close

తాజా వార్తలు

మెట్రో కుదుపులు!

అకస్మాత్తుగా ఆపుతుండటంతో కింద పడిపోతున్న ప్రయాణికులు 
ఈనాడు, హైదరాబాద్‌

మెట్రో ప్రయాణం చల్లగా, హాయిగా సాగుతున్నా అడపాదడపా సాంకేతిక సమస్యలతో కుదుపులు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. మార్గమధ్యలో ఉన్నఫళంగా మెట్రో ఆగినట్లు ఆగి ముందుకు సాగుతుండటంతో నిలబడిన ప్రయాణికులు పడిపోతున్నారు. పదేపదే కుదుపులతో ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న మెట్రోలో ఇతర సాంకేతిక సమస్యలు ప్రయాణికులను తరచూ చికాకు పెడుతున్నాయి. ఆరంభంతో పోలిస్తే నెలలు గడిచే కొద్దీ సాంకేతిక సమస్యలు సర్దుబాటు కావాలి. మెట్రో రైల్లో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఆకాశమార్గంలోని వయాడక్ట్‌లపై ఉన్న ట్రాక్‌లపై ఎవరూ అడ్డొచ్చే పరిస్థితి ఉండదు. మెట్రో వెళ్తూ వెళ్తూ ట్రాక్‌పై ఎవరో అడ్డు వచ్చినట్లుగా బ్రేక్‌ వేస్తుండటంతో కుదుపులకు గురవుతున్నారు. ఇలా ఎందుకు పదేపదే వస్తున్నాయో అర్థం కాక ప్రయాణికులు తికమక పడుతున్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో న్యూమలక్‌పేట దగ్గర మెట్రో కుదుపుతో రైల్లో నిలబడిన చాలామంది ప్రయాణికులు ఒక్కసారిగా పడిపోయారు. నిల్చున్న వారు సీట్లలో కూర్చున్న వారిపై పడ్డారు.

తలుపులు తెరుచుకోక.. 
స్టేషన్‌ రాగానే మెట్రో తలుపులు తెరుచుకుంటాయి.  కొన్నిసార్లు మొరాయిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఎంజీబీఎస్‌ స్టేషన్‌లో మెట్రో ఆగినా తలుపులు తెరుచుకోలేదు. దీంతో 
ప్రయాణికులు తర్వాతి స్టేషన్‌లో దిగి ప్లాట్‌ఫాం మారి మరో మెట్రో ఎక్కి వెనక్కి వచ్చారు. మూడురోజుల క్రితం అమీర్‌పేట స్టేషన్‌లో ఎల్‌బీనగర్‌ వెళ్లే మెట్రో మిగతా కోచ్‌ల తలుపులు తెరిచి ఉండగా ఒక కోచ్‌ తలుపులు మూసుకోవడంతో ప్రయాణికులు అందులోనే ఇరుక్కుపోయారు. ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో మిగతా స్టేషన్ల కంటే రద్దీ ఎక్కువ. ఇక్కడా మిగతా స్టేషన్ల మాదిరే స్వల్ప సమయమే ఆపడంతో చాలామంది మెట్రో ఎక్కబోతూ తలుపుల్లో ఇరుక్కుంటున్నారు.

ఏసీ చాలడం లేదు: ఆదిత్య, రాకేష్‌, నిషిశేఖర్‌ 
హైటెక్‌ సిటీ మార్గంలో ముఖ్యంగా రద్దీ వేళల్లో మెట్రోల్లో సరిపడా ఏసీ రావడం లేదు. నిర్వహణ మరి అధ్వానంగా ఉంది. ఎల్‌ అండ్‌ టీ మెట్రో నిర్వహణ మెరుగ్గా ఉంటుందనుకున్నాం ఈ పరిస్థితిని ఊహించలేదు.

స్వైపింగ్‌ పని చేయలేదు: భరత్‌ తోటపల్లి 
హబ్సిగూడ మెట్రోస్టేషన్‌లో మెట్రో కార్డును రీఛార్జ్‌ చేసుకునేందుకు డెబిట్‌ కార్డు ఇస్తే స్వైపింగ్‌ యంత్రం పనిచేయలేడం లేదని చెప్పారు. బేగంపేట స్టేషన్‌లోనూ ఇదే అనుభవం ఎదురైంది. అప్పుడు నా దగ్గర నగదు లేక మెట్రోలో కాకుండా క్యాబ్‌లో వెళ్లాను.

ఎస్కలేటర్‌ మొరాయింపు: సాయికాంత్‌ 
అమీర్‌పేట స్టేషన్‌లో పైఅంతస్తుకు వెళ్లేందుకు ఎస్కలేటర్‌ పనిచేయలేదు.

ఒకవైపు మార్గం మూత: రియాజ్‌ 
భరత్‌నగర్‌ నుంచి అమీర్‌పేట నిత్యం వెళ్తుంటాను.  ఎంఎంటీఎస్‌ వైపు ఉన్న ఎ, డి ప్రవేశ మార్గాలు తెరవడం లేదు. సమయం చాలా వృథా అవుతోంది. అన్నివైపులా ప్రవేశ మార్గాలు ఎందుకు తెరవడం లేదో అర్థం కావడం లేదు.

మహిళల కోచ్‌లో పురుషులు: శ్రీవిద్య 
మెట్రోలో ప్రత్యేకంగా మహిళలకు కేటాయించిన కోచ్‌లు, సీట్లు ఉన్నాయి. వాటిలో పురుషులు కూర్చుండటంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు.

కార్డులు పనిచేయక.. 
మెట్రోలో సగం మంది స్మార్ట్‌ కార్డుతోనే ప్రయాణిస్తున్నారు. చాలా కార్డులను స్టేషన్లలోని యంత్రాలు గుర్తించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి స్టేషన్‌లోనూ సిబ్బందితో రోజూ వాగ్వాదాలు అవుతున్నాయి. మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించాక కార్డుతోనే బయటకొస్తారు. కార్డు చూపించే బయటకు వస్తున్నా కొన్నిసార్లు నమోదు కావడం లేదు. తర్వాత ఎప్పుడైనా కార్డుతో ప్రయాణం చేయడానికి వస్తే ఆ మార్గంలో పూర్తి ఛార్జీని వసూలు చేస్తున్నారు. అప్పటికే కార్డులో సరిపడా మొత్తం ఉంటే మినహాయించుకుంటున్నారు. లేకపోతే ఆ మేరకు రీఛార్జి చేసుకుంటే అనుమతిస్తున్నారు. ఈ లోపాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.