close
కనిపించకుండాపోయి.. 20 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు!

చెన్నై: ‘కనిపించుట లేదు’ ఇలాంటి పత్రికా ప్రకటనలు, గోడ పత్రికలు చాలా కనిపిస్తుంటాయి. ఒక్కో ప్రకటన వెనక ఎంతో మనోవేదన ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఎక్కడ ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియక తల్లిదండ్రులు పడే ఆవేదనకు అంతే ఉండదు. ‘ఒక్కసారి నా బిడ్డను చూపించు తండ్రీ’ అంటూ ఆ అమ్మానాన్నలు మొక్కని దేవుడు ఉండడు. కానీ, ఏళ్ల తరబడి సాగే ఆ ఎదురు చూపులకు చాలా సార్లు ఫలితం ఉండదు. మరీ అలా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన బిడ్డ 20 ఏళ్ల తర్వాత తన జాడ వెతుక్కుంటూ వస్తే అదీ దేశాలు, ఖండాలు దాటి రక్త సంబంధం కోసం పరితపిస్తే ఆ కుటుంబం ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు దొరకవు. 

పులియాన్‌తోపు.. చెన్నైలో ఇరుకైన సందులతో కూడిన ప్రాంతం. ఇక్కడ నివసించే నాగేశ్వరరావు-శివకామి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. చివరి వ్యక్తి పేరు సుభాష్‌. నాగేశ్వరరావు ఇళ్లకు రంగులు వేస్తుంటాడు. శివకామి గృహిణి. దాదాపు ఇరవైఏళ్ల క్రితం సుభాష్‌కు ఏడాదిన్నర వయస్సు ఉన్నప్పుడు శివకామి ఆ పిల్లాడిని ఇంటి దగ్గర ఉంచి నీళ్లు పట్టుకుందామని వీధి పంపు దగ్గరికి వెళ్లింది. తిరిగి వచ్చే సరికి చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. దీంతో నాగేశ్వరరావు దంపతులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది.

రెక్కాడితే గానీ డొక్కాడని పేదలైన నాగేశ్వరరావు-శివకామి దంపతులు బిడ్డకోసం వెతకని ప్రాంతం లేదు. చెన్నై.. హైదరాబాద్‌.. బెంగళూరు ఇలా.. పలు చోట్ల వెతికారు. కొడుకు జాడ కానరాక ఆ దంపతులు అనుభవించిన మనోవేదనకు అంతేలేదు. ఆ సమయంలో వారికి ఆశాదీపంలా కనిపించారు న్యాయవాది వడివేలన్‌. స్థానికంగా పిల్లలను ఎత్తుకెళ్లి అనాథ బిడ్డలంటూ విదేశీ దంపతులకు దత్తత పేరుతో అమ్ముకునే ముఠాల గురించి వడివేలన్‌కు అవగాహన ఉంది. చిన్నారి సుభాష్‌ను కూడా అలాంటి ముఠాయే అపహరించి ఉంటుందని ఆయన భావించారు. దీంతో న్యాయపోరాటం ప్రారంభించారు. మద్రాస్‌ హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ వేశారు. కోర్టు పిల్లాడి ఆచూకీని కనుక్కోవాలని పోలీసులను ఆదేశించింది. వడివేలన్‌ పట్టువదలకుండా పోరాడడంతో మద్రాస్‌ హైకోర్టు ఈ ఘటనపై సీబీఐ విచారణకు సైతం ఆదేశించింది. పిల్లలను తస్కరించే ముఠాలను విచారించిన సీబీఐ.. సుభాష్‌ కనిపించకుండా పోయిన కొద్దిరోజులకే అమెరికాకు చెందిన దంపతులు ఓ అనాథ బాలుడిని దత్తతకు తీసుకున్నారని తెలిసింది. ఆ పిల్లాడి చిన్ననాటి ఫొటోలు సేకరించి నాగేశ్వరరావు-శివకామి దంపతులకు చూపించారు. వారు ఆ చిన్నారి తమ బిడ్డే అని గుర్తించారు. అమెరికా దంపతులు మాత్రం తాము న్యాయపరంగానే దత్తత తీసుకున్నామని మద్రాస్‌ హైకోర్టుకు లిఖిత పూర్వకంగా తెలిపారు. అమెరికా దంపతులు సుభాష్‌కు అవినాష్‌ అని పేరు పెట్టుకున్నారు. సీబీఐ అధికారులు అమెరికా న్యాయవిభాగాన్ని సంప్రదించి శివకామి దంపతులకు, అవినాశ్‌కు డీఎన్‌ఏ పరీక్షలు జరిపి అతడు వారి సంతానమనే తేల్చారు. 

అదో విషవలయం: న్యాయవాది వడివేలన్‌
ఇప్పటికీ ఇలా వందల సంఖ్యలో ఏటా నిరుపేదల పిల్లలను అపహరించి విదేశీ దంపతులకు దత్తత ఇచ్చే ముఠాలు ఉన్నాయని.. అదో పెద్ద వలయమని న్యాయవాది వడివేలన్‌ అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ముఠాలను కట్టడిచేయాలని ఆయన కోరుతున్నారు. 

20 ఏళ్ల తర్వాత ఇంటికి..
అవినాశ్‌.. నాగేశ్వరరావు-శివకామి దంపతుల సంతానమేనని రుజువైనా చట్టపరమైన చిక్కుముడుల కారణంగా అతన్ని అమెరికా నుంచి స్వదేశానికి రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా దంపతులను ఫోను ద్వారా సంప్రదించిన న్యాయవాది వడివేలన్‌.. అవినాశ్‌తో నేరుగా మాట్లాడించారు. అలా తన అసలైన కుటుంబం గురించి తెలుసుకున్న అవినాశ్‌ అప్పటి నుంచి తన సోదరితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఫొటోలు, మెయిళ్లు పంపుకోవడం ద్వారా అవినాశ్‌లో తన తల్లిదండ్రులను కలుసుకోవాలన్న కోరిక పెరిగింది. అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రంలో నివసించే అవినాశ్‌ ఎట్టకేలకు 20 ఏళ్ల తర్వాత సొంత గడ్డకు తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. 20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన బిడ్డ తమను వెతుక్కుంటూ రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. తన మొక్కులు ఫలించాయంటూ ఆనందంగా చెబుతోంది ఆ తల్లి. 

తల్లిదండ్రులను అమెరికా తీసుకెళ్తా.. 
తన కుటుంబాన్ని కలుసుకోవడం కోసం మూడు రోజులు భారత్‌లో ఉండేందుకు వచ్చిన అవినాశ్‌కు భాష కాస్త ఇబ్బందిగా మారింది. తన మూలాలు, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడం ఆనందంగా ఉందంటున్న అవినాశ్‌ ఈసారి వచ్చినప్పుడు తల్లిదండ్రులను అమెరికా తీసుకెళ్తానంటున్నాడు. తల్లిదండ్రులు, తోబుట్టువులను చూసి అవినాశ్‌ మనసు ఆనందంతో ఉప్పొంగింది. భాష కాస్త అడ్డంకిగా మారింది. అయినా అనుబంధాలకు, అనుభూతులకు మనసుకు మించిన భాషేముంటుంది. 

తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు..
తమ బిడ్డ ఎక్కుడున్నా సంతోషంగా ఉంటే తమకు అంతేచాలంటున్నారు శివకామి దంపతులు. ఇరవై ఏళ్లుగా ఎదురుచూసిన కొడుకుతో మూడు రోజులు ఆనందంగా గడిపారు. కొడుకుని కళ్లనిండా చూసుకొని బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికారు. ఇది కథ కాదు. కథ లాంటి వాస్తవ గాథ. సినిమాల్లోనే సాధ్యం అనుకునేంత నాటకీయత ఉన్న పేగు బంధం కథ. 


వార్తలు / కథనాలు

మరిన్ని