close

తాజా వార్తలు

చెన్నైలో 4.30గంటలకే.. మన మెట్రో 6.30కు  

చెన్నై మెట్రో అధికారులు ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు తాజాగా ఉదయం 4.30 గంటల నుంచే మెట్రో రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. రాత్రి 11 గంటల వరకు నడుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడా నడపొచ్చు కదా అని నగర ప్రయాణికులు కోరుతున్నారు.  రాత్రి వేళల్లోనూ 12 గంటల వరకు మెట్రో నడపాలని కోరుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

* సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి ఉదయం 4.30 గంటలకు దూర ప్రాంతాలకు రైళ్లు బయలుదేరుతుంటాయి. పలు రైళ్లు అదే సమయంలో నగరానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి ఇళ్లకు చేరేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సిందే. మెట్రో రైళ్లను నడుపుతున్నా అంత ఉదయం నుంచే అందుబాటులో ఉండకపోవడంతో ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి.
* మాదాపూర్‌లో రాత్రి విధులు నిర్వహించే ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం 4, 5 గంటల నడమ షిఫ్ట్‌ ముగించుకుని ఇంటికి బయలుదేరుతుంటారు. వీరికి ఆటోలే దిక్కు. ఉదయం షిఫ్ట్‌కు వచ్చేవారి పరిస్థితీ అంతే. తెల్లవారుజాము నుంచే మెట్రో లేకపోవడంతో హైటెక్‌ సిటీ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చినా వీరికి ఏమాత్రం ఉపయోగ  పడటం లేదు.
* మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి ఉదయం 4 గంటలకే దూర ప్రాంత బస్సులు
బయలుదేరుతాయి. చాలామంది ఉదయమే వెళితే తిరిగి రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చని తెల్లవారుజామునే వెళుతుంటారు. ఆ సమయంలో బస్సులు ఉండక ఆటోలను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడి వరకు వేర్వేరు ప్రాంతాల నుంచి మెట్రో అనుసంధానం ఉన్నా 6.30 గంటలు దాటితే తప్ప సేవలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
* హైదరాబాద్‌లో రాత్రి 12 గంటలలోపు పడుకునేవారు తక్కువే. వృత్తి, ఉద్యోగాలు చేసేవారు గమ్యస్థానం చేరేందుకు అర్ధరాత్రి అవుతుంది. దూరప్రాంతాల నుంచి సిటీకి వస్తుంటారు. రాత్రి పది దాటితే బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఐటీ కారిడార్‌లో అర్ధరాత్రి వరకు సందడి ఉంటుంది. కానీ మెట్రో సేవలు మాత్రం రాత్రి 10.30 గంటలకే బంద్‌ అవుతున్నాయి. భరోసానిచ్చే ప్రజారవాణా లేక అటు ఉదయం.. ఇటు రాత్రి వేళల్లో నగర ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. మెట్రో సేవలను తెల్లవారుజామున మొదలెట్టి అర్ధరాత్రి వరకు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. తద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రజారవాణాను చేరువ చేయడమే కాదు.. ప్రయాణికుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.

మన నగరంలో ఇలా..
ప్రస్తుతం మొదటి, చివరి మెట్రోస్టేషన్లలో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకే మెట్రో రైళ్లు నడుపుతున్నారు. ఆదివారం మాత్రం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10.30 గంటలకు అందుబాటులో ఉంటున్నాయి. మొదట్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు నడిపేవారు. ప్రయాణికులు పెద్దగా ఎక్కడం లేదని ఉదయం 6.30 గంటలకు మార్చారు.

ఐటీ కారిడార్‌ రాక..
మొదట్లో రెండు కారిడార్లు సగం సగం మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కారిడార్‌-1 మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌, కారిడార్‌-3 నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు పూర్తయ్యాక వేళల పొడిగింపుపై ఆలోచిస్తామని ఇప్పటికే మెట్రో అధికారులు పలుమార్లు ప్రకటించారు. ఆ సమయం వచ్చేసిందని ప్రయాణికులు అంటున్నారు.
* ఉదయం 6.30 గంటలలోపు.. రాత్రి 10.30 గంటల తర్వాత నడిపే మెట్రోలను ఇప్పుడు మాదిరి ఆరేడు నిమిషాలకు ఒకటి కాకపోయినా కనీసం 15 నిమిషాలకు ఒకటి నడిపినా చాలంటున్నారు. మొదట్లో అరగంటకు ఒకటి నడిపినా.. డిమాండ్‌నుబట్టి పావుగంటకు ఒకటి నడపవచ్చని సూచిస్తున్నారు. చెన్నై మెట్రో పావుగంటకు ఒకటి నడపాలని నిర్ణయించింది. ఇక్కడా అదేవిధంగా నడపాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు.

ఐపీఎల్‌కు మెట్రోలో..
ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో మెట్రోలోనే వెళుతున్నారు. స్టేడియం సమీపంలోనే స్టేషన్‌ ఉండటంతో మ్యాచ్‌కు వచ్చే ప్రతి ఇద్దరిలో ఒకరు మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. సొంత వాహనాలపై స్టేడియం చేరుకునేందుకు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం, పార్కింగ్‌ సమస్యలతో మెట్రోవైపు మొగ్గు చూపుతున్నారు. మెట్రో వేళలు రాత్రి 10.30 గంటల వరకే అయినా మ్యాచ్‌ రోజు వేళల్ని పొడిగిస్తున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు నడుపుతున్నారు. శుక్రవారం జరిగిన తొలిమ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. మెట్రోలో 21 వేల మంది ప్రయాణించినట్లు ఎల్‌ అండ్‌ టీ మెట్రో వర్గాలు తెలిపాయి. దీంతో మెట్రో మొత్తం ప్రయాణికుల సంఖ్య శుక్రవారం నాడు 2.40 లక్షలకు చేరుకుంది. ప్రారంభం తర్వాత ఈ స్థాయిలో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరగడం ఇదే మొదటిసారి. వేసవిలో ఎండలు మండుతుండటంతో మెట్రోలో ఎక్కేవారు పెరిగారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌ స్టేడియంలో తెరాస సభ ఉండటంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కొందరు మెట్రోలోనే చేరుకున్నారు. హైటెక్‌ సిటీ మెట్రో మార్గంలో శనివారం నుంచి పెద్దమ్మగుడి స్టేషన్‌ అందుబాటులోకి రావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వేళల్ని పొడిగిస్తే 3 లక్షల ప్రయాణికుల మార్కును త్వరలోనే మెట్రో చేరుకునే అవకాశం ఉంది.

పాస్‌లకు ఎదురుచూపులు..
మెట్రో వేళల పొడిగింపుతోపాటు మెట్రో పాసుల కోసం ప్రయాణికుల నుంచి డిమాండ్లు ఉన్నాయి. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చేందుకు త్వరగా ప్రవేశపెట్టాలని కోరుతున్నాయి. నెలవారీ పాసుతోపాటు, స్టేషన్‌ టు స్టేషన్‌ రూటు పాసు కోవాలని కోరుతున్నాయి. రోజువారీ, వారం, వారాంతం ఇలా పలు పాసులు ఉండే అవకాశం ఉంది. అన్నివర్గాలకు అందుబాటులో ఉండేలా పాసు ధరలు ఉంటే మేలని ప్రయాణికులంటున్నారు. వీటితోపాటు విద్యార్థులకు, వికలాంగులకు మెట్రోలో రాయితీ ఇవ్వాలనే విజ్ఞప్తులున్నాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.