close
2069 నాటికి అరగంటలో అమెరికాకి..!

శాంసంగ్‌ సంస్థ లండన్‌లో ఆ మధ్య ఓ టెక్నాలజీ పార్కు ఏర్పాటుచేసింది.  ఆ సంస్థ తయారుచేసే అత్యాధునిక పరికరాలని విక్రయించడమే పార్కు లక్ష్యమైనా...  ఇందులో ప్రధానభాగం భవిష్యద్దర్శనానికి కేటాయించారు. అంటే, యాభై ఏళ్ల తర్వాత  సాంకేతికతలో వచ్చే మార్పులని వివరించే వీడియోలూ, వర్చువల్‌ రియాల్టీ కియోస్క్‌లని  ఇక్కడ ఏర్పాటుచేశారు. ఐరోపాకి చెందిన ఐదుగురు నిపుణులు అందించిన నివేదిక ఆధారంగా  ఈ పార్కుని రూపుదిద్దామంటోంది శాంసంగ్‌. ఆ పార్కు వివరించే భవిష్యద్దర్శనల్లో కొన్ని...

విహారయాత్రలు వీనస్‌లోనే:  రవాణాకి సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. గంటకి 95 వేల మైళ్ల వేగంతో ప్రయాణించే ‘రీ-యూజబుల్‌’ రాకెట్‌తో ఏ వీనస్‌ గ్రహంపైకో ఇట్టే వెళ్లి రావొచ్చు. అవసరమైతే భూమిపైన ఓ ఖండం నుంచి మరో ఖండానికి నిమిషాల్లో చేరుకోవచ్చు. ధ్వని కంటే ఐదురెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే విమానాలే ప్రధాన రవాణా సాధనాలవుతాయి. వీటితో భారత్‌ నుంచి అమెరికాకి అరగంటలో చేరుకోవచ్చు. రైళ్లకు బదులుగా సూపర్‌సోనిక్‌ ట్యూబ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌ (ఎస్టీటీఎస్‌) వస్తాయి. సముద్ర, భూగర్భాల్లో ప్రయాణించే వీటితో హైదరాబాద్‌ నుంచి కశ్మీర్‌కైనా సరే అరగంటలో చేరుకోవచ్చు. రోడ్లపైన కార్లకి బదులు క్వాడ్‌పాడ్‌లు వస్తాయి. ఇవి అవసరమైతే... గాలిలో  ఎగురుతాయి, నీళ్లలోనూ వెళతాయి. వాహనాలేవైనా సరే వాటికవే నడుస్తాయి... యాభై ఏళ్ల తర్వాత మనుషులు డ్రైవ్‌ చేయడం అన్నది నేరమవుతుంది!

కాలేజీలు ఉండవు: యాభైయేళ్ల తర్వాత చేత్తో రాయడం, టైప్‌ చేయడం వంటివన్నీ అటకెక్కిపోతాయి. నేరుగా మీ మెదడు నుంచే ఆలోచనలు అక్షరాలుగానో, చిత్రాలుగానో ఎదుటివాళ్ల మెదడులోకి మెసేజీలుగా వెళ్లిపోతాయి. ఇందుకు సంబంధించిన చిప్‌లూ, బోర్డుల్ని మన బుర్రలోనే ఇంప్లాంట్‌ చేసేస్తారు. చదువుల కోసం స్కూళ్లూ, కాలేజీలకి వెళ్లక్కర్లేదు. చిన్నప్పటి నుంచే మనకి కావాల్సిన విద్యని మెదడులోకి నేరుగా పంపిస్తూ... వయసుకి తగ్గట్టు వాటిని అప్‌డేట్‌ చేస్తూ పోతారు.

వృద్ధులు కారు: పుట్టుక నుంచే మన శ్వాసనీ, గుండెరేటునీ అనుక్షణం అంచనావేసే సెన్సర్‌లూ మనలో ఉంటాయి. శరీరంలో ఏమాత్రం తేడా వచ్చినా... అవి నేరుగా డాక్టర్‌నే మీతో మాట్లాడిస్తాయి. మెదడు తప్ప... శరీరంలోని అవయవాలన్నింటినీ అప్పటికప్పుడు ముద్రించే 3డీ ప్రింటర్ల హవా నడుస్తుంది. వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వందేళ్ల వయసులోనూ యవ్వనంతో కనిపించొచ్చు. మరణాన్ని జయించే మందేదీ రాకపోవచ్చు కానీ.. ప్రతి మనిషి ఆలోచనలూ, జ్ఞాపకాలన్నింటినీ ‘క్లౌడ్‌’లో భద్రపరిచే అవకాశం ఉంటుంది. క్లౌడ్‌లో ఉన్న ఆ జ్ఞాపకాలని ఏదైనా రోబోలోకి అప్‌లోడ్‌ చేస్తే అది అచ్చంగా చనిపోయిన ఆ వ్యక్తిలాగే ప్రవర్తిస్తుందన్నమాట!

మీరే హీరో: ఇప్పుడు మనం వాడుతున్న ‘డైరెక్ట్‌ టు హోమ్‌’లాగే ‘డైరెక్ట్‌ టు బ్రెయిన్‌’ హవా నడుస్తుంది! సినిమాల్లో రచయితలూ, దర్శకులూ, కెమెరామెన్‌ల అవసరం ఉండదు. ఆ పనులన్నీ కృత్రిమ మేధస్సే చేసి మీకు తగ్గట్టు సినిమాని అందిస్తుంది. ఆ సినిమాలో మీరూ భాగం కావొచ్చు. అవసరమైతే అసలు హీరోనికాదని మీరే ఆ పాత్ర పోషించొచ్చు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా సరే ఏ క్రీడల్లోనైనా పాల్గొనొచ్చు. ‘అవతార్‌’ సినిమాలోలాగా విశ్వంలో వాళ్లు ఎక్కడున్నా సరే మీరు నేరుగా తలపడిన అనుభవాన్ని హ్యాప్టిక్‌ పరికరాలు మీ సొంతం చేస్తాయి.

భూగర్భంలో ప్లాట్లు: ఆకాశాన్నంటే హర్మ్యాలే కాదు... నేలలోపల వందలాది కిలోమీటర్లలో విస్తరించి ఉండే భూగర్భ భవనాలూ వస్తాయి. సముద్ర గర్భంలోనూ పెద్ద నగరాలు వెలుస్తాయి. వీటికి తోడు... అంతరిక్షంలోనూ హోటళ్లు ఏర్పడతాయి. అన్నిచోట్లా హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో గోడలపైనే ఆహారాన్ని పండిస్తారు. మనక్కావాల్సిన ఆహారాన్ని క్షణాల్లో 3డీ ప్రింటర్‌ అందిస్తుంది కాబట్టి వంటావార్పులేవీ ఉండవు. అంతేకాదు, ప్రతి ఇల్లూ తనని తాను శుభ్రం చేసుకుంటుంది. ఇంకా, ఒక అపార్ట్‌మెంట్‌కీ మరో అపార్ట్‌మెంట్‌కీ మధ్య అతిపొడవైన స్కై వాక్స్‌ వస్తాయి. మనుషులు నడవాలన్నా, పరిగెత్తాలన్నా ఇందులోనే చేయాలి తప్ప పొరబాటున కూడా నేలపైన తిరగకూడదు. అది వాహనాలకు మాత్రమే పరిమితం మరి!

వార్తలు / కథనాలు

మరిన్ని