
తాజా వార్తలు
దిల్లీ: ఎలక్టోరల్ బాండ్లు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ అంశంపై పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన వ్యక్తంచేసింది. శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ అంశాలను కాంగ్రెస్ సభ్యులు ఉభయ సభల్లో లేవనెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల జారీ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం వ్యవహారాలు ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. నినాదాలు చేసుకుంటూ పొడియంలోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి దాదాపు 15 నిమిషాల పాటు నిరసన వ్యక్తంచేశారు. సభా కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దని సభాపతి ఓం బిర్లా ఎంత చెప్పినా వెనక్కి తగ్గలేదు. హుందాగా ప్రవర్తించడం ప్రతి సభ్యుడి బాధ్యత అనీ.. ఎంతో ప్రాధాన్యమైన క్రీడాకారుల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో సభ్యులు ఇలా ప్రవర్తించడం సరికాదని స్పీకర్ అన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు సీనియర్లు, దయచేసి వెల్‌లోకి రావొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు జీరో అవర్‌లో అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఎలక్టోరల్ బాండ్ల జారీ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయించడం అనేది పెద్ద కుంభకోణమని ఆరోపించారు. దేశం దోపిడీకి గురవుతోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై తమకు మాట్లాడేందుకు అనుమతించాలన్నారు. సభాపతి వ్యాఖ్యలపై అధిర్ స్పందిస్తూ.. ‘‘మీరు గౌరవ సభాపతి. ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు మేం వాయిదా తీర్మానాలు ఇచ్చాం. సభాపతి స్థానాన్ని అగౌరవపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇదో పెద్ద అంశం గనక మేం దానిపై నోటీసు ఇచ్చాం’’ అని అన్నారు.
మోదీ హయాంలో స్వచ్ఛ పాలన: ప్రహ్లాద్ జోషి
ఈ వ్యవహారంపై లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ మైన పాలనను అందిస్తున్నారన్నారు. దేశంలో అవినీతికి ఎలాంటి ఆస్కారంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజూ ఏదో ఒక సమస్యపై వాయిదా తీర్మానాలు ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ సభ్యులు నోటీసు ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసే అంశంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు నోటీసు అందజేశారు. అయితే, ఈ రోజు షెడ్యూల్ ప్రకారం చర్చించాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పడంతో నిరసనకు దిగారు. దీంతో ఛైర్మన్ రాజ్యసభను వాయిదా వేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
