close

తాజా వార్తలు

ఆర్థిక ప్రగతిని శాసించేది అదే..: వెంకయ్య

హైదరాబాద్‌: గత 18 ఏళ్లుగా స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో 200 పైగా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేని వారి వద్దకే వైద్యాన్ని తీసుకురావడం ఆనందించాల్సిన విషయమన్నారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ స్వర్ణ భారతి ట్రస్టులో కిమ్స్‌ ఆస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, కిమ్స్ డైరెక్టర్‌ డా. భాస్కర్‌రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వారంలో ఒక రోజు వైద్యులు గ్రామాలు, బస్తీలకు వెళ్లాలని సూచించారు. అక్కడి ప్రజలకు ముందస్తు చర్యలపై అవగాహన కల్పించాలని కోరారు. దేశ ప్రజల ఆరోగ్యమే దేశ ఆర్థిక ప్రగతిని శాసిస్తుందని వెంకయ్య పేర్కొన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాయామం, సరైన ఆహారం వల్ల వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ తన సంపదలో కొంత ఇతరుల కోసం వెచ్చించాలని కోరారు. 
ట్రస్టు సేవలు ఆదర్శనీయం: సౌందరరాజన్‌
వైద్యురాలిగా నెల్లూరు స్వర్ణభారతి ట్రస్టులో నిర్వహించిన పలు శిబిరాల్లో పాల్గొన్నానని గవర్నర్‌ సౌందరరాజన్‌ గుర్తు చేసుకున్నారు. వ్యాధులు వచ్చాక వైద్యం కంటే.. రాకుండా చూసుకోవడం మంచిదని చెప్పారు. ట్రస్టు తరఫున గ్రామీణ ప్రజలకు విద్య, వైద్యసేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. సొంత ఖర్చులతో ట్రస్టు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఇక్కడ శిక్షణపొందిన అందరూ ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయమని గవర్నర్‌ అన్నారు.

వ్యవసాయం లేకపోతే.. జీవం లేదు: వెంకయ్య

అనంతరం స్వర్ణభారతి ట్రస్టులో నిర్వహించిన  ‘రైతు నేస్తం’ అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనకు వ్యవసాయ సంబంధ కార్యక్రమాలే ఎక్కువ సంతృప్తి నిస్తాయన్నారు. రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా ఈ అవార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు. ‘వ్యవసాయం లేకపోతే  మనకు జీవం లేదు. అన్నదాతను దేవుడితో సమానంగా చూడాలి.వ్యవసాయం, విద్య, వైద్యంపై ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ చూపాలి. వ్యవసాయానికి  అండగా ఉండటం మన అందరి బాధ్యత. ఒక రైతు బిడ్డగా... నా రాజకీయ జీవితం మొత్తంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. మన సంస్కృతి వ్యవసాయం తో ముడి పడి ఉంది’’ అని వెంకయ్య అన్నారు.

అన్నదాతను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చైతన్యం చేయడంలో రైతు నేస్తం కీలక పాత్ర పోషిస్తుందని, వ్యవసాయ రంగం లో కృషి చేసి వారిని గుర్తించి సన్మానించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధి మార్గాలను వివరిస్తూ ‘అన్నదాత’ పత్రికను నడుపుతున్న రామోజీరావు కృషిని వెంకయ్య కొనియాడారు. వ్యవసాయరంగం లో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాల్సిన సమయం వచ్చిందన్నారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.