close
‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేకస్థానం’

ఫ్రాన్స్‌తో బంధం ఈనాటిది కాదు: ప్రధాని మోదీ
ప్రవాసులను ఉద్దేశించి యునెస్కోలో ప్రధాని ప్రసంగం

పారిస్‌: భారత్‌- ఫ్రాన్స్‌ సంబంధాలు ఈనాటివి కాదని.. కష్టనష్టాల్లో ఈ రెండు దేశాలూ పరస్పరం సహకరించుకుంటాయిన ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నాలుగేళ్ల క్రితం తాను ఫ్రాన్స్‌ వచ్చినపుడు వేలాదిమంది భారతీయులు తనను అభినందించారని గుర్తు చేసుకున్నారు. ఫ్రాన్స్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. నవభారత్‌ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు. గత ఐదేళ్లలో దేశంలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి గర్వకారణమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగే కాదు.. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేక స్థానముందని చెప్పారు. అభివృద్ధి పథంలో భారత్‌ వేగంగా దూసుకెళ్తోందన్నారు. సేవ చేసేందుకు దేశ ప్రజలు తమకు మరోసారి అవకాశమిచ్చారని చెప్పారు. దేశంలో అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామన్నారు. 

సులభతర వాణిజ్యం, జీవన విధానం అమలుకు కృషి చేస్తున్నామని మోదీ చెప్పారు. 2030 నాటికి టీబీ నిర్మూలన ప్రపంచ లక్ష్యంగా ఉందని.. 2025 నాటికే ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత్‌ కృషి చేస్తోందన్నారు. దేశం క్రమంగా పేదరికం నుంచి బయటపడుతోందని చెప్పారు. ‘‘భారత్‌ అంకుర సంస్థల రంగంలో వేగంగా దూసుకెళ్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. నీటి సంబంధ సమస్యల పరిష్కారంపై ఆ మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. పేదలు, చిరు వ్యాపారులు, రైతులకు పింఛనుపై నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రధాని వివరించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని