close

తాజా వార్తలు

‘నయా వాల్‌’ పుజారాకు ఏమైంది?

శతకం చేసి 8 ఇన్నింగ్స్‌లు
క్రీజ్‌లో కుదురుకోవడానికి ఇబ్బంది

భారత క్రికెట్‌ టెస్ట్‌ జట్టులో ‘నయా వాల్‌’ అంటే గుర్తుకొచ్చేది ఛెతేశ్వర్‌ పుజారా. ‘వాల్‌’గా పేరుగాంచిన రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత ఆ స్థాయిలో టెస్టు క్రికెట్‌లో పేరుగాంచాడు. ద్రవిడ్‌ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే సందిగ్ధతను పుజారా పోగొట్టాడు. తొలినాళ్లలో ఓ ఐదు వన్డేల్లో ఆడినా.. టెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా స్థిరపడిపోయాడు. ఆరంభంలో అదరగొట్టిన ఛెతేశ్వర్‌ క్రమంగా నాటి జోరును చూపించలేకపోతున్నాడు. పుజారా గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క శతకమూ సాధించ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నయా వాల్‌ పరిస్థితేంటో చూద్దాం!

పుజారా విదేశాల్లో పర్వాలేదనిపించినా సొంత దేశాల్లోని మైదానాల్లో తేలిపోతున్నాడు.  ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో ప్రదర్శన అంతంతమాత్రమే. రెండు అర్ధ శతకాలే కనిపిస్తున్నాయి. టెస్టుల్లో స్థానం కోసం పోరాటం చేస్తున్న రోహిత్‌ లాంటివాళ్లు సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే... పుజారా కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2010లో టెస్ట్‌ అరంగేట్రం చేసిన పుజారా అప్పుడప్పుడు ఓపెనర్‌గా దిగినా.. వన్‌డౌన్‌లో సరిగ్గా సరిపోయాడు. పుజారా ఉన్నాడంటే అభిమాని ధీమాగా ఉండేవాడు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. జట్టు విజయాల బాటలో ఉండటం వల్ల తెలియడం లేదు కానీ.. అదే ఒక్క పరాజయం ఎదురైతే... పుజారా ఫామ్‌ గుర్తుకొస్తుంది.

ఆ బ్యాటింగ్‌ సొగసు ఏమైంది?

అరవీర భయంకరమైన బౌలింగ్‌కు తన సొగసైన బ్యాట్‌తో సమాధానం చెప్పే పుజారా గత కొన్ని రోజులుగా బ్యాటింగ్‌లో లయ కోల్పోయినట్లు కనిపిస్తోంది. 2010లో టెస్ట్‌ అరంగ్రేటం చేసిన పుజారా తొమ్మిదేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు మూడు ద్విశతకాలు, 18 శతకాలు, 22 అర్ధశతకాలు సాధించాడు. ఆరంభంలో అదరగొట్టిన పుజారా గతేడాది నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల ముందు టెస్టుల్లో తన చివరి శతకం బాదాడంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ తర్వాత 2019 అక్టోబరు 2న దక్షిణాఫ్రికాపై చేసిన 81 పరుగులే అత్యధికం. ఈ ఏడాది జనవరిలో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో 193 పరుగులు చేశాడు. గత వెస్టిండీస్ పర్యటనలోనూ‌, ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ పెద్దగా రాణించిందేమీ లేదు.

 

విదేశాల్లో ఫర్వాలేదనిపించేలా...

సాధారణంగా ఉపఖండ బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా స్వదేశంలో రాణిస్తూ ఉంటారు. విదేశీ ఫాస్ట్‌ పిచ్‌లపై ఆడేందుకు ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనికి భిన్నంగా పుజారా మాత్రం విదేశీ గడ్డపై తన సత్తా ఏంటో ప్రత్యర్థులకు చూపిస్తుంటాడు. ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్‌లను ఆడేస్తాడు. విదేశాల్లోని ఫాస్ట్‌ పిచ్‌ మైదానాలపై ఎనిమిది శతకాలు, ఆరు అర్ధశతకాలు చేయడంతోపాటు కీలకమైన ఎన్నో ఇన్నింగ్స్‌లను ఆడాడు. మరీ ముఖ్యంగా ఆసీస్‌పై చెలరేగి ఆడటం గమనార్హం. శ్రీలంక, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లపై పుజారాకు మంచి రికార్డు ఉంది. వన్‌ డౌన్‌లో కుదురుకుని ఇటు టాప్‌ ఆర్డర్‌తోపాటు లోయర్‌ ఆర్డర్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలను నిర్మించాడు. గతేడాది ఆఖర్లో ఆస్ట్రేలియా పర్యటనలో మూడు శతకాలు బాదేశాడు.

స్వదేశంలో శతక్కొట్టి రెండేళ్లు 

పుజారా స్వదేశంలో సెంచరీ కొట్టి రెండేళ్లు కావస్తోంది. 2017 నవంబరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పుజారా (143) శతకం చేశాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు స్వదేశంలో ఎనిమిది టెస్ట్‌లు ఆడగా.. చేసిన అత్యధిక పరుగులు 86 (రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో) మాత్రమే. అర్ధశతకాలను శతకాలుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఓపెనర్లు రాణిస్తున్న వేళ వన్‌ డౌన్ బ్యాట్స్‌మెన్‌ చెలరేగితే ఏ జట్టుకైనా విజయం నల్లేరు మీద నడకే. ఆ తర్వాత వచ్చేవారిపై ఒత్తిడి తగ్గించే అవకాశం కలుగుతుంది. అయితే ఒకటీ అరా ఇన్నింగ్స్‌ల్లో తప్ప క్రీజ్‌లో నిలదొక్కుకోవడమే కష్టంగా మారింది. పేస్‌ బౌలింగ్‌ను బాగానే ఎదుర్కొంటున్న పుజారా స్పిన్‌ బౌలింగ్‌లో తడబడటం గమనార్హం. 

 

దక్షిణాఫ్రికాపై ఇలా...

టెస్ట్‌ కెరీర్‌ ఆరంభం నుంచి పుజారా దక్షిణాఫ్రికాపై భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినా పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో 14 టెస్టుల్లో పుజారా ఆడగా.. ఒక శతకం, ఆరు అర్ధశతకాలు మాత్రమే సాధించాడు. క్రీజ్‌లో కుదురున్నా కూడా భారీ ఇన్నింగ్స్‌లను ఆడటంలో విఫలమవుతున్నాడు. ప్రస్తుత సిరీస్‌లోనూ కేవలం రెండు అర్ధశతకాలను మాత్రమే చేశాడు. మిగతా బ్యాట్స్‌మన్‌ రాణించడంతో ఇప్పటికే సిరీస్‌ ఆధిక్యంలో భారత్‌ నిలిచింది. విశాఖపట్నం వేదికగా జరిగిన టెస్ట్‌లో అర్ధశతకం (81) చేసిన పుజారా.. పుణె టెస్ట్‌లోనూ (58) భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాపై 2013లో జొహానస్‌బర్గ్‌ వేదికగా జరిగిన టెస్ట్‌లో శతకం (153) సాధించిన పుజారా ఆ తర్వాత ఒక్కటీ లేదు. ఇప్పటికే ప్రొటీస్‌ జట్టు మూడో టెస్ట్‌లో కష్టాల్లో ఉంది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం ఉండకపోవచ్చు. ఈ క్రమంలో పుజారా శతకానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

 

అప్పుడు డబుల్‌.. ఇప్పుడు డకౌట్‌

రాంచీ మైదానం వేదికగా 2017 మార్చిలో ఆసీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో పుజారా (202) ద్విశతకం బాదాడు. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా పుజారా ఇన్నింగ్స్‌ చిరకాలం గుర్తుండిపోతుంది. అలాంటి ఇన్నింగ్స్ ఆడిన రాంచీ మైదానంలో ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో డకౌట్‌గా వెనుదిరిగడం పుజారా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మరో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. క్రీజ్‌లో ఓపిగ్గా నిలబడి పరుగులు రాబడితేనే జట్టులో స్థానం ఉండే అవకాశముంటుంది. ఇప్పటికే కొత్తతరం బ్యాట్స్‌మెన్‌ జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో పుజారా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలని ఇటు జట్టుతోపాటు క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.