close

తాజా వార్తలు

భారత్‌పై ట్రంప్‌ అక్కసుకు కారణాలివే..!

 పాక్‌ను చూసి ఒళ్లుమరిచిపోయి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ట్రంప్‌ తీరు సాధారణంగా చిల్లర పంచాయతీల్లో కూర్చునే పెద్దలను తలపిస్తుంది. ఆయన అతి కష్టం మీద మాట్లాడే నాలుగు మంచి మాటలకే ఎదుటివాళ్లు పడిపోవాలనుకుంటారు.. అలా జరగకపోతే కండబలం చూపించడానికి కూడా వెనుకాడరు. చైనాపై.. ఖతార్‌పై.. ఇప్పుడు భారత్‌పై ఆయన ఇదే వ్యవహార శైలిని పాటిస్తున్నారు. ఆయన మాట వినని వారిని ఇబ్బంది పెట్టడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడతారు.. ఈ క్రమంలో అబద్ధాలు చెప్పడానికి కూడా వెనుకాడరు. 

తాజాగా కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం చేయమన్నారని మోదీ కోరినట్లు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఆయన ఏదో యథాలాపంగా చేసిన ఈ వ్యాఖ్యలతో భారత్‌-అమెరికా సంబంధాలు ఒక కుదుపునకు లోనయ్యాయి. ఈ వ్యాఖ్యలను భారత్‌ కొట్టిపారేసింది. ట్రంప్‌ అబద్ధం చెప్పారు అన్న అర్థం వచ్చేలా భారత విదేశాంగ కార్యదర్శ రవీశ్‌కుమార్‌  ట్వీట్‌ చేశారు. ఇక ట్రంప్‌ వ్యాఖ్యలు పార్లమెంట్‌లో భాజపాను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఇది ఒక రకంగా ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా ఇరుకున పెట్టింది. 

అసలేం జరిగి ఉంటుంది..

సాధారణంగా ఉన్నత స్థాయి నేతలకు భేటీలకు ముందు మాట్లాడాల్సిన అంశాలపై బ్యూరోక్రాట్లు క్షుణ్ణంగా వివరిస్తారు. ఈ బ్రీఫింగ్‌ను దాటి మోదీ మాట్లాడే రకం కాదు. అందుకనే గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చించింది విదేశాంగ శాఖే అంటే అతిశయోక్తి కాదు. ఇక ట్రంప్‌ విషయానికి వస్తే ఆయన బ్రీఫింగ్‌లను పెద్దగా పట్టించుకొనే రకం  కాదు. ఆయనకు ప్రొటోకాల్‌, భద్రతా అంశాలు  ఏమాత్రం పట్టవు. ఆయన ప్రొటోకాల్‌కు భిన్నంగా ప్రవర్తించి చాలా సార్లు విమర్శలకు గురైయ్యారు.  ఇటీవల కూడా పాక్‌ హఫీజ్‌ సయూద్‌ను అరెస్టు చేయడం తన గొప్పతనమేనని ట్విటర్‌లో జబ్బలు చరుచుకొన్నారు. ఆ తర్వాత అమెరికా అధికారులు ఆయన ట్వీట్‌కు వ్యతిరేకంగా ట్వీట్‌ చేసి తప్పు సరిదిద్దే యత్నం చేశారు. కశ్మీర్‌పై వ్యాఖ్యల విషయంలో కూడా ఇదే జరిగింది.
 
కశ్మీర్‌ సమస్య భారత్‌, పాక్‌ మధ్య ద్వైపాక్షిక అంశమని మంగళవారం ప్రకటించింది. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలు కూర్చొని మాట్లాడుకోవడాన్ని తాము స్వాగతిస్తామని తెలిపింది. ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఈ మేరకు స్పందించారు. ‘‘పాక్‌ తమ భూభాగంలోని ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపితే.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు బీజం పడుతుంది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పుడు ఆ దిశగా పని ప్రారంభించారు’’ అని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్‌, పాక్‌ కోరితే కశ్మీర్‌ వివాద పరిష్కార ప్రక్రియలో సహాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని శ్వేతసౌధం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

పాక్‌ పై ప్రేమకు ఇదే కారణం..

ఏడాది క్రితమే పాకిస్థాన్‌పై  నిప్పులు కక్కి దాదాపు 2 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపేసిన ట్రంప్‌లో ఇప్పుడు ఇంత మార్పుకు కారణం ఉంది. అదే 2020లో అమెరికా ఎన్నికలు. ఎంతైనా ట్రంప్‌కు కూడా ఓట్లు కావాలిగా..! ఆయన గత ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆఫ్గనిస్థాన్‌ నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగిన వెంటనే తాలిబన్లు అక్కడ అధికారం దక్కించుకొనే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే దాదాపు 18ఏళ్లు వ్యయప్రయాసలకోర్చి చేసిన యుద్ధం ట్రంప్‌ కారణంగా  వృథా అయిందనే ప్రచారం జరుగుతుంది. ఇది ఒక రకంగా అమెరికా ఓటమే అవుతుంది. దీంతో అమెరికా సేనలు పరువు దక్కించుకొనేలా తాలిబన్లతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్‌ సర్కారు భావిస్తోంది. దీనికి తాలిబన్ల పగ్గాలను పట్టుకొన్న ఐఎస్‌ఐ, పాక్‌ సైన్యం సాయం తప్పని సరి. అందుకే పాక్‌ను సంతృప్తి పర్చి ఆఫ్గన్‌ యుద్ధం గెలవాలన్నది ట్రంప్‌ వ్యూహం. అందుకే ఈ సారి చర్చలకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు, సైనిక జనరల్‌ బజ్వా, ఐఎస్‌ఐ చీఫ్‌ కూడా అమెరికాకు వచ్చారు. సాధారణంగా ప్రజస్వామ్య దేశానికి చెందిన నాయకులతో సైనికాధికారులు కూడా రావడం అరుదైన విషయం. 

