close
అమెరికాలో ఆయువు తీసిన జలపాతం

 నీట మునిగి ఇద్దరు యువకుల దుర్మరణం
  మృతుల్లో ఒకరిది కర్ణాటక, మరొకరిది నెల్లూరు

సింధనూరు(కర్ణాటక), న్యూస్‌టుడే: ఉన్నత ఆశయాలు ఆశగానే మిగిలిపోయాయి. పై చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనుకున్న ఇద్దరు యువకుల ఆశయాలను మృత్యువు చిదిమేసింది. సెలవు రోజున స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతున్న సమయంలో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. చేతికందిన కుమారుడు అమెరికాలోని ఓ జలపాతం వద్ద జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు శ్రీపురం కూడలికి చెందిన కోయిలమూడి అజయ్‌కుమార్‌(25) చదువుకునేందుకు గత ఏడాది డిసెంబరులో అమెరికా వెళ్లాడు. అర్లింగ్‌టన్‌ నగరంలో టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎం.ఎస్‌. తొలి సంవత్సరంలో ప్రవేశం పొందాడు. మంగళవారం సెలవు ఉండడంతో అజయ్‌, నెల్లూరుకు చెందిన తన మిత్రుడు కౌశిక్‌ సహా 8 మంది ఓక్లాలో ఉన్న టర్నర్‌ ఫాల్స్‌ పార్క్‌కు వెళ్లారు. దాదాపు 13 అడుగుల లోతున్న ఆ జలపాతంలో వీరంతా స్నానాలు చేస్తుండగా కౌశిక్‌ నీట మునిగాడు. ఆయనకు చేయి అందించబోయి అజయ్‌ కూడా మృత్యువాత పడ్డాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఓక్లా డావిస్‌ పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. శవ పరీక్షల అనంతరం బంధువులకు అప్పగిస్తామని సమాచారం ఇచ్చారు.
అజయ్‌ తండ్రి రైతు శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని కుడుకూరు గ్రామం నుంచి 40 ఏళ్ల కిందటే సింధనూరుకు వచ్చి స్థిరపడ్డారు. కొంతకాలం ఇ.జె.హొసళ్లి గ్రామపంచాయతీ సభ్యుడిగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం చేసి అమెరికా పంపారు. అక్కతో పాటే ఉంటాడని అజయ్‌ను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపారు. పది వరకూ సింధనూరులోనే చదివిన అజయ్‌ బళ్లారిలో పీయూసీ, బెంగళూరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. గత ఏడాది డిసెంబరులో అమెరికాకు వెళ్లాడని, అదే తమకు కడసారి చూపు.. అంటూ అజయ్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

వార్తలు / కథనాలు

మరిన్ని