close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించలేం:హైకోర్టు

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ను ఉన్నత న్యాయస్థానం కోరింది. మరోవైపు బస్సుల్లో అధికఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధికఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ‘మహా’లో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫారసు

దాదాపు 20 రోజులుగా ఉత్కంఠగా సాగిన నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించినప్పటికీ భాజపా, శివసేన పార్టీలు అవసరమైన మద్దతు కూడగట్టలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫారసు చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. 50 శాతం ఉద్యోగాలు మహిళలకే: జగన్‌

‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ ఎంప్లాయీస్‌’ వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్‌ కార్పోరేషన్‌ను ప్రారంభిస్తున్నామని, పొరుగుసేవల ఉద్యోగాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పొరుగుసేవల ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50 శాతం మంది ఉండాలని, అంతేకాకుండా జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. సుప్రీంకు చేరిన ‘మహా’ రాజకీయం

క్షణక్షణానికి మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మద్దతు కూడగట్టుకునేందుకు అదనపు గడువు కోరితే గవర్నర్‌ తిరస్కరించడంతో శివసేన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. గృహరుణ సంస్థలకు మినహాయింపులు రద్దు!

గృహరుణ వ్యాపార సంస్థలకు (హౌసింగ్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీలు) అందజేస్తున్న కొన్ని రకాల మినహాయింపులను ఆర్‌బీఐ రద్దు చేసింది. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలతో సమానంగా వీటికి నిబంధనలను విధించింది. ది ఫైనాన్స్‌ యాక్ట్‌ 2019లో మార్పులు చేసి ది నేషనల్‌ బ్యాంక్‌ చట్టం 1987ను సవరించిన తర్వాత ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ సవరణతో గృహరుణ వ్యాపార సంస్థల నిబంధనలను సవరించే అధికారం ఆర్‌బీఐ చేతికి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా?: పవన్‌

మూడేళ్లపాటు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం రాదనుకున్నానని.. ప్రభుత్వ వైఖరితో నాలుగు నెలలకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రజల కష్టాల గురించి తాము అడిగితే వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారని.. తాను చేసుకున్న పెళ్లిళ్ల వల్లే రెండేళ్ల జైలుకు వెళ్లారా? అని జగన్‌ను ఉద్దేశించి పవన్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కశ్మీరులో ఫలితాలిస్తోన్న ‘ఆపరేషన్‌ మా’

దారి మళ్లి ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న జమ్మూకశ్మీర్‌ యువతను సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘ఆపరేషన్‌ మా’ పేరుతో ఇండియన్‌ ఆర్మీ ఫిబ్రవరిలో మొదలు పెట్టిన పథకం ద్వారా ఇప్పటివరకూ 60 మంది యువకులు ఉగ్రవాదం పడగ నీడను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తమ కుటుంబాలను చేరుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ప్రజలకోసం పోరాడితే కేసులా?: తెదేపా

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెదేపా నేతల బృందం కలిసింది. మాజీ మంత్రి అఖిల ప్రియ కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం అఖిల ప్రియ, తెదేపా నేతలు విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి తనను, తన భర్తను వేధిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు అఖిలప్రియ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. 14 నుంచి ఇసుక వారోత్సవాలు: జగన్‌

నవంబర్‌ 14 నుంచి నవంబర్‌ 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. గతంలో సరాసరి ఇసుక డిమాండ్‌ 80 వేల టన్నులు ఉందని, వరదల కారణంగా రీచ్‌లు మునిగిపోవడంతో డిమాండ్‌ను చేరుకోలేకపోయామన్నారు. 13 జిల్లాల కలెక్టర్లతో ఇవాళ ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందన్న సీఎం.. ప్రస్తుత సరఫరా 1.2 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఎంఎంటీఎస్‌ డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో క్యాబిన్‌లో చిక్కుకున్న ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని కేర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.సుష్మ వెల్లడించారు. ఈ మేరకు ప్రమాదంలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆమె హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.