
హ్యూస్టన్: అమెరికాలోని హ్యూస్టన్ వేదికగా జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అశేష జనవాహిని నడుమ భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగానికి జనం నీరాజనం పలికారు. అయితే ఈ సభ తర్వాత భారత కమ్యూనిటీతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను మోదీ ఓ చిరుకోరిక కోరారు. ఏటా కొంతమంది భారతీయేతర కుటుంబాలను భారత పర్యటనకు పంపాలని కోరారు.
‘నా కోసం ఓ పనిచేస్తారా? చాలా చిన్న పని’ అని మోదీ అడగ్గానే అక్కడున్న వారంతా ‘చేస్తాం’ అంటూ చేతులు పైకెత్తారు. అందుకు మోదీ వెంటనే.. ‘ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరినీ కోరుతున్నాను. ప్రతి సంవత్సరం మీరంతా కనీసం ఐదు భారతీయేతర కుటుంబాలను భారత పర్యటనకు పంపండి’ అని కోరారు. ఇందుకు వారంతా ‘పంపుతాం’ అంటూ చప్పట్లతో సమ్మతం తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను పీఎంవో కార్యాలయం ట్విటర్ వేదికగా పంచుకుంది.
హ్యూస్టన్లో గాంధీ మ్యూజియం శంకుస్థాపన సందర్భంగా మోదీ ఈ కోరిక కోరారు. ఈ సందర్భంగా అక్కడి భారత కమ్యూనిటీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.