
తాజా వార్తలు
సైబర్ మోసానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు
ఎంవీపీ కాలనీ: ఓ విశ్రాంత ఉద్యోగిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడిన ఇద్దరిని విశాఖ పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు. ఓ నైజీరియన్తో పాటు హరియాణాకు చెందిన మరో వ్యక్తిని విశాఖ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను విశాఖపట్నం సీపీ ఆర్.కె.మీనా బుధవారం మీడియాకు వెల్లడించారు. విశాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగిని నకిలీ ఫేస్బుక్ ఖాతా ద్వారా పరిచయం చేసుకున్న ఇద్దరు నిందితులు.. విదేశీ వస్తువులు, నగదు పార్శిల్లో బహుమతిగా పంపిస్తామని నమ్మించి, అతడితో రూ.34లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఆ తర్వాత వారి ఫోన్ నెంబర్లు పనిచేయలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు విశాఖపట్నం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనంతరం పోలీసులు దిల్లీ వెళ్లి దర్యాప్తు చేపట్టడంతో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. లక్కీ ఓజా అనే నైజీరియన్తో పాటు హరియాణాకు చెందిన సిమ్ కార్డులు విక్రయించే దీపక్ అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై విశాఖ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల నుంచి రూ.2లక్షల నగదు, 95 సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలు, ఒక ల్యాప్‌టాప్, రెండు చెక్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో ఏవైనా కేసులు నమోదయ్యాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు విశాఖ పోలీసులు తెలిపారు.