close

తాజా వార్తలు

మార్గం ఘనం.. పెరగని జనం

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే రెండో పొడవైన మెట్రోరైలు మార్గం కలిగిన హైదరాబాద్‌లో ప్రయాణికుల పరంగా చాలా వెనకబడింది. దూరం ఎక్కువున్నా.. ఎక్కేవారు తక్కువగా ఉన్నారు. దీంతో ఐదో స్థానానికి పరిమితమైంది. కోల్‌కతా, బెంగళూరు, ముంబయిలలో మనకంటే మెట్రో నెట్‌వర్క్‌ తక్కువే ఉన్నా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంది. మెట్రోకి అనుసంధానంగా ఫీడర్‌ సర్వీసులు, పాస్‌లు, ప్రయాణ వేళల్ని పెంచడం ద్వారా ఇక్కడ ప్రయాణికుల సంఖ్య పెంచొచ్చు. తద్వారా ట్రాఫిక్‌, కాలుష్యం సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.
దిల్లీ నగరం అంతటా ఆధునిక మెట్రోరైలు మార్గం విస్తరించింది. 300 కి.మీ. వరకు ఉందని మెట్రో అధికారులు అంటున్నారు. ఇక్కడ సగటున 23.5 లక్షలమంది నిత్యం మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఛార్జీలు పెంచకముందు ఇక్కడ 25 లక్షలుగా ఉండేది.
* కోల్‌కతాలో 27.22 కి.మీ. దూరం మెట్రో సదుపాయం ఉంది. దేశంలోనే మొట్టమొదటి మెట్రో ఈ నగరంలోనే మొదలైంది. ఇక్కడ నిత్యం సగటున 7 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
* ముంబయిలో అత్యంత రద్దీగా ఉండే మార్గంలో 11.40 కి.మీ. మెట్రో మార్గం ఉంది. ఇక్కడ నిత్యం 4 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

బెంగళూరుతో మనకు పోటీ..
దిల్లీ, కోల్‌కతా, ముంబయి నగరాల్లో జనాభా చాలా ఎక్కువ. అక్కడి పరిస్థితులు మన నగరానికి పూర్తి భిన్నం. పొరుగున ఉన్న బెంగళూరుతో హైదరాబాద్‌ను పోల్చవచ్చు. ఇంచుమించు అక్కడ ఇక్కడ ఒకలాంటి పరిస్థితులే ఉన్నాయి.
* బెంగళూరులో 42 కి.మీ. మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. మనలాగే ఇక్కడ రెండు కారిడార్లు పూర్తయ్యాయి. వంకాయ రంగు కారిడార్‌ 24.22 కి.మీ. ఉంది. నిత్యం 2.43 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆకుపచ్చ రంగు కారిడార్‌ 18.08 కి.మీ. మార్గంలో నిత్యం సగటున 2.05 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రెండు కారిడార్లలో కలిపి సగటు ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలకు చేరింది.

మరి మన దగ్గర...
హైదరాబాద్‌లోనూ ప్రస్తుతం రెండు కారిడార్లలో 56 కి.మీ. మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఎరుపు రంగు మార్గం మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ 29 కి.మీ. ఉంది. ఇక్కడ నిత్యం సగటున 1.20 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నీలంరంగు మార్గం నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీకి 27 కి.మీ. ఇటీవలనే పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నిత్యం లక్ష మంది వరకు ప్రయాణిస్తున్నారు. రెండు మార్గాల్లో కలిపి సగటున 2.20 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. బెంగళూరు స్థాయిని చేరుకోవాలంటే వీరి సంఖ్య రెట్టింపు కావాలి. అందుకు మెట్రోవర్గాలు ప్రయాణికుల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

ఇలా చేస్తే..
* మెట్రో, బస్సు, ఎంఎంటీఎస్‌, ఆటో, క్యాబ్‌, అద్దె బైకులు, సైకిళ్లు ఇలా అన్నింటిలోనూ చెల్లుబాటు అయ్యే కామన్‌ మొబిలిటీ కార్డును త్వరగా తీసుకోవాలి. వీటిలో కనీసం రెండు మూడు ఉపయోగిస్తే తప్ప ప్రయాణికులు గమ్యస్థానం చేరలేరు.
* మెట్రో స్టేషన్లకు సమీప కాలనీల నుంచి ఫీడర్‌ సర్వీసులు ప్రవేశపెట్టాలి. ఎలక్ట్రికల్‌ రిక్షాల వంటివి చాలాకాలంగా పరిశీలిస్తున్నా.. ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. వీటిని సత్వరం తీసుకురావాలి.
* మెట్రో స్టేషన్ల వద్ద అద్దె సైకిళ్లు, బైకులు అందుబాటులో ఉంచినా.. అన్ని స్టేషన్లలో లేవు. కి.మీ. దూరంలో ఒక మెట్రో స్టేషన్‌ ఉన్నందున అన్నిచోట్ల ఇవి అందుబాటులో ఉంటే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండనుంది.
* పాఠశాల, కళాశాల విద్యార్థులు సైతం ప్రస్తుతం మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణ ఛార్జీలపై రాయితీ ఇస్తే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయ ఉప కులపతులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.