close

తాజా వార్తలు

ప్రయాణమేనా... ప్రయోజనాలెన్నో!

 మెట్రోస్టేషన్లలో పలు సౌకర్యాలు

హైదరాబాద్‌: నగర రవాణాలో మెట్రో కీలకం.. ప్రయాణికుల ఆదరణ క్రమంగా పెరుగుతోంది.. దిల్లీ, బెంగళూరు తర్వాత మన దగ్గరే ఎక్కువ మంది మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. సగటున కిలోమీటరుకు ఒక మెట్రోస్టేషన్‌ కనిపిస్తుంది. కేవలం మెట్రో రైల్లో వెళ్లేవారే కాదు ఎవరైనా స్టేషన్‌ను, అక్కడి సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం టికెట్‌ తీసుకోవాల్సిన పనిలేదు.

రహదారి దాటేందుకు..

నగరవాసులు ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ప్రధాన మార్గంలో రహదారి దాటేందుకు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. వాహనాలకు అడ్డుగా వెళ్తుంటారు. అవసరమైన చోట్ల ఫుట్‌ఓవర్‌ వంతెనలు లేకపోవడమే ఇందుకు కారణం. మెట్రోస్టేషన్‌ను ఫుట్‌ఓవర్‌ వంతెనగా ఉపయోగించుకోవచ్చు. 50 మెట్రోస్టేషన్లలో నాలుగైదు మినహా అన్నింటిలోనూ ఈ సౌకర్యం ఉంది.  మెట్లు, ఎస్కలేటర్‌, లిఫ్ట్‌... దేన్నైనా నగరవాసులు వాడుకోవచ్చు.

మరుగుదొడ్లు

మెట్రోస్టేషన్‌లో ఒకవైపు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ప్రయాణికులే కాదు ఎవరైనా వీటిని ఉపయోగించుకోవచ్చు. స్టేషన్‌కు ఒకవైపే ఈ సదుపాయం ఉంటుంది. ఎ, సి మెట్ల మార్గం గుండా మొదటి అంతస్తులోకి వెళితే మరుగుదొడ్డిని చేరుకోవచ్చు. స్టేషన్‌ సమీపంలో పాదచారుల బాటల్లోనూ మరికొన్ని మరుగుదొడ్లు ఉన్నాయి. ఉచితంగా వినియోగించుకోవచ్చు. సులభ్‌కాంప్లెక్స్‌ తరహా మరుగుదొడ్లను మెట్రో కారిడార్‌లో ఏర్పాటు చేశారు. వీటికి మాత్రం రుసుము చెల్లించాల్సిందే.

పాదచారుల బాటలు

మెట్రో మార్గాల్లో స్టేషన్లకు అటు ఇటు 600 మీటర్ల వరకు పాదబాటలను హెచ్‌ఎంఆర్‌ నిర్మించింది. అవి లేని చోట్ల ఎలాగూ రోడ్డు మీద నడుస్తున్నారు. కనీసం ఉన్నచోటైనా కచ్చితంగా పాదబాటలను ఉపయోగిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చు.

ఏటీఎం సేవలు

నగదు తీసుకునేందుకు ఏటీఎంల కోసం వెతుకులాడుతుంటారు చాలామంది. ఎస్‌బీఐ సహా వేర్వేరు బ్యాంకుల ఏటీఎంలు మెట్రో స్టేషన్లలో ఉన్నాయి. అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో ఏటీఎం సేవలు అందిస్తున్నాయి. మిగతా స్టేషన్లలోనూ క్రమంగా ఏర్పాటు చేయనున్నారు.

ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు..

విద్యుత్తు వాహనాల వాడకం క్రమంగా మొదలవుతోంది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. వాహనాలను బట్టి మైలేజీలో తేడాలున్నాయి. వీటికి ఎక్కడ ఛార్జింగ్‌ చేయించాలనేది పెద్ద ప్రశ్న. సులువుగా అందరూ గుర్తించేలా మెట్రో స్టేషన్లలో విద్యుత్తు ఛార్జింగ్‌ పాయింట్లు పలు స్టేషన్లలో ఏర్పాటు  చేశారు. మియాపూర్‌, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, బాలానగర్‌, మూసాపేట, బేగంపేట, తార్నాక, హబ్సిగూడ, స్టేడియం మెట్రోస్టేషన్లలో ఇప్పటికే ఈవీ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. మరిన్ని స్టేషన్లలోనూ ఈవీ పాయింట్లు రాబోతున్నాయి.

అద్దె వాహనాలకు అడ్డా..

అద్దె వాహనాల పోకడ నగరంలో బాగా పెరిగింది. ఇదివరకు కార్లు, సైకిళ్లే దొరికేవి. ఇప్పుడు బైకులు, స్కూటర్లు అద్దెకిచ్చే సంస్థలు నగరంలో చాలా ఉన్నాయి. వీటికోసం ఎక్కడ వెతకాలో అనే బెంగ అక్కర్లేదు. దాదాపు అన్ని మెట్రో స్టేషన్ల దగ్గర అద్దె బైకులు దొరుకుతున్నాయి. పగలు, రాత్రి, సోమ నుంచి శుక్రవారం, వారాంతం, నెలరోజులు... ఎలా కావాలంటే అలా ఇక్కడ దొరుకుతున్నాయి. సైకిళ్లను అద్దెకు తీసుకెళ్లవచ్చు. ఇవి పరిమిత స్టేషన్లలోనే అందుబాటులో ఉన్నాయి.

సేదతీరేలా.. స్ట్రీట్‌ ఫర్నిచర్‌..

మెట్రో మార్గంలో చాలాచోట్ల స్ట్రీట్‌ ఫర్నిచర్‌ ఏర్పాటు చేశారు. హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో వీటిని చూడొచ్చు. ఎల్‌బీనగర్‌ నుంచి విక్టోరియా మెమోరియల్‌ స్టేషన్‌ వరకు పాదబాటలపైన చెట్ల చుట్టూ అరుగులు కట్టి అలంకరించారు. దిల్‌సుఖ్‌నగర్‌ స్టేషన్‌నూ ఈ తరహాలో తీర్చిదిద్దారు. మియాపూర్‌లో పచ్చదనం, స్ట్రీట్‌ ఫర్నిచర్‌, ఆర్ట్‌ స్పేస్‌తో సందర్శనీయ కేంద్రంగా అభివృద్ధి చేశారు.  అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో తరచూ చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ కళాభిమానులను అలరిస్తున్నారు.

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.