
తాజా వార్తలు
లాస్ ఏంజిలెస్ : మనమంతా కూడా బాల్యంలో ఇంగ్లీషు వర్ణమాల నేర్చుకునేటప్పుడు ‘ABCD’ సాంగ్ వినే ఉంటాం. అందులో ఉన్న వేగవంతమైన టెంపో కారణంగా ‘LMNOP’లు కొత్తలో వదిలిపెట్టే నేర్చుకుంటాం. అయితే పాటలో చేసిన చిన్న మార్పుతో ఆ సమస్యకు చెక్ పెట్టినట్లయింది. అక్టోబర్‌లో చివరి వారంలో సామాజిక మాధ్యమంలోకి వచ్చిన ఈ పాట ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్కు చెందిన నోహ్ గార్ఫింకెల్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘LMNOP’ వద్దకు రాగానే పాటలో టెంపో నెమ్మదించడమే ఈ కొత్తపాటలోని ప్రత్యేకత. ఈ పాటను ఏడేళ్ల క్రితం ‘డ్రీమ్ ఇంగ్లీష్ కిడ్స్’ యూట్యూబ్ ఛానల్‌కు చెందిన మేట్ రూపొందించారని తెలిసింది. అందరు చిన్నారులు ఆంగ్ల వర్ణమాలను సులభంగా అర్థం చేసుకునేందుకే ఈ పాటను రూపొందించానని చెప్పినట్లు ఎన్పీఆర్ పేర్కొంది. ఆటిజంతో బాధపడుతున్న ఓ చిన్నారి తల్లి సైతం ఈ పాట విని అభినందనలు తెలుపుతూ మేట్‌కు లేఖ రాసింది. తన కుమారుడికి కష్టతరమైన వర్ణమాలను సులభంగా నేర్చుకునేలా పాట రూపొందించారని అందులో పేర్కొంది. అయితే గతంలో కూడా అమెరికాకు చెందిన సెసమే స్ట్రీట్ అనే కార్టూన్ ఛానల్ ఇలాంటి టెంపోయే రూపొందించిందని తెలిసింది.