
తాజా వార్తలు
ముంబయి : ‘ప్రస్తుతం మాకు 119 మంది ఎమ్మెల్యేల బలముంది. త్వరలోనే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘119 మంది ఎమ్మెల్యేలతో మాకు అత్యధిక బలముంది. త్వరలోనే రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుంది. పార్టీ ముఖ్య నాయకుల వద్ద కూడా దేవేంద్ర ఫఢణవీస్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం’ అని చంద్రకాంత్ పాటిల్ వివరించారు. భాజపా ప్రమేయం లేకుండా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదని పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి రాజకీయ కదలికను తమ పార్టీ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు.
ఫలితాల్లో భాజపా 105స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం మరికొంత మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కలిపి ఆ సంఖ్య 119కు చేరిందని పాటిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 1.42 కోట్ల ఓట్లు పోలయ్యాయని పాటిల్ వివరించారు. అందువల్ల భాజపా నంబర్ వన్ స్థానంలో ఉందని, తరువాత స్థానంలో ఎన్సీపీకి 92 లక్షలు, శివసేనకు 90లక్షల ఓట్లు పడ్డాయని చెప్పారు. 1990 నుంచి రాష్ట్రంలో భాజపా తప్ప 100 సీట్లకుపైగా గెలిచిన పార్టీ ఏదీలేదని పాటిల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసిన 164 సీట్లలో 105 చోట్ల గెలుపొందామని, మరో 52 చోట్ల కూడా పార్టీకి రెండో స్థానం దక్కిన విషయాన్ని గుర్తు చేశారు.