close

తాజా వార్తలు

ప్రేమలో మోసపోయిన ట్రంప్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : నాకు అందమైన ప్రేమ లేఖలు వస్తున్నాయి..! నేనూ కిమ్‌ ప్రేమలో ఉన్నాం..! కిమ్‌ అద్భుతమైన పాటలు పంపించారు..! అంటూ పావలా దానికి రూపాయి యాక్షన్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ షాక్‌ ఇచ్చారు. ట్రంప్‌ను మోసం చేశారు.. అణ్వాయుధాలను అత్యంత వేగంగా పెంచుకొనే పనిలో తలమునకలైపోయారు. పాపం ట్రంప్‌ను ప్రేమలో మోసం చేశారు..! ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఒక ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ 38 నార్త్‌ బహిర్గతం చేసింది.

2017లో ఉత్తర కొరియా చివరి సారిగా అణుపరీక్షలను నిర్వహించింది. దీంతో ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని ట్రంప్‌ నేరుగా హెచ్చరించారు. కానీ, కొన్ని నెలలకే సింగపూర్‌లో ఇరునేతలు భేటీ కావడంతో వాతావరణం మారిపోయింది. ఉ.కొరియా పాలకుడు కిమ్‌ను ట్రంప్‌ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఈ భేటీ నాటికి ఉత్తరకొరియా వద్ద దాదాపు 12 అణువార్‌ హెడ్‌లు ఉండవచ్చని అంచనా. ఆ చర్చల తర్వాత కూడా కిమ్‌ బృందం అణ్వాయుధాల తయారీ ఆపలేదు. దీంతో ఇప్పుడు వీటి సంఖ్య 20 నుంచి అత్యధికంగా 60 వరకు ఉండవచ్చని అంచనా. 

యాంగ్‌బియాన్‌లో అనుమానాస్పద కదలికలు..

ఉత్తర కొరియా అణు కార్యక్రమంలో యాంగ్‌బియాన్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వద్ద  ఇటీవల కాలంలో భారీగా జనసంచారం వాహనాల రాకపోకలు పెరిగిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేంద్రం చాలా పెద్దది దాదాపు 3చదరపు మైళ్ల వైశాల్యంలో విస్తరించింది. కుర్‌యాంగ్‌ నది పక్కనే దీనిని నిర్మించారు. దీనిలో వందలాది భవనాలు ఉన్నాయి. ఇక్కడే యురేనియం శుద్ధి చేసే ప్లాంట్‌ ఉంది. ఇక్కడే ఉన్న రేడియో ఐసోటోప్‌ ఫెసిలిటీని సమీపంలోని రెండు భవనాలకు అనుసంధానించారు.  ఈ కేంద్రంలో ఉత్తరకొరియా అణుబాంబులకు అవసరమైన ఫ్లుటోనియం, శుద్ధిచేసిన యురేనియంను ఉత్పత్తి చేస్తుంది.  ఫిబ్రవరి 16వ తేదీన అక్కడకు ఒక భారీ ట్రాలర్‌ అక్కడకు చేరుకొంది. మార్చి 27 ఉదయం వరకు అక్కడే ఉంది. ఆ తర్వాత ఒక తెల్లటి భారీ సిలిండర్‌ తీసుకొని అక్కడి నుంచి బయల్దేరి గ్యాస్‌ సెంటర్‌ ఫ్యూజన్‌ హాల్‌ సమీపంలో దానిని దించేసింది. మే9, మే28 వ తేదీల్లో మరో సారి ఇదే ట్రాలర్‌ అక్కడ కనిపించింది. వేర్వేరు వ్యక్తులు ఇక్కడికి వచ్చినట్లు గుర్తించారు. ఈ వాహనం ఆకారాన్ని బట్టి దానిలో ద్రవ  నైట్రోజన్‌ ఉందని అమెరికా నిఘావర్గాలు తేల్చాయి. యురేనియం శుద్ధిలో ఇది అత్యంత కీలకమైంది. ఇక్కడి భవనాల ఆకారాలు, వాహనాల రాకపోకలను బట్టి ఉత్తరకొరియా వద్ద దాదాపు 4,000 సెంటర్‌ ఫ్యూజ్‌లు వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు సమీపంలోని కుర్యాంగ్‌ నదిని ఎక్స్‌పెరిమెంటల్‌ లైట్‌ వాటర్‌ రీయాక్టర్‌లో కార్యకలాపాలకు వాడుతున్నట్లు  ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. 

శీతాకాలం చెప్పే నిజాలు..

శీతాకాలంలో చుట్టుపక్కల మంచు నిలిచినా ఈ భవనాల వద్ద మాత్రం మంచు ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా రేడియోధార్మిక పదార్థాలు ఉండే చోట వేడి ఎక్కువగా  దీంతో మంచు పడినా వెంటనే కరిగిపోతుంది. ఈ కారణంతోనే అక్కడి భవనాలపై అస్సలు మంచు ఆనవాళ్లే లేవు. ఇది కూడా నిఘావర్గాల ధ్రువీకరణకు ఉపయోగపడింది. 

అక్కడ తొలగించినా..

యాంగ్‌ బియాన్‌ పరిశోధన కేంద్రం వద్ద కూలింగ్‌ రీయాక్టర్‌ను గతంలో  అమెరికా కోసం ప్రపంచ  దేశాల ఎదుట కూల్చివేసింది. ఆ తర్వాత వియత్నాంలోని హనోయ్‌లో జరిగిన సదస్సులో ఈ కేంద్రాన్నే కూల్చేస్తానని కిమ్‌ ప్రతిపాదించారు. కానీ, దీనికి ప్రతిగా  అమెరికా ఆర్థిక ఆంక్షలు తొలగించాలని మెలిక పెట్టారు. దీనికి ట్రంప్‌ అంగీకరించలేదు. సాన్యూమ్‌డాండ్‌, కాంగ్‌సన్‌, హామ్‌హంగ్‌ల్లోని కేంద్రాలను కూడా తొలగించాలని కోరారు. దీంతో చర్చల్లో చిక్కుముడి పడింది. యాంగ్‌బియాన్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని సాన్యూమ్‌డాండ్‌ కేంద్రంలో అణుబాంబులను ప్రయోగించే క్షిపణులను తయారు చేస్తున్నారు. ఇక్కడి తయారయ్యే ఖండాంతర క్షిపణులకు అమెరికాను తాకేంత శక్తి ఉంది. ఇక్కడ కూడా క్రేన్లు, భారీ ట్రాలర్‌ల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. అణు వార్‌హెడ్లు,  క్షిపణులను భారీగా ఉత్పత్తి చేసి మోహరించాలనే కిమ్‌ ఆదేశాల మేరకే ఇవి జరుగుతున్నట్లు సీఐఏ భావిస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలు ఉండటంతో సెల్‌ఫోన్లకు ఉపయోగించే కొన్నిరకాల పదార్థాలను ఈ ఆయుధాల్లో ఉపయోగించేందుకు ఉత్తరకొరియా  భారీగా వాటిని కొనుగోలు చేస్తోందని జపాన్‌ ఆరోపిస్తోంది. 

వాస్తవానికి సింగపూర్‌ చర్చల తర్వాత ఉత్తర కొరియా సోహీ శాటిలైట్‌ సెంటర్‌ను తొలగించినా పరీక్షలు మాత్రం ఆపలేదు. ట్రక్కులపై క్షిపణులను తరలించి వేర్వేరు చోట్ల పరీక్షలు నిర్వహించింది. ఈ అంశం ఒక విషయాన్ని వెల్లడిస్తోంది. ఉ.కొరియ ఇక పరీక్షలపై దృష్టి పెట్టడం మానేసి భారీ సంఖ్యలో క్షిపణులు, అణు వార్‌హెడ్ల ఉత్పత్తిని చేపట్టినట్లు అర్థమవుతోంది. హనోయ్‌ సదస్సు తర్వాత ఉ.కొరియా కూల్చేసిన కొన్ని పరీక్షా కేంద్రాలను మళ్లీ నిర్మించడం మొదలుపెట్టింది. మరోపక్క నిఘా సంస్థలు ఆధారాలు సేకరించి ట్రంప్‌ ప్రభుత్వానికి అందజేసినా ఎన్నికల సమయంలో ఇది తనకు చేటు చేస్తుందని భయపడుతున్నారు. దీంతో ఆయన విషయ తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఒక విలేకరి ‘ఉ.కొరియా ఇంకా అణ్వాయుధాలను చేస్తోందని అనుకుంటున్నారా..?’ అని ట్రంప్‌ను ప్రశ్నించారు. దానికి ట్రంప్‌ సమాధానమిస్తూ..‘నాకు తెలియదు.. చేయరని ఆశిస్తున్నాను.. నాకు మాట ఇచ్చారు.’ అంటూ పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. పాపం కిమ్‌ ప్రేమలో ట్రంప్‌ మోసపోయారని ఆ విలేకరి జాలిగా చూశారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.