close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. తెదేపా నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్‌

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెదేపా నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. షోకాజ్‌ నోటీసు ద్వారా వంశీ వివరణ కోరనున్నారు. గురువారం వంశీ మీడియా సమావేశం నిర్వహించి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా ప్రభుత్వానికి తాను బేషరతు మద్దతు ఇస్తానని, సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనులకు అండగా ఉంటానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సమ్మెపై ప్రభుత్వం మొండివైఖరి వీడాలి:మల్లురవి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను పక్కన పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్చలు చేపట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికులు పెద్ద మనసుతో పట్టు విడుపులు ఉండాలనే ఒక్క అడుగు వెనక్కు తగ్గారని చెప్పారు. 41 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు. చర్చలు లేవు.. రాజీ లేదు.. సెల్ఫీ డిస్మిస్ అంటూ సీఎం కేసీఆర్‌ మొండి వైఖరి ప్రదర్శించడం తగదని మల్లు రవి హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చంద్రబాబు దూతగా దిల్లీకి పవన్‌: అంబటి

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ‌మోహన్‌రెడ్డిని విమర్శించినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీలు వస్తున్నాయని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇసుక, ఆంగ్ల మాధ్యమంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన దూతగా పవన్ కల్యాణ్‌ను దిల్లీకి పంపారని అంబటి ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొనసాగుతున్న ఆర్టీసీ నిరసనల పర్వం

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఖమ్మంలో ఇవాళ నిర్వహించిన ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతలకు దారి తీసింది. ఐకాస పిలుపు మేరకు బైకు ర్యాలీకి సిద్ధమయ్యేందుకు ఖమ్మం బస్‌డిపోవద్ద కార్మికులు గుమిగూడారు. అనంతరం ఒక్కసారిగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ క్యాంపు కార్యాలయం వైపు ర్యాలీ చేపట్టారు. తొలుత కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆ తర్వాత కొంతమంది కార్మికులు క్యాంపు కార్యాలయం గేట్లు దూకి లోపలికి దూసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ట్రావెల్స్‌ బిజినెస్‌ కొంతకాలం ఆపేస్తా:జేసీ

జగన్‌ ప్రభుత్వంలో ప్రతీకారవాంఛ ఎక్కువైందని తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రత్యర్థులను హింసించే సమయంలో అధికారం శాశ్వతంకాదన్న సంగతి గ్రహించాలని ఆయన హితవు పలికారు. అమరావతిలో జేసీ మీడియాతో మాట్లాడారు. తెదేపా నుంచి బయటకు వెళ్లే వారు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రోజూ కేసుల గొడవ ఎందుకని.. ట్రావెల్స్‌ వ్యాపారం కొంతకాలం మానేయ్యాలని అనుకుంటున్నానని జేసీ చెప్పారు. నాలుగు రోజులు బస్సులు నిలిపేస్తే బాగుంటుందనే ఆలోచనతో తాను ఉన్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. త్వరలో జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు

జమ్ముకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాటి పునర్మిణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్ గిరీశ్‌ చంద్ర ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని అన్నారు. ఇది అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడి వ్యవహారాలను కేంద్రం నేరుగా పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ త్వరలో మొదలవుతుంది. దీనికోసం ఇక్కడి యంత్రాంగం, పౌరులు అంతా సహకరించాలి’ అని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

ఐఎన్‌ఎక్స్‌ మీడియా, మనీలాండరింగ్‌ కేసుల్లో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారించిన దిల్లీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నెల 8న చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌ కైత్‌ విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై మరోసారి ఈరోజు విచారించిన దిల్లీ హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ రైళ్లలో భోజనం ధరలు పెరిగాయ్‌!

రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం ధరల పెంపుపై ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో భోజనం ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు ఈ రైళ్లలో మొదటి ఏసీ, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో ప్రయాణించే వారు ఒక కప్పు టీకి రూ.29 చెల్లించేవారు. కానీ ఇకపై రూ.35లు చెల్లించాల్సి ఉంటుంది. అల్పాహారం ధర రూ.7 పెంచడంతో దాని ధర రూ. 140లు కానుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంపైనా రూ.15ల చొప్పున వడ్డించాలని నిర్ణయించడంతో ఇక మీదట ప్రయాణీకులు వాటికి రూ.245 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 50కిలోల బంగారం స్వాధీనం: ఆరుగురి అరెస్టు

దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో 50కిలోలకు పైగా స్మగ్లింగ్‌ బంగారం స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు వెల్లడించారు. గువాహటి, సిలిగురి, వారణాసిలలో ఏకకాలంలో దాడులు చేసి 50 కిలోలకు పైగా పసిడిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. నవంబర్‌ 11న అర్ధరాత్రి సమయంలో పట్టుకున్న ఈ బంగారం మొత్తం విలువ సుమారు రూ. 20.40 కోట్లు మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్లు లాభపడి 40,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 11,895 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.78గా ఉంది. ఒకానొక దశలో 363 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌.. చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్వల్ప లాభాలతో ముగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.