంతరాలు తలెత్తడమూ మరో కారణం. ఇప్పుడు మాత్రం వైఖరి మారింది.

సలహా మండలి ఉండదు
హెచ్చార్డీ మంత్రి అధ్యక్షతన సలహా మండలిని ఏర్పాటు చేయాలన్న సూచనను భాజపాయేతర రాష్ట్రాలు వ్యతిరేకించడంతో దానిని బిల్లులో ఉపసంహరించుకున్నారు.
* కేంద్ర మంత్రికి బదులు కార్యదర్శి స్థాయి అధికారికి కీలక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తిపరమైన ఏడు సంస్థల సభ్యుల అధికారానికి సమానమైన అధికారం ఆయనకు ఉంటుంది. కమిషన్లో సభ్యుల సంఖ్యనూ రాష్ట్రాల అభిప్రాయానికి తగ్గట్టుగా మార్చారు.
* మార్పులకు అనుగుణంగా 2018 నాటి బిల్లును హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ సవరిస్తోంది. దీనిని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు.

రాష్ట్రాలకు పెద్దపీట
విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)లను కలిపేసి హెచ్‌ఈసీఐ ఏర్పాటు చేయాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ప్రతిపాదిత కమిషన్‌ కూర్పులో రాష్ట్రాలకు పెద్దపీట లభించబోతోంది. ఆ మేరకు హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ పాత్రను కుదించబోతున్నారు.
* హెచ్‌ఈసీఐ ఏర్పాటైతే సాంకేతిక, ఆర్కిటెక్చర్‌, న్యాయశాస్త్ర కోర్సుల్ని అందించే ఉన్నత విద్యాసంస్థలన్నీ ఒకే గొడుగు కిందికి వస్తాయి. ఈ కమిషన్‌ ద్వారానే నిధులందుతాయి. వైద్యవిద్య మాత్రం దీని పరిధిలోకి రాదు.
* డిగ్రీలు ప్రదానం చేసే అధికారం ప్రస్తుతం కేవలం విశ్వవిద్యాలయాలకే ఉంది. బిల్లు అమోదం పొందితే ఏ ఉన్నత విద్యాసంస్థయినా వీటిని ఇవ్వవచ్చు.

వార్తలు / కథనాలు

మరిన్ని