close
ఘనంగా అంతర్జాతీయ సంగీత, నాట్య ఉత్సవాలు

సింగపూర్‌: సింగపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ నాట్య, సంగీత ఉత్సవాల బహుమతి ప్రదానోత్సవం 2019 అక్కడి భారతీయులను అలరించింది. సింగపూర్‌ తెలుగు సమాజం, త్యాగయ్య టీవీలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని సింగపూర్‌ ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సోసైటీ(సిఫాస్‌) ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా కళాకారులు శాస్త్రీయ నృత్య పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం జరిగిన కళామహోత్సవం కూడా ఎంతో వైభవంగా సాగింది. 


కర్ణాటక సంగీత కళాకారుడు డా. నిత్యశ్రీ మహదేవన్‌, నాట్యాచార్య డా.కృష్ణకుమార్‌లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాస్త్రీయ సంగీత విశేషాల ఆవశ్యకతను వివరించారు. అంతర్జాతీయ వేదికపై ఇలాంటి కార్యక్రమం నిర్వహించి కళాకారుల నైపుణ్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. మహా విద్వాంసులు శ్రీత్యాగరాజ జీవిత విశేషాలను వివరించారు. 


ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇక ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమని అన్నారు. అనంతరం త్యాగయ్య టీవీ ఎండీ బాలకృష్ణన్‌ మాట్లాడుతూ.. సింగపూర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సహకరించిన తెలుగు సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిత్యశ్రీ, కృష్ణకుమార్‌లను జీవనసాఫల్య పురస్కారాలతో, కోటిరెడ్డిని కళాబంధు బిరుదుతో సత్కరించారు. అనంతరం త్యాగయ్య టీవీ సీఈఓ మాట్లాడుతూ.. కార్యక్రమంలో విజేతలందరికీ బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందించామన్నారు. కార్యక్రమ నిర్వాహకులు జ్యోతీశ్వర్‌, స్వాతి, సుప్రియలతో పాటు పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని