close

తాజా వార్తలు

విధినెదిరించి.. మృత్యువును జయించి..

డెంగీ బారినుంచి బయటపడ్డ శిశువు
17రోజులపాటు ఉచిత చికిత్స అందించిన వైద్యుడు
మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే

ఆ యుద్ధంలో గెలుపు అంటే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అయినా ఓటమి చరిత్రని వెక్కిరించి ఆ పసికందు గెలిచాడు. తన వారితో మొదలై,  తనదాక వచ్చినా ఆ మృత్యువునే జయించాడు. తనకేమీ కానీ ఆ పసికందుకు ఓ వైద్యుడు చేయూతనిచ్చాడు. కథలా అనిపించే ఈ వ్యధలో డెంగీ కోరలు చాచి  అయినవారందరినీ అంతం చేసినా ఆ పసిబాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

మూడు తరాలకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులను పొట్టనపెట్టుకున్న డెంగీని 19రోజుల పసికందు జయించాడు. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూర్తి ఆరోగ్యవంతుడిగా బయటకు వచ్చాడు. డెంగీ మహమ్మారి బారినపడి ఇటీవల మృతి చెందిన సోని-రాజగట్టు దంపతుల రెండో కుమారుడు గత 17 రోజులుగా ప్లేట్‌లెట్స్‌ తగ్గి ప్రాణాలతో పోరాడగా సంబంధిత ఆసుపత్రి వైద్యుడు కుమార్‌వర్మ ప్రాణాలు నిలబెట్టారు. నాలుగుసార్లు ప్లేట్‌లెట్స్‌ను పలుమార్లు ఎఫ్‌ఎఫ్‌పీ ఎక్కించి రూ.10 లక్షల వరకు అయ్యే చికిత్స ఖర్చును పూర్తిగా ఆయనే భరించి మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం శిశువును కుటుంబ సభ్యులకు అప్పగించి చికిత్స వివరాలను వెల్లడించారు. చిన్నారికి తల్లి నుంచి ఈ వ్యాధి సోకిందని, చాలా అరుదుగా ఇలా జరుగుతుందన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ, పాథాలజిస్టు డా.వంశీ, డా.ప్రమోద్‌కుమార్‌, డా.నరేందర్‌లు ఆ చిన్నారి చికిత్సలో పాలుపంచుకున్నారు.
మూడుతరాల వారు మృత్యుఒడిలోకే..
గతనెల పక్షంరోజుల వ్యవధిలో మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డెంగీ కారణంగా మంచిర్యాల కేంద్రంలోని చున్నంబట్టివాడకు చెందిన గుడిమల్లు రాజగట్టు గతనెల జ్వరంతో చికిత్స పొందుతూ అక్టోబర్‌ 16న చనిపోగా ఆ తర్వాత అయిదోరోజు ఆయన తాత లింగయ్య 20న మరణించారు. రాజగట్టు 6ఏళ్ల కుమార్తె శ్రీవర్షిణి అదే నెల దీపావళి రోజున మృత్యువాత పడ్డారు. అప్పటికే రాజగట్టు సతీమణి సోని 9నెలల గర్భిణి కావడం.. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె కూడా మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో పాటు పుట్టిన బిడ్డ కూడా డెంగీ భారిన పడి 17రోజులుగా మృత్యువుతో పోరాడి డెంగీని జయించి, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.