ఈ క్రమంలో భాగంగా ట్రంప్‌ సర్కారు ఇమ్రాన్‌ పర్యటనకు ముందే బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. బలోచిస్థాన్‌లో పాక్‌ సైన్యం చేసే దారుణాలను ఈ సంస్థ వ్యతిరేకిస్తుంది. అటువంటి దానిని ఉగ్రసంస్థగా ప్రకటించడంపై ట్రంప్‌ సర్కారు విమర్శలకు గురైంది. మరోపక్క  పాక్‌ కూడా హఫీజ్‌ సయీద్‌ను అరెస్టు చేసి అమెరికాను సంతృప్తి పర్చేందుకు ప్రయత్నించింది. ఇక  ఇమ్రాన్‌తో భేటీ అనంతరం పరవశానికి లోనైనా ట్రంప్‌ కశ్మీర్‌పై మోదీ మధ్యవర్తిత్వాన్ని కోరారని ప్రకటించారు. ఇది ఇమ్రాన్‌ను బాగా ఖుషీ చేసి ఉంటుంది. ఆయన స్వదేశానికి వెళ్లి దీనినో దౌత్య విజయంగా ప్రచారం చేసుకొంటారు. ఇప్పటికే పాక్‌ మీడియాలో సంతోషం పెల్లుబుకుతోంది.

వ్యాపార కారణాలు.. 

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి. భారత్‌కు జీఎస్పీ హోదా తొలగించడం, టారీఫ్‌లు పెంచడం వంటి చర్యలకు ప్రతిగా భారత్‌ కూడా అమెరికా వ్యవసాయ వస్తువులపై టారీఫ్‌లు పెంచింది. ట్రంప్‌కు పట్టు ఉన్న అమెరికా గ్రామీణ ఓటర్లు దీనికి ప్రభావితం అవుతారు. ఇది ట్రంప్‌కు మంటపుట్టించింది. దీనికితోడు భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా ప్రకటించి లెమావో, కోమ్‌కాసా వంటి సైనిక ఒప్పందాలు చేసుకొంది. కానీ, భారత్‌ మాత్రం తన కీలక ఆయుధాల కోసం రష్యాపైనే ఆధారపడుతోంది. అమెరికా ఆయుధాలు విక్రయించాక వాటి వాడకం విపరీతమైన మెలికలు పెడుతుంది. దీంతో భారత వ్యూహాకర్తలు రష్యానే నమ్ముకొన్నారు. ఎస్‌-400, అకుల శ్రేణి సబ్‌మెరైన్లు, ఫ్రిగేట్లను రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఆర్డర్లు ఇచ్చింది. ఇవన్నీ కలిపి దాదాపు 9బిలియన్‌ డాలర్ల విలువ ఉంటుంది. ఇక అమెరికా నుంచి దాదాపు అపాచీ  హెలికాప్టర్లు తప్పితే భారత్‌ ఇప్పటి వరకు పెద్దగా కొనుగోలు చేసిందేమీ లేదు. ఇది అమెరికా అధ్యక్షుడికి ఏమాత్రం రుచించలేదు. భారత్‌-అమెరికా వాణిజ్య లోటు 21బిలియన్ డాలర్లకు పైగా భారత్‌కే అనుకూలంగా ఉంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సమం చేయాలని ట్రంప్‌ ఆత్రపడుతున్నారు. ఈ క్రమంలో భారత్‌ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఆయనలో అసహనానికి కారణమవుతోంది. అందుకే భారత్‌ను ఇరుకునపెడతానని హెచ్చరించేందుకు ట్రంప్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా రిపబ్లిక్‌డే పరేడ్‌కు రావటంలేదనే విషయాన్ని వ్యూహాత్మకంగా లీక్‌ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ట్రంప్‌ సర్కారు ప్రయత్నించిన విషయం తెలిసిందే. 
ఈ వ్యాఖ్యల ప్రభావం ప్రధాని మోదీ సెప్టెంబర్లో చేయాల్సిన అమెరికా పర్యటనపై పడే అవకాశం కూడా ఉంది.  ఒక రకంగా అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బయటకు వచ్చేస్తే ఇక పాకిస్థాన్‌తో అమెరికాకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషయం పాక్‌కు కూడా తెలుసు. ఈ క్రమంలో ట్రంప్‌ ఎన్నికల ఆరాటాన్ని వీలైనంత సొమ్ము చేసుకొనేందుకు ఆ దేశ వ్యూహకర్తలు ఉచ్చులు విసురుతుంటారు. వాటిల్లో పడిన ప్రతిసారి ట్రంప్‌ భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుంటారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.