close

తాజా వార్తలు

బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా కన్నా ఎవరు మిన్న

శాస్త్రీ-కోహ్లీకి అపరిమిత స్వేచ్ఛ ఇస్తే తప్పేంటి?
సంస్కరణలు ఇష్టంలేని వారే విమర్శలు చేశారు
సీఓఏ అధినేతగా వినోద్‌రాయ్‌ చివరి ముఖాముఖి

‘నైట్‌ వాచ్‌మన్‌’గా వచ్చి 33 నెలలు బీసీసీఐ పాలనా వ్యవహారాలు చక్కదిద్దిన వ్యక్తి మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌. ఎన్నో ఒడుదొడులను ఎదుర్కొని జస్టిస్‌ ఆర్‌ఎం లోధా సిఫార్సులు అమలు చేశారాయన. కోహ్లీ × కుంబ్లే, సీఈవో రాహుల్‌ జోహ్రీపై లైంగిక ఆరోపణలు, మహిళల జట్టు కొత్త కోచ్‌ ఎంపిక, మిథాలీ × పవార్‌ వంటి వివాదాల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టడంతో బోర్డుతో అనుబంధం తెంచుకుంటున్నారు. సీఓఏ అధినేతగా ఆయనిచ్చిన చివరి ముఖాముఖి.


గంగూలీ ది బెస్ట్‌

సౌరవ్‌ గంగూలీ అంటే నాకెంతో గౌరవం. బెంగాల్‌ క్రికెట్‌ సంఘాన్ని ఆయన సమర్థంగా నడిపించిన తీరు నాకెంతో ఇష్టం. బీసీసీఐని ముందుకు తీసుకెళ్లగల నాయకత్వ లక్షణాలు, ముందుచూపు, నైపుణ్యాలు ఆయనకు ఉన్నాయి. బీసీసీఐ పగ్గాలు స్వీకరించేందుకు గంగూలీ కన్నా మెరుగైన వ్యక్తి ఎవరూ లేరు.


బాధ్యతలపై సంతృప్తి 

పాలనా వ్యవహారాల్లో నలుగురు మాజీ క్రికెటర్లు అడుగుపెట్టడం నాకెంతో సంతృప్తిగా అనిపించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, ఐపీఎల్‌ ఛైర్మన్‌గా బ్రిజేష్‌ పటేల్‌, సర్వోన్నత మండలి (అపెక్స్‌ కౌన్సిల్‌)లో శాంత రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌ ఉన్నారు. తొలుత అంగీకరించినట్టే ఆటగాళ్ల సంఘాన్ని ఏర్పాటు చేశాం. చిన్నస్థాయిలో అయినా నాణ్యంగా మహిళల ఐపీఎల్‌ నిర్వహించాం. పూర్తి పారదర్శకంగా ఉన్నాం. 100కు పైగా జరిగిన సీఓఏ సమావేశాల నివేదికలు బీసీసీఐ వెబ్‌సైట్లో ఉన్నాయి. లోధా సిఫార్సులను నీరుగార్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు.


కోర్టులో ఫిర్యాదుల వల్లే

క్రికెట్‌ పాలకుల కమిటీ నిర్దేశిత సమయం కన్నా ఎక్కువే కొనసాగింది. సుప్రీంకోర్టుకు 92 మధ్యంతర ఫిర్యాదులు వచ్చాయి. అమికస్‌ క్యూరీ పీఎస్‌ నరసింహ మధ్యవర్తిత్వం 2019 ఆగస్టుకు ముగిసింది. సుప్రీంకోర్టు 2018, ఆగస్టు 9న ఇచ్చిన తీర్పుకు లోబడే లోధా సంస్కరణలు అమలు చేసేవరకు మేం కొనసాగాం. అసంతృప్తికి లోనైన కొందరు ఎన్నికల నిర్వహణలో సీఓఏ జోక్యాన్ని ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లారు. నేను కలవరపడ్డాను.


సీఏజీ, సీఓఏలో ఏది కష్టం? 

క్రికెట్‌ పరిపాలన మరీ అంత సవాలేమీ అనిపించలేదు. అనర్హతకు గురైన 70 మందితో నాకు పరిచయం లేదు. వారు కేవలం కోర్టులోనే పోరాడారు. నాపై విమర్శలు, ఆరోపణలను పట్టించుకోను. ఇంకా చెప్పాలంటే సంస్కరణలను వ్యతిరేకించే వారే విమర్శలు చేశారని నా విశ్వాసం.


‘విరుద్ధ’ సెగపై సరైన స్పందనే

పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదంపై మా సూచనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సరైన ఉత్తర్వులే ఇచ్చింది. మార్పులకు అంగీకరించింది. క్రికెటర్లకు ఆటగాళ్లుగా తక్కువ జీవితం ఉంటుంది. ఆటలో వారు అనుభవం సంపాదిస్తారు. కామెంటేటర్లు, మెంటార్లు, ఐపీఎల్‌ కోచ్‌లుగా వారినెందుకు తిరస్కరించాలి?


ఆటలోనే శాస్త్రి-కోహ్లీకి స్వేచ్ఛ

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, సారథి కోహ్లీకి అపరిమిత స్వేచ్ఛ ఇచ్చారనడం ఆరోపణే. ఆట పరంగా వారికి స్వేచ్ఛనిస్తే తప్పేముంది? సెలక్షన్‌ ప్రక్రియ, క్రికెట్‌ అంశాల్లో మేం జోక్యం చేసుకోమని ముందే స్పష్టంగా చెప్పాం.


కోహ్లీ×కుంబ్లే వివాదంపై

విరాట్‌ కోహ్లీ, అనిల్‌ కుంబ్లే వివాదంపై సీఓఏ సరిగ్గానే స్పందించింది. ఇప్పుడు దానిపై వ్యాఖ్యానించను. కోచ్‌గా, క్రికెటర్‌గా అనిల్‌ కుంబ్లేపై నాకు అపార గౌరవం ఉంది. ఆ వివాదం అలా వచ్చిపోయింది.


జోహ్రీపై లైంగిక ఆరోపణలపై 

నిబంధనల ప్రకారం జోహ్రీకి సహజ న్యాయం జరగాలని భావించాను. అదే సమయంలో స్వతంత్ర విచారణ కమిటీ వేశాను. తొలి ఫిర్యాదుదారు కనిపించలేదు. ఏం జరిగిందో తెలియదు. మరో ఇద్దరు ఫిర్యాదుదారులు తమ వాదన వినిపించేందుకు కమిటీ అనుమతి ఇచ్చింది. వారేకాదు ఇద్దరు ఆఫీస్‌బేరర్లు సైతం కమిటీ ముందు హాజరయ్యారు. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన న్యాయవాదితో వచ్చినా అంగీకరించాం. ముగ్గురు వ్యక్తుల కమిటీ చివరికి జోహ్రీపై ఆరోపణలు నిరూపణ కాలేదని స్పష్టం చేశారు.


విభేదాలు సహజమే

డయానా ఎడుల్జీతో రెండు విషయాల్లో నాకు అభిప్రాయభేదాలు వచ్చాయి. అవి జోహ్రీపై లైంగిక ఆరోపణలు, మిథాలీరాజ్‌-రమేశ్‌ పవార్‌ వివాదం. పనిచేసే చోట అభిప్రాయభేదాలు సహజం. ఆమె అభిప్రాయాలను నేను గౌరవిస్తా. 23వ తేదీ సాయంత్రం బీసీసీఐతో అనుబంధం పూర్తిగా తెంచుకుంటా. నేనెప్పుడు ఏది వదిలేసినా దాంతో సంబంధాలు ఉంచుకోను. ఇక్కడి నుంచి నేనేమీ మోసుకెళ్లడం లేదు.

- దిల్లీ


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.