close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. అయోధ్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని అలహాబాద్‌ హైకోర్టు మూడు భాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదంది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించాలని పేర్కొంది. ఆ స్థలంలో ఆలయం నిర్మించాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇప్పటి వరకు 170 మందిని అరెస్టు చేశాం: సీపీ

తెలంగాణ ఆర్టీసీ ఐకాస, విపక్షాలు సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు.శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. కొందరు ఐకాస నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీకుల చెందిన  కొందరు నేతలను శుక్రవారమే అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ట్యాంక్ బండ్‌పై వాతావరణం ప్రశాంతంగా ఉందని అంజనీకుమార్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చైనాతో ఒప్పందానికి అంగీకరించలేదు: ట్రంప్‌

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి ఇక తెరపడిందన్న ఆశలకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గండికొట్టారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని ప్రకటించి బాంబు పేల్చినంత పనిచేశారు. అమెరికాతో తొలి దశ ఒప్పందం కుదిరిందని.. తద్వారా దశలవారీగా ఒకరి వస్తువులపై ఒకరు సుంకాలు వెనక్కి తీసుకోనున్నామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీన్ని ట్రంప్‌ కొట్టిపారేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గాంధీ పుట్టిన దేశంలో హింసకు చోటివ్వద్దు

చారిత్రక అయోధ్య తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ‘దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పిచ్చినా..మనం మాత్రం సంయమనం పాటించాలి. వేల ఏళ్ల నాటి భారత సంప్రదాయమైన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత మనదే. సామాజిక సామరస్యాన్ని, పరస్పర ప్రేమను పంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. మహాత్మాగాంధీ పుట్టిన దేశమిది. హింసకు తావుండకూడదు. ఆయన కలలు కన్న దేశ శాంతిని కాపాడటం మన విధి’ అని ప్రియాంక ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అయోధ్య తీర్పు ఏ ఒక్కరి ఘనతా కాదు

చారిత్రక అయోధ్య కేసు వివాదంపై ఈ రోజు సుప్రీం తుది తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు ఘనత ఏ ఒక్కరిదో కాదని, ఎవరికి అనుకూలంగా తీర్పొచ్చినా అందరూ సమానంగా స్వీకరించాలన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘రామ మందిర నిర్మాణంపై చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో మేం కోరుతున్నాం. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

అయోధ్యపై తుది తీర్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి అభ్యంతరకర సందేశాలు, వదంతులు వ్యాప్తి చేయొద్దని ఉత్తరప్రదేశ్‌ డీజీపీ ఓపీ.సింగ్‌ కోరారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని.. అవసరమైతే జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. వదంతుల నుంచి అప్రమత్తంగా ఉండాలని యూపీ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌లో కర్ణాటక జట్టు అరుదైన రికార్డు

పొరుగు రాష్ట్రం కర్ణాటక జట్టు భారత క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పింది. వరుసగా 15 టీ20లు గెలిచి చరిత్ర సృష్టించింది. సయద్‌ ముస్తక్‌ అలీ ట్రోఫీలో భాగంగా గ్రూప్‌ ఏ విభాగంలో కర్ణాటక, ఉత్తరాఖండ్‌ జట్లు టీ20 మ్యాచ్‌ ఆడాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తరాఖండ్‌ 113 పరుగులు చేయగా.. అనంతరం కర్ణాటక 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ రోహన్‌ కదమ్‌(67), మరో బ్యాట్స్‌మన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌(53) అర్ధశతకాలతో చెలరేగడంతో కర్ణాటక రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిందితుడు పార్టీలకు..బాధితురాలిపై నిషేధమా?

సాహితీ రచయిత వైరముత్తుపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అతడిపై ఎలాంటి ప్రభావం చూపలేదని గాయని చిన్మయి శ్రీపాద అసహనం వ్యక్తం చేశారు. అల్వార్‌పేటలో కమల్‌ హాసన్‌ నిర్వహించిన కె. బాలచందర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్‌తోపాటు వైరముత్తు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌, రజనీతో కలిసి వైరముత్తు తీసుకున్న ఫొటోను చిన్మయి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. నిందితుడు వైరముత్తు వేడుకలకు హాజరవుతుంటే బాధితురాలిని చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వాట్సప్‌ గ్రూప్‌కి పేరు పెడుతున్నారా? జాగ్రత్త!

వాట్సప్‌.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే మెస్సేజింగ్‌ యాప్‌. కేవలం చాటింగ్‌ మాత్రమే కాక ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్స్‌తో ఎంతో మందికి చేరువైంది. అదే స్థాయిలో ఈ యాప్‌ను దుర్వినియోగం చేస్తున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. దీన్ని తగ్గించేందుకు గత సంవత్సర కాలంగా వాట్సప్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏదైనా వాట్సప్‌ గ్రూపు పేరుగానీ, ఐకాన్‌ గాని చట్ట విరుద్ధంగా ఉన్నట్లయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సదరు గ్రూపును, అందులోని సభ్యులను వాట్సప్‌ వినియోగించకుండా నిషేధించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ

పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోధిలో ఉన్న బేర్‌ సాహిబ్‌ గురుద్వారాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవంలో భాగంగా  తొలుత ఆయన గురుద్వారాలో పూజలు చేశారు. గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్‌ వద్ద భారత్‌ వైపున ఉన్న కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా.. పాకిస్థాన్‌ వైపున ఉన్న కారిడార్‌ను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రారంభించనున్నారు. ఇక్కడికి వెళ్లడానికి భారత పర్యాటకులకు వీసా అవసరం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.