
తాజా వార్తలు
రోడ్రిగ్స్ విజృంభణతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
గయానా (వెస్టిండీస్): భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్మురేపింది. మరో రెండు మ్యాచులు మిగిలుండగానే వెస్టిండీస్‌పై 3-0తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడో మ్యాచులో టీమిండియా బౌలర్లు ప్రత్యర్థిని కేవలం 59 పరుగులకే పరిమితం చేయడం విశేషం. బౌలర్లు రాధా యాదవ్ (2/6), దీప్తి శర్మ (2/12), అనూజ పాటిల్ (1/13), పూజా వస్త్రకార్ (1/9), హర్మన్‌ప్రీత్ కౌర్ (1/11), పూనమ్ యాదవ్ (1/8) దెబ్బకు విండీస్ విలవిల్లాడింది. పరుగులు చేసేందుకు అల్లాడిపోయింది. చెడీన్ నేషన్ (11; 27 బంతుల్లో), చినెల్ హెన్రీ (11; 18 బంతుల్లో 1×4) టాప్ స్కోరర్లు. కరీబియన్ ఇన్నింగ్స్‌లో కేవలం 2 బౌండరీలు, 1 సిక్సర్ మాత్రమే నమోదైందంటే భారత బౌలర్ల దాడి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు.
చిచ్చరపిడుగు రోడ్రిగ్స్
ప్రత్యర్థి నిర్దేశించిన 60 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. గత రెండు మ్యాచుల్లో వరుస అర్ధశతకాలతో చెలరేగిన షెఫాలీ వర్మ (0) జట్టు పరుగుల ఖాతా తెరవకముందే వెనుదిరిగింది. స్టంపౌటైంది. మరో ఓపెనర్ స్మృతి మంధానా (3; 8 బంతుల్లో) సైతం స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. వీరిద్దరూ హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరారు. సారథి హర్మన్ ప్రీత్ (7; 19 బంతుల్లో 1×4) కాసేపు నిలిచినా భారీ స్కోరు చేయలేదు. జట్టు స్కోరు 37 వద్ద ఆమెను అఫీ ఫ్లెచర్ బోల్తా కొట్టించింది. ఈ క్రమంలో జెమీమా రోడ్రిగ్స్ (40*; 51 బంతుల్లో 4×4) చెలరేగి ఆడింది. ప్రమాదకర బంతులను కాచుకుంటూనే 4 బౌండరీలు బాదింది. చకచకా సింగిల్స్, డబుల్స్ తీసింది. ఆమెకు దీప్తి శర్మ (7*; 19 బంతుల్లో) సహకారం అందించింది. స్వల్ప స్కోరు ఛేదించేందుకు టీమిండియాకు 16.4 ఓవర్లు పట్టడం గమనార్హం.