close

తాజా వార్తలు

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌!!

అవకాశం కోసం ఎదురుచూస్తున్న సంజు శాంసన్‌

ఫామ్‌కు ఢోకాలేదు, రికార్డులకు కొదవలేదు, ప్రతిభకు తిరుగులేదు..అయినా తుది జట్టులో చోటు సంపాదించడానికి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న యువ వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌. బ్యాట్‌తో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడగలిగే ఈ కేరళ కుర్రాడు గ్లోవ్స్‌తో అద్భుతాలు సృష్టించగలడు. 2015లో నీలిరంగు జెర్సీ ధరించిన అతడు ఇప్పటివరకు మరోసారి భారత్‌ తరఫున బరిలోకి దిగలేదు. జట్టులో ఎంపికవుతున్నా తుదిజట్టులో స్థానం కోసం వేచిచూడాల్సివస్తుంది. ఒక్క ఛాన్స్‌ ఇస్తే తన సత్తా ఏంటో చాటి చెప్పడానికి, ధోనీ వారసుడిగా రేసులో నిలబడటానికి ఈ 24 ఏళ్ల కేరళ కుర్రాడు సిద్ధంగా ఉన్నాడు. బంగ్లా టీ20  సిరీస్‌లో రెండు మ్యాచుల్లో అవకాశం దక్కని అతడికి నాగ్‌పుర్‌ వేదికగా ఆదివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లోనైనా చోటు దక్కుతుందా??

సంజు విశ్వనాథ్‌ శాంసన్‌.. గత కొన్ని రోజులుగా వార్తల్లో ఈ పేరు మార్మోగుతోంది. విజయ్‌ హజారె ట్రోఫీలో సంచలన ద్విశతకం, భారత్-ఎ తరుఫున అద్భుత విజయాలు, పంత్‌కు అసలైన పోటీదారుడు.. అంటూ అతడిపై వార్తలు వెల్లువెత్తాయి. దీనికి తోడుగా గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌ వంటి దిగ్గజాల మద్దతు అతడి సొంతం. మొత్తంగా మరోసారి భారత జట్టులో చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీంతో దిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో సంజూకి రీఎంట్రీ దక్కుతుందని భావించారంతా. కానీ, దక్కలేదు. రెండో టీ20లోనైనా తుదిజట్టులో ఉంటాడనుకున్నారు. అదీ జరగలేదు. ఇక మిగిలింది నిర్ణయాత్మక నాగ్‌పుర్ పోరు మాత్రమే. ఈ మ్యాచ్‌లోనై ఛాన్స్‌ ఇస్తే తన వాడి ఏంటో రుచిచూపిస్తానని సంజు శాంసన్ పట్టుదలతో ఉన్నాడు.  

రంజీల్లో కెప్టెన్సీ రికార్డు
కెరీర్‌లో  ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడుదొడుకులు ఎదుర్కొన్న అతడు.. అండర్‌-13 కేరళ జట్టు సారథిగా పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్‌లోనే శతకంతో అదరగొట్టాడు. ఆ తర్వాత అండర్‌-16, అండర్‌-19  కేరళ జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. తన బ్యాటింగ్‌ టెక్నిక్‌తో అందర్నీ ఆకర్షించిన అతడు 2012లో భారత్ అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. యువభారత్ ఆసియాకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2011లో రంజీ ట్రోఫీ ఆడిన అతడు 2015-16 సీజన్‌లో కేరళ జట్టు సారథిగా బాధ్యతలు అందుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో కెప్టెన్‌ అయిన పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. రంజీల్లో అదరగొట్టిన అతడు బోర్డ్‌ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌లో చోటు సంపాదించాడు.

ఐపీఎల్‌లో మెరుపులు
ఐపీఎల్‌ 2012 వేలంలో శాంసన్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. కానీ, అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. తర్వాతి సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడు ఆడిన రెండో మ్యాచ్‌లోనే అర్ధశతకం బాది ‘మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ను అందుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో అర్ధశతకం సాధించిన పిన్నవయస్కుడిగా రికార్డుకెక్కాడు. ఈ సీజన్‌లో 206 పరుగులు బాది ఫర్వాలేదనిపించాడు. 2013 ఐపీఎల్‌ ‘బెస్ట్‌ యంగ్‌ ప్లేయర్‌’గా ఎంపికయ్యాడు.  ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. బ్యాట్‌, గ్లోవ్స్‌తో అదరగొడుతూ జట్టులో ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. 2016లో అతడిని దిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ.4.2 కోట్లకు సొంతం చేసుకుంది. 2017లో పుణెపై శతకం బాది 386 పరుగులు సాధిచాడు. 2018 ఐపీఎల్‌ వేలంలో శాంసన్‌ను రాజస్థాన్‌ తిరిగి దక్కించుకుంది. ఈ సీజన్‌లో 441 పరుగులతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల జరిగిన సీజన్‌లోనూ శతకంతో చెలరేగి 342 పరుగులు బాదాడు.

ఎంపికవుతున్నా చివరికి నిరాశే!
2014 ఇంగ్లాండ్‌  పర్యటనకు సంజు శాంసన్ ఎంపికయ్యాడు. 5 వన్డేలు, టీ20 కోసం ధోనీకి బ్యాకప్ కీపర్‌గా అవకాశం దక్కింది. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి తుదిజట్టులో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత జరిగిన సిరీసుల్లో కూడా సెలక్టర్లు అతడిని ఎంపికచేశారు. కానీ, అదే పునరావృతం అయ్యింది. ఎట్టకేలకు 2015 జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 19 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు నీలిరంగు జెర్సీ ధరించలేదు. భారత్‌ తరఫున ఆడాలని ఎంతో కృషి చేస్తూ దేశవాళీ, భారత్-ఎ తరఫున రాణించాడు. 2018లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్‌-ఎ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, యోయో ఫిటెనెస్‌ టెస్టులో విఫలమవ్వడంతో అవకాశం కోల్పోయాడు. 

అయినా కుంగిపోకుండా తిరిగి పుంజుకొని అద్భుత ప్రదర్శన చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన సిరీస్‌లో ‘మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌’ను అందుకున్నాడు. విజయ్‌ హజారె ట్రోఫీలో గోవాపై ఏకంగా ద్విశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు చేసిన వికెట్‌కీపర్‌గా నిలిచాడు. నిలకడతో పాటు దూకుడుగా ఆడటం అతడి నైజం. అంతేకాకుండా గ్లోవ్స్‌తో చురుకుగా ఉంటూ ప్రత్యర్థులను పెవిలియన్‌కు పంపిస్తుంటాడు. 53 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో అతడు 2,945 పరుగులతో పాటు 71 క్యాచ్‌లు, 7 స్టంప్స్‌ చేశాడు. 88 లిస్ట్‌-ఎ మ్యాచుల్లో 2,281 పరుగులు, 12 స్టంప్స్‌, 92 క్యాచ్‌లు అందుకున్నాడు. మరీ ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ శాంసన్‌కు బంగ్లా ఆఖరి టీ20లో సారథి రోహిత్‌శర్మ అవకాశం ఇస్తాడా? ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధోనీ వారసుడి రేసులో నిలబడతాడా?లేదా మరోసారి అతడికి నిరాశే ఎదురవుతుందా అని తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే!!

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.