
తాజా వార్తలు
యూట్యూబ్‌లో వీడియోలు చూసి కిడ్నాప్‌నకు ప్రణాళిక
పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన బాలుడు
ఈనాడు, హైదరాబాద్: పెద్ద ఫోన్ కొనాలి. మంచి దుస్తులు వేసుకోవాలి. ఖరీదైన బండిపై దూసుకెళ్లాలి. జల్సాగా తిరగాలి. ఇంట్లో డబ్బు అడిగితే కొడతారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం చేయాలంటూ యూట్యూబ్‌లో వెతికాడు. ఓ చిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనుభవమున్న నేరస్థుడి మాదిరిగానే బాధితుడి తండ్రిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. రంగంలోకి దిగిన మీర్పేట్ పోలీసులు 14 ఏళ్ల బాలుడు ఇదంతా చేశాడని తెలుసుకుని అవాక్కయ్యారు. అతడి మాట తీరు, సమాధానాలు విని తలలు పట్టుకున్నారు.
* రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ వ్యవహారం సర్వత్రా సంచలనంగా మారింది. స్థానికంగా ఉంటూ పదో తరగతి చదివే బాలుడు వ్యసనాలకు బానిసయ్యాడు. తల్లిదండ్రుల ఆదాయం అంతంత మాత్రం కావడంతో కోరికలు నెరవేరలేదు. కొన్ని రోజుల కింద పక్కింట్లో రూ.లక్ష దొంగతనం చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రులు సర్దుబాటు చేశారు. అప్పటి నుంచి ఎవరికీ దొరకకుండా డబ్బులు సంపాదించడమెలా అంటూ యూట్యూబ్‌లో వెతికాడు. కొన్ని సినిమాల్లోని వీడియోలు చూశాడు. ఆ క్రమంలోనే కిడ్నాప్‌నకు సంబంధించిన వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ వీడియోలను పదే పదే చూస్తూ కొన్ని రోజులు గడిపాడు.
* ఆదివారం కావడంతో పిల్లలంతా బయట ఆడుకుంటుడటం చూసి ఒక్కసారిగా ఆ వీడియోలు గుర్తొచ్చాయి. మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికెళ్తున్నప్పుడు తనకు తెలిసిన చిన్నారి బయట కనిపించింది. ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు తన వెంట తీసుకెళ్లి చిన్నారి తండ్రితో బేరసారాలకు దిగాడు. చెక్కు తీసుకునేందుకు కూడా ముందుకు రావడంపై పోలీసులు ముందుగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కాల్ రికార్డులు విని ఒక్కసారిగా షాకయ్యారు. గంభీరమైన మాటలతో పోలీసులకు చెమటలు పట్టాయి. ఆ చిన్నారిని ఏం చేస్తాడోనంటూ ఆందోళనకు గురయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ డబ్బులతో ఏం చేస్తావని అడిగితే తడుముకోకుండా ముంబయికెళ్లి జల్సా చేస్తానంటూ చెప్పడం చూసి ఆశ్చర్యపోయారు. యూట్యూబ్‌లో చూసినట్లుగానే ఎవరికీ దొరకకుండా పారిపోతాననే నమ్మకంతోనే ఇలా చేసినట్లు చెప్పడంతో పోలీసులు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు.
కిడ్నాప్ కథ సుఖాంతం
బాబు నుంచే తండ్రి నంబరు తెలుసుకొని ఫోన్ చేయించిన బాలనేరగాడు
చాకచక్యంగా గుట్టు రట్టుచేసిన పోలీసులు
నాగోలు, న్యూస్‌టుడే: బాలుడి అపహరణ మిస్టరీ వీడింది. పదిహేనేళ్ల నేరగాడి చెర నుంచి అతడిని విడిపించిన పోలీసులు సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాల ప్రకారం రోడ్డుపక్కన ఆడుకుంటున్న పసివాడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి..అతడితోనే తల్లిదండ్రులకు ఫోన్ చేయించి రూ.3లక్షలు డిమాండ్ చేశాడు.రంగంలోకి దిగిన మీర్‌పేట పోలీసులు ఫోన్ ఛాటింగ్ కొనసాగేలా చూశారు. గొంతును రికార్డు చేశారు. నంబరు ఆధారంగా ఫేస్బుక్ సాయం ద్వారా నేరగాడిని గుర్తించి పట్టుకున్నారు. అతడు ఆల్మాస్‌గూడ వాసి అని చెప్పారు. బాబును గిల్లి ఏడిపించి మరీ ఫోనులో తండ్రికి వినిపించాడు. గొంతు మార్చి, తానే కిడ్నాపర్నంటూ డబ్బు డిమాండ్ చేశాడు. పోలీసులకు చెబితే బిడ్డ ప్రాణాలకే హాని కలుగుతుందనీ హెచ్చరించాడు. రూ.25వేలు సిద్ధమయ్యాయని, మిగతా రూ.2.75లక్షలకు చెక్కు ఇస్తానని బాధితుడి తండ్రి తెలపడంతో..ఆల్మాస్‌గూడలోని ఓ నిర్జన ప్రదేశానికి ఒక్కడివే రావాలన్నాడు. అనంతరం అక్కడ తచ్చాడుతున్న నేరగాడిని సాదా దుస్తుల్లో ఉన్న ఎస్సై ఫేస్‌బుక్‌లోని ఫొటో ఆధారంగా దూరం నుంచి గుర్తించారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో, నేరాన్ని అంగీకరించాడన్నారు. బాబును పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. సినిమాల ప్రభావంతోనే కిడ్నాప్ యత్నం చేశానని బాలనేరగాడు చెప్పడం ఈ కేసులో కొసమెరుపు! సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఏసీపీ జయరాం, మీర్‌పేట ఇన్స్పెక్టర్ యాదయ్య, డీఐ సత్యనారాయణ, ఎస్సై మారయ్య, సిబ్బంది శివరాజ్, సుధాకర్‌రెడ్డి, మహిపాల్ పాల్గొన్నారు..