close

తాజా వార్తలు

చెలరేగిన దీపక్‌.. చివరి టీ20 భారత్‌దే

హ్యాట్రిక్‌తో అదరగొట్టిన దీపక్‌ చాహర్‌
మూడో టీ20లో 30పరుగుల తేడాతో భారత్‌ ఘనవిజయం
2-1తో సిరీస్‌ కైవసం

 

నాగ్‌పుర్: కాస్త తడబాటు.. మధ్యలో కొంచెం కంగారు.. కానీ చివర్లో ఎప్పటిలాగే మళ్లీ ఆధిపత్యం.. మొత్తంగా నాగ్‌పుర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో భారత్‌ విజయం సాధించింది. మొదట బ్యాట్‌తో శ్రేయస్‌ అయ్యర్ (62; 33 బంతుల్లో 3×4, 5×6)), కేఎల్‌ రాహుల్‌ (52; 35 బంతుల్లో 7×4)) మెరవగా.. తర్వాత బంతితో దీపక్ చాహర్ (6/7) హ్యాట్రిక్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఫలితంగా మూడో టీ20లో టీమ్‌ఇండియా 30 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో రోహిత్‌సేన కైవసం చేసుకుంది. దీపక్ చాహర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ దక్కాయి.

నయీమ్ కంగారూ పెట్టినా..
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను దీపక్‌ చాహర్‌ ఆదిలోనే దెబ్బతీశాడు. మూడో ఓవర్‌లో లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మిథున్‌తో కలిసి మహ్మద్‌ నయీమ్‌ (81; 48 బంతుల్లో, 10×4, 2×6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చక్కని షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. వారి జోరు చూస్తే బంగ్లా విజయం ఖాయమన్నట్లే కనిపించింది. కానీ 13వ ఓవర్లో మిథున్‌(27)ను దీపక్‌ ఔట్‌ చేయడంతో 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత భారత్‌దే పైచేయి. శివమ్‌ దూబే(3/30) కీలక వికెట్ల పడగొట్టి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చివర్లో షఫియుల్‌, ముస్తాఫిజుర్‌, అమినుల్‌ ఇస్లామ్‌ను వరుస బంతుల్లో ఔట్‌చేసి దీపక్ చాహర్‌ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో బంగ్లా పోరాటం 19.2 ఓవర్లలోనే 144 పరుగుల వద్దే ముగిసింది. 

రాణించిన శ్రేయస్‌, రాహుల్
శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్ అర్ధశతకాలతో రాణించడంతో.. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లోనే రోహిత్ (2) పెవిలియన్‌కు చేరాడు. దూకుడుగా ఆడే యత్నంలో ధావన్‌ (19) పెవిలియన్‌కు చేరాడు. దీంతో 35 పరగులకే టీమ్‌ఇండియా ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌తో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత బంగ్లా బౌలర్లపై చెలరేగింది. రాహుల్‌ స్ట్రోక్‌ప్లే అదరగొట్టగా శ్రేయస్ సిక్సర్లతో చెలరేగాడు. పంత్‌ (6) మరోసారి నిరాశపరిచాడు. ఆఖర్లో మనీశ్‌ పాండే(22నాటౌట్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్ 174 పరుగులు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో ఫఫియుల్‌, సౌమ్య సర్కార్ చెరో రెండు, అల్‌అమిన్‌ ఓ వికెట్‌ తీశాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.