
తాజా వార్తలు
వాషింగ్టన్: బాగ్దాదీ హతమైన తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ బాధ్యతలు స్వీకరించిన కొత్త నేతనూ అమెరికా వదలదని ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే అతని కోసం వేట ప్రారంభించామన్నారు. అతడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసన్నారు. ‘ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’లో మంగళవారం ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐసిస్ కొత్త నేత అంతం గురించి రెండు రోజుల వ్యవధిలో ట్రంప్ రెండు సార్లు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐసిస్ కొత్త నేతను కూడా అంతమొందించడానికి అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో ఉన్నట్లుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. సోమవారం ‘వార్ వెటరన్ కౌన్సిల్’ నిర్వహించిన సమావేశంలోనూ ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
గత నెల ఐసిస్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్-బాగ్దాదీని అమెరికా ప్రత్యేక బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఉత్తర సిరియాలోని ఇడ్లిబ్ అనే ప్రాంతంలో తలదాచుకున్న అతణ్ని బలగాలు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా అంతమొందించాయి. దీనిలో బాగ్దాదీ ప్రధాన అనుచరుడు అబు హసన్ అల్ ముజాహిర్ కూడా హతమయ్యాడు. దీంతో తమ తదుపరి నాయకుడిగా అబు ఇబ్రహీం అల్ హషిమి అల్ ఖురేషీని ఎన్నుకున్నట్లు ఐసిస్ ప్రకటించింది. తాజాగా ట్రంప్ ఖురేషీని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారు.