close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. వైజాగ్‌లో 42 కి.మీ మారథాన్‌

విశాఖ బీచ్ రోడ్డులో ‘వైజాగ్ నేవీ మారథాన్’ ఘనంగా  ప్రారంభమైంది. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలో మీటర్లు ఆఫ్ మారథాన్, 10 కి.మీ, 5 కి.మీ నాలుగు విభాగాల్లో ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్ లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.75 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు  మూడో బహుమతి రూ.25 వేలు అందజేయనున్నారు. ఈ మారథాన్‌లో రాష్ట్ర నలుమూలల నుంచి 18 వేల మంది క్రీడా కారులు, నేవీ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. గుండెపోటుతో లోకో పైలట్‌ మృతి

కాచిగూడ వద్ద హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొట్టినఘటనలో తీవ్రంగా గాయపడిన లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ శనివారం మృతి చెందారు. గత  సోమవారం ఉదయం 10.42గంటలకు ప్రమాదం జరగగా, లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ ఎంఎంటీఎస్‌ రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయారు. సుమారు 8 గంటలకు పైగా శ్రమించిన సిబ్బంది అతడిని రాత్రి 6.40 గంటలకు బయటకు తీసుకొచ్చి నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఏపీ  వైపు భారీ పరిశ్రమలు!

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ సంస్థలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఆయా పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేలా పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ప్రముఖ పానాసోనిక్‌ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు, ఫిలిప్స్‌ కార్బన్‌(బ్లాక్‌ కార్బన్‌) రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. రెండు సంస్థలు 3,500 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ప్రాథమిక స్థాయిలో పాఠాల కుదింపు

ఒకటి నుంచి 5వ తరగతి వరకు పాఠ్యాంశాలను తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) భావిస్తోంది. విషయాలను విస్తృతంగా కాకుండా ఉన్న పాఠాలనే లోతుగా నేర్చుకునేలా బోధన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. పాఠాలు చెప్పేందుకే విద్యాసంవత్సరమంతా సరిపోతే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సమయం ఉండబోదని పేర్కొంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కొత్తవారికి జనవరి నుంచి ఆరోగ్యశ్రీ

సవరించిన నిబంధనల ప్రకారం కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేవారికి జనవరి నుంచి ఈ పథకంలో సేవలు అందనున్నాయి. ప్రస్తుతం 1.60 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కల్పించిన వెసులుబాటు ప్రకారం మరో 4-5 లక్షల కుటుంబాలకూ ఈ పథకం అందుతుంది. వీరందరికీ వచ్చే జనవరి నుంచి ఈ పథకాన్ని అమలుచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ‘బస్తీ దవాఖానా’కు జాతీయ పురస్కారం

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బస్తీ దవాఖానా పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం ప్రారంభమైన 6వ జాతీయ ఆదర్శ, వినూత్న ఆరోగ్య పథకాల సదస్సులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ‘బస్తీ దవాఖానా’ను కొనియాడారు. ఈ పథకానికి గాను తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితా రాణాకు పురస్కారం అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పెద్దల సభకు పెద్ద పండగ

పార్లమెంటులోని పెద్దల సభ ఓ పెద్ద పండగకు సిద్ధమవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో తనదైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న రాజ్యసభ... ఈ నెల 18న 250వ సమావేశం జరుపుకోనుంది. మేధావులు, ఆలోచనపరులు, అనుభవజ్ఞులతో ఈ సభ.. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాటి ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ఆవేశకావేశాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో చట్టాలపై చర్చించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఆ తీర్పు అప్రజాస్వామికం: మావోయిస్టు పార్టీ

బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అప్రజాస్వామికమని సీపీఐ మావోయిస్టు పార్టీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కమిటీ కార్యదర్శి గణేష్‌ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నవభారత్‌ పేరుతో హిందూ రాజ్యాన్ని నిర్మించడం, భిన్నత్వంలో ఏకత్వం పేరుతో దేశంలోని సర్వవైవిధ్యాలను ఉరితీసి, హిందూత్వాన్ని అనుమతించడం వల్లే సుప్రీం తీర్పును అప్రజాస్వామికమని పేర్కొంటున్నామని తెలిపారు. 

9. పార్కింగ్‌లో చోరీ జరిగితే నిర్వాహకుడిదే బాధ్యత

వాహనాల పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు చోరీ జరిగితే దాన్ని నిర్వహిస్తున్న యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘వాహనానికి ఏదైనా జరిగితే దాని యజమానిదే బాధ్యత’ అని బోర్డు పెట్టి తప్పించుకోలేరని తెలిపింది. ఈ మేరకు న్యాయస్థానం తాజ్‌మహల్‌ హోటల్‌ వర్సెస్‌ యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ కేసులో తీర్పు చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బిల్‌గేట్స్‌ మళ్లీ అగ్రస్థానానికి

ప్రపంచ కుబేరుల్లో బిల్‌గేట్స్‌ మరో సారి తన అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ఈ పీఠాన్ని అధిరోహించారు. మైక్రోసాఫ్ట్‌కు 10 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.70,000 కోట్లు) క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కాంట్రాక్టు రావడం ఇందుకు నేపథ్యం. గేట్స్‌ సంపద 110 బిలియన్‌ డాలర్లకు(సుమారు రూ.7.7 లక్షల కోట్లు) చేరుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ చెబుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.