close
టెంపాలో నాట్స్ ఆర్థిక అక్షరాస్యత సదస్సు

టెంపా, ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆర్థిక అక్షరాస్యతపై టెంపాలో ఓ సదస్సు నిర్వహించింది. అమెరికాలో ఆర్థికాంశాలపై అవగాహన కల్పించేందుకు టెంపాలోని న్యూ టెంపా రీజనల్ లైబ్రరీలో ఈ సదస్సు ఏర్పాటు చేసింది. స్థానిక ప్రముఖ ఆర్థిక నిపుణులు శ్రీధర్ గౌరవెల్లి ఈ సదస్సుకు విచ్చేసి తన విలువైన సూచనలు సలహాలు అందించారు. దాదాపు 70 మందికి పైగా తెలుగువారు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఉన్నత విద్యకు నిధులు ఎలా పొందాలి? అమెరికాలో ఏ ప్రమాదానికి (రిస్క్‌) ఎలాంటి బీమా ఉంటుంది? ట్యాక్స్ ప్రణాళికలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ఇళ్లు, ఎస్టేట్‌లు కొనేందుకు ఎలా ప్రణాళికలు వేసుకోవాలి? ఆరోగ్య సంరక్షణకు ఆర్థికపరంగా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి? సంపాదించే ధనాన్ని చక్కటి ప్రణాళికతో దేనికెంత ఖర్చు చేయాలి? ఎలా పొదుపు చేసుకోవాలి? తదితర అనేక అంశాలపై ఆయన చక్కగా అవగాహన కల్పించారు. ఆయా అంశాలపై లేవనెత్తిన సందేహాలను సైతం ఆయన నివృత్తి చేశారు. టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్థానిక తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. ఈ సదస్సు ద్వారా అనేక ఆర్థిక అంశాలపై అవగాహన చేసుకున్నామని తెలిపారు. నాట్స్ ప్రతినిధులు రాజేశ్ కండ్రు, వంశీలతో పాటు పలువురు వాలంటీర్లు ఈ సదస్సు విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

సుధీర్ కుటుంబానికి నాట్స్‌ ఆర్థిక సాయం 
అచేతనా వ్యవస్థలో ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో ఉన్న సుధీర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు నాట్స్ ముందుకొచ్చింది. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుధీర్‌ తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతడిని బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో నాట్స్ సుధీర్ కుటుంబానికి అండగా నిలవాలని నిశ్చయించుకుంది. నాట్స్ టెంపా చాప్టర్‌ తరఫున, నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డు ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, రాజేష్, వంశీ తదితరులు ఇతర నాట్స్ సభ్యుల నుంచి సేకరించిన నిధులను, సుధీర్ పిల్లల చదువు నిమిత్తం 29,791.94 డాలర్ల విరాళాలను సేకరించి చెక్కు రూపంలో ఆ కుటుంబానికి అందించినట్టు తెలిపింది.

వార్తలు / కథనాలు

మరిన్ని