
తాజా వార్తలు
కేవియట్ దాఖలు చేసిన ఆది శ్రీనివాస్
హైదారాబాద్: వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్‌బాబు భారత పౌరసత్వం రద్దు అంశం మరోసారి హైకోర్టుకు చేరింది. చెన్నమనేని హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేవియట్ దాఖలు చేశారు.
వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత విధానాల ద్వారా ఆయన భారతీయ పౌరసత్వం పొందినట్లు నిర్ధారిస్తూ ఆయన పౌరసత్వాన్ని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ పది ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. రమేష్‌బాబు తాను ఎటువంటి నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ అఫిడవిట్లో పేర్కొనడంపైనా హోంశాఖ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రమేష్‌బాబు పౌరసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గతంలో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదుచేశారు.
అదేసమయంలో ఆది శ్రీనివాస్ హైకోర్టును కూడా ఆశ్రయించగా... కేంద్ర హోంశాఖ పరిధిలో ఈ విషయం ఉందని రమేష్‌బాబు కోర్టుకు విన్నవించారు. విచారించిన కోర్టు కేంద్ర హోంశాఖ ఓ కమిటీని నియమించి విషయాన్ని తేల్చాలని చెప్పింది. 2010లో ఎస్.కె.టాండన్ నేతృత్వంలో హోంశాఖ త్రిసభ్య కమిటీని నియమించింది. తన తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులని...తాను జర్మనీలో విద్యాభ్యాసం చేశానని, 1993లో జర్మనీ పౌరసత్వం పొందానని రమేష్ కమిటీ ముందు తన వాదనలు వినిపించారు.
వాదనలు విని, అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఆయన పౌరసత్వం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో 2017లో హోంశాఖ రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దుచేసింది. దాన్ని సవాల్ చేస్తూ రమేష్‌బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విషయాన్ని తేల్చాల్సింది హోంశాఖేనని స్పష్టం చేస్తూ కోర్టు ఈ ఏడాది జులైలో ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో 2019 అక్టోబర్31న ఇరు పక్షాలు తమ వాదనలను హోంశాఖ మందు వినిపించాయి. వాదనలు పరిగణనలోకి తీసుకొని హోంశాఖ రమేష్‌బాబు పౌరసత్వం రద్దు చేస్తూ బుధవారం 13 పేజీల ఉత్తర్వులిచ్చింది.