ఏ స్థానం నుంచైనా ఎవరైనా పోటీ చేయొచ్చా?
close

తాజా వార్తలు

Updated : 29/03/2019 05:45 IST

ఏ స్థానం నుంచైనా ఎవరైనా పోటీ చేయొచ్చా?

చిన్నూ: ఎవరు ఏ స్థానంలోనైనా పోటీ చేయొచ్చా తాతయ్యా?
ఆర్వీ రామారావ్‌ తాతయ్య: లేదు చిన్నూ! విద్య, ఉపాధి రంగాలతో పాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అందుకే కొన్ని స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు.
చిన్నూ: అంటే ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయా?
తాతయ్య: అవును.
చిన్నూ: అయితే కులాల వారీగా రిజర్వేషన్లు ఉన్నాయా?
తాతయ్య: కులాల, మతాల వారీగా రిజర్వేషన్లు లేవు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చింది. తరతరాలుగా ఈ వర్గాల వారు వెనుకబడి ఉన్నారు కాబట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో లాగే రాజకీయ రంగంలో అంటే చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టారు. ఆ వర్గాల వారికి కూడా రాజకీయంగా ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండేలా తద్వారా అభివృద్ధి చెందేలా ఈ ఏర్పాటు చేశారు.
చిన్నూ: అయితే లోక్‌సభలో ఏయే వర్గాలకు ఎన్ని స్థానాలు రిజర్వు అయి ఉన్నాయి?
తాతయ్య: ప్రస్తుతం లోక్‌సభలో 84 నియోజకవర్గాలు ఎస్సీలకు, 47 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. రాష్ట్రాల శాసనసభల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో ఈ వర్గాల జనాభాను బట్టి రిజర్వేషన్లు ఉన్నాయి.
చిన్నూ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఎన్ని స్థానాలకు రిజర్వేషన్లు ఉన్నాయి?
తాతయ్య: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 నియోజక వర్గాలు ఉంటే అందులో 28 సీట్లు ఎస్సీలకు, 7 స్థానాలు ఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికయ్యే లోక్‌సభ సభ్యుల్లో ఒక స్థానం ఎస్టీలకు, రెండు స్థానాలు ఎస్సీలకు కేటాయించారు.
చిన్నూ: మరి తెలంగాణలో?
తాతయ్య: తెలంగాణలో మొత్తం 119 శాసనసభ స్థానాలుంటే 17 స్థానాలు ఎస్సీలకు, 11 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. అదేవిధంగా 2 స్థానాలు ఎస్టీలకు, మూడు సీట్లు ఎస్సీలకు కేటాయించారు.
చిన్నూ: ఆ స్థానాల్లో ఇతర వర్గాల వారు పోటీ చేయడానికి వీల్లేదా?
తాతయ్య: లేదు. ఆ వర్గాల వారు మాత్రమే పోటీ చేయాలి.
చిన్నూ: మరి ఆ నియోజకవర్గాల్లో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే ఓటు వెయ్యాలా?
తాతయ్య: కాదు. అభ్యర్థులు ఆ వర్గాలకు చెందిన వారే పోటీ చేయాలి. ఓటు మాత్రం అన్ని వర్గాల వారూ వేస్తారు.
చిన్నూ: మరి ఆంగ్లో ఇండియన్లకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయంటారుగా?
తాతయ్య: అవును ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ శాసనసభలో ఆంగ్లో ఇండియన్లకు ఒక్కో స్థానం రిజర్వు చేశారు. అయితే వీరు ఎస్సీ, ఎస్టీల లాగా పోటీ చేసి గెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరి శాతం ఇక్కడ చాలా తక్కువ. అందుకే గవర్నర్‌ వారిని శాసనసభకు నియమిస్తారు. దీన్ని నామినేట్‌ చేయడం అంటారు.
చిన్నూ: లోక్‌సభలోనూ ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక స్థానాలున్నాయా?
తాతయ్య: లోక్‌సభలో రెండు స్థానాలు ఆంగ్లో ఇండియన్లకు కేటాయించారు. వారిని రాష్ట్రపతి నియమిస్తారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